ఇక్కడి హీరోలు... అక్కడి దర్శకులు!

ABN , First Publish Date - 2021-03-28T05:50:28+05:30 IST

పరభాషా దర్శకులతో పాన్‌ ఇండియా సినిమాలకు సై అంటున్నారు తెలుగు హీరోలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రతిభను ప్రదర్శించిన దర్శకులను తెలుగు హీరోలు పిలిచి మరీ పట్టం కడుతున్నారు

ఇక్కడి హీరోలు... అక్కడి దర్శకులు!

పరభాషా దర్శకులతో పాన్‌ ఇండియా సినిమాలకు సై అంటున్నారు తెలుగు హీరోలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రతిభను ప్రదర్శించిన దర్శకులను తెలుగు హీరోలు పిలిచి మరీ పట్టం కడుతున్నారు. వారితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు హీరో నాగార్జున పరభాషా దర్శకులతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారని అందరూ విమర్శించేవారు. కానీ ఇప్పుడు దాదాపు తెలుగు అగ్రహీరోలందరూ అదే బాటలో నడుస్తున్నారు.  


ఒకే తరహా చిత్రాలు చేయటానికి ఇప్పటి హీరోలు ఇష్టపడటం లేదు. అందుకే కొత్త కథలతో వచ్చే పరభాషా దర్శకులకు ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు. తమ స్థాయినీ, తెలుగు సినిమా స్థాయినీ పెంచే పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పైనే వారి దృష్టంతా. అలాగని పరభాషా దర్శకులందరికీ తెలుగులో అవకాశాలు సులువుగా రావటం లేదు. ముందు తమ మాతృభాషల్లో చిత్రాలు తీసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులకే తెలుగు హీరోల నుంచి పిలుపు వస్తుంది. ఆ తర్వాత తెలుగు హీరోలకు కథను నెరేట్‌ చేస్తున్నారు. 


మోహన్‌రాజా

మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌కు తమిళ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌ కథానాయకుడుగా 2019లో వచ్చిన ‘లూసిఫర్‌’ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర భారీవసూళ్లను రాబట్టింది. చిరంజీవికి కథ బాగా నచ్చటంతో ‘లూసిఫర్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. తొలుత చాలామంది తెలుగు దర్శకుల పేర్లు వినిపించాయి.  స్ర్కిప్ట్‌ సిద్ధం చేసే బాధ్యత ‘సాహో’ దర్శకుడు సుజిత్‌కి అప్పగించారు. ఆయన చిరంజీవిని మెప్పించలేకపోయారు. ఆ తర్వాత వినాయక్‌, బాబీ కూడా రంగంలోకి దిగినా చిరంజీవికి నచ్చలేదు. చివరికి ఆయన  ఆ అవకాశం తమిళ దర్శకుడు మోహన్‌రాజాకు ఇచ్చారు. రామ్‌చరణ్‌ ‘ధ్రువ’ తమిళ మాతృక ‘తని ఒరువన్‌’ డైరెక్టర్‌ ఆయనే. ఆయన చాలా రోజులు కష్టపడి మంచి స్ర్కిప్ట్‌ తయారుచేశారు. తెలుగులో ఇంతకుముందు హనుమాన్‌జంక్షన్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు మోహన్‌రాజా. పూర్తిస్థాయి రీమేక్‌గా కాకుండా ఒరిజినల్‌ పాయింట్‌ తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను మార్చి రాశారు. ‘ఆచార్య’ పూర్తయ్యాక ‘లూసిఫర్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.


ఓం రౌత్‌

‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. ఆయన్ను డైరెక్ట్‌ చేసే అవకాశం పొందటం అంతా ఇప్పుడు అంత సులువు కాదు. కానీ తన మూడో చిత్రంతోనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌. త్రీడీ, మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ, భారీ బడ్జెట్‌, తారాగణంతో సినిమాలను తెరకెక్కించటంలో ఆయన స్పెషలిస్ట్‌. ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రాల్లో హాట్‌ టాపిక్‌గా నిలిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’కు ఆయనే దర్శకుడు. రామాయణం లాంటి సబ్జెక్ట్‌ను టచ్‌ చేసే ధైర్యం ఈ మధ్యకాలంలో ఏ డైరెక్టరూ చేయలేదు. అలాంటిది ఓం రౌత్‌ ధైర్యం, తానాజీతో అతను ఇచ్చిన బంపర్‌ హిట్‌ చూసి ప్రభాస్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. 


ప్రశాంత్‌ నీల్‌

కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తొలి చిత్రం ‘ఉగ్రమ్‌’. 2014లో కన్నడ చిత్రపరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక అప్పటి నుంచి దర్శకుడిగా ప్రశాంత్‌ కెరీర్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లింది. అయితే ప్రశాంత్‌ సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేసిన చిత్రం మాత్రం ‘కేజీఎఫ్‌:చాప్టర్‌ 1’. ఆ సినిమాతో టాలీవుడ్‌, బాలీవుడ్‌ తేడాలేకుండా హీరోలందరూ ప్రశాంత్‌తో సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ‘కేజీఎఫ్‌:చాప్టర్‌ 2’ చిత్రీకరణ పూర్తవుతూనే ఆయన ప్రభాస్‌తో ‘సలార్‌’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. ‘కేజీఎఫ్‌’కు మించి ‘సలార్‌’ను విజువల్‌ వండర్‌గా క్రియేట్‌ చేయటానికి ప్రశాంత్‌ నీల్‌ కృషి చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘సలార్‌’ తర్వాత ఆయన తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ 31వ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇవి పూర్తయ్యాక అల్లు అర్జున్‌తో కూడా ఆయన ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. 


జీతూ జోసెఫ్‌

‘దృశ్యం’ చిత్రానికి కొనసాగింపుగా మలయాళంలో ఇటీవల విడుదలైన ‘దృశ్యం 2’  ఘన విజయం సాధించింది. మోహన్‌ లాల్‌, మీనా ప్రధాన పాత్రలు వహించిన ఈ చిత్రం జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణంగా ఒక భాషలో హిట్టయిన చిత్రాన్ని మరో భాషలో వేరే దర్శకుడితో అక్కడి నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి రీమేక్‌ చేస్తారు. కానీ ‘దృశ్యం 2’ కథను ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపిన విధానం చూసి తెలుగు రీమేక్‌ బాధ్యతలు జీతూ జోసెఫ్‌కి అప్పగించారు.


ఎన్‌. లింగుస్వామి

‘పందెంకోడి’, ‘ఆవారా’ లాంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు తమిళ దర్శకుడు ఎన్‌. లింగుస్వామి. తమిళంలో టాప్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రామ్‌ పోతినేని కథానాయకుడుగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్‌ గత చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. మరో సూపర్‌ హిట్‌ అందుకోవాల్సిన తరుణంలో ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామికి అవకాశం ఇచ్చారు. ‘‘ఆయనతో పనిచేసే అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పటికి నెరవేరింది’’ అని రామ్‌ చెప్పారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.


శంకర్‌

శంకర్‌ దర్శకత్వంలో నటించేందుకు అగ్రహీరోలే చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ అరుదైన అవకాశాన్ని రామ్‌చరణ్‌ అందిపుచ్చుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల తర్వాత శంకర్‌తో ఓ సినిమాను రామ్‌ చరణ్‌ ప్రకటించారు. శంకర్‌ తెలుగు హీరోతో సినిమా చేయటం ఇదే తొలిసారి. ఆయన సినిమా అంటే పాన్‌ ఇండియా స్థాయిలో ఉంటుందనే సంగతి తెలిసిందే.  భారతీయుడు, అపరిచితుడు, రోబో తరహాలోనే చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Updated Date - 2021-03-28T05:50:28+05:30 IST