Mar 7 2021 @ 13:53PM

దర్శకుణ్ని మార్చమన్న హీరో

తమిళంలో విజయకాంత్‌ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘వానతైప్పోలా’ రీమేక్‌ రైట్స్‌ను నిర్మాతలు బెల్లంకొండ సురేశ్‌, శింగనమల రమేశ్‌ కొన్నారు. డాక్టర్‌ రాజశేఖర్‌తో ఆ సినిమాను తెలుగులో తీయాలని వారి ఆలోచన. హీరో దగ్గర గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకొని, దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గరకు వెళ్లారు. తమిళ సినిమా చూసి ఓకే అన్నారు సుబ్బయ్య. ‘మా అన్నయ్య’ అని సినిమాకు పేరు పెట్టి, ఓ మంచి రోజు చూసుకొని చిత్రాన్ని ప్రారంభించారు. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్‌ కొట్టి, షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. అన్ని పేపర్లలో మంచి పబ్లిసిటీ వచ్చింది. 


ఆ సమయంలోనే రాజశేఖర్‌, ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్‌లో ‘మనసున్న మారాజు’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకొని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. మరో పక్క ‘మా అన్నయ్య’ స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ‘మనసున్న మారాజు’ చిత్రానికి మొదట బిజినెస్‌ బాగా జరిగింది. మంచి రేట్లకు మాట్లాడుకొని, కొంత అడ్వాన్స్‌ ఇచ్చి, ఏరియాలు ఖాయం చేసుకొన్నారు బయ్యర్లు. అయితే విడుదల తేదీ దగ్గర పడేసరికి మాట్లాడుకొన్న మొత్తం కాకుండా అందులో కొంత తగ్గిస్తామంటూ బేరాలు మొదలు పెట్టారు. దీనికి కారణం ఏమిటని నిర్మాతలు ఆరా తీస్తే విస్మయకర విషయం బయటపడింది. అదేమిటంటే .. ఆ సమయంలోనే రాజశేఖర్‌ ‘ఒక్కడు చాలు’ అనే సినిమా చేస్తున్నారు. రవిరాజా పినిశెట్టి దానికి దర్శకుడు. ‘మనసున్న మారాజు’ చిత్రం కంటే ‘ఒక్కడు చాలు’ సినిమా బాగుంటుందని హీరో రాజశేఖర్‌ స్వయంగా చెప్పడంతో, పునరాలోచనలో పడిన బయ్యర్లు వెనకడుగు వేశారు. తమ సినిమాలో హీరోగా నటించిన రాజశేఖరే చిత్రం గురించిఅలా చెడు ప్రచారం చేయడం చూసినిర్మాతలు భగవాన్‌, దానయ్య తట్టుకోలేకపోయారు. దర్శకుడు ముత్యాల సుబ్బయ్యకీ షాక్‌ కలిగించిన సంఘటన ఇది.

ఇది జరిగిన మరికొన్ని రోజులకు మరో ఎదురుదెబ్బ తగిలింది ముత్యాల సుబ్బయ్యకి. అదేమిటంటే.. ఓ రోజు ఉదయమే నిర్మాతలు బెల్లంకొండ సురేశ్‌, శింగనమల రమేశ్‌ ఆయన దగ్గరకు వెళ్లి ‘గురువు గారూ.. మీరు ఏమనుకోనంటే ఓ సంగతి చెబుతాం. ‘మా అన్నయ్య’కు వేరే డైరెక్టర్‌ని పెట్టుకుంటున్నాం. మీరు కొంచెం సహకరించాలి’ అన్నారు. ఆ మాట విని నిర్ఘాంతపోయారు ముత్యాల సుబ్బయ్య. అన్నేళ్ల ఆయన కెరీర్‌లో సినిమా ఓపెనింగ్‌ చేసిన తర్వాత దర్శకుడిని మార్చడం అదే మొదటిసారి. అందుకే షాక్‌ నుంచి తేరుకొని ‘అదేమిటి సార్‌.. మనం ఓపెనింగ్‌ చేశాం. అందరికీ తెలిసేలా పబ్లిసిటీ చేశాం. ఇప్పుడు మీరు వచ్చి ఇలా మాట్లాడడం తప్పు కదా సార్‌’ అన్నారు. ‘గురువుగారూ.. మీరేమీ అనుకోవద్దు. ఇందులో మా తప్పేమీ లేదు. హీరో రాజశేఖర్‌గారే మిమ్మల్ని మార్చమని చెప్పారు’ అని అసలు విషయం చెప్పలేక చెప్పారు. ఇది మరో షాక్‌ ముత్యాల సుబ్బయ్యకి. ప్రారంభం నుంచీ తను ఎంతో ఎంకరేజ్‌ చేసిన రాజశేఖర్‌ అలా చేయడం ఆయనకు చాలా బాధ అనిపించింది. అయినా దాన్ని దిగమింగుకొని ‘సరే.. మీ హీరోగారు చెప్పినట్టే చెయ్యండి’ అని చెప్పారు. కానీ ఈ అవమానాన్ని తట్టుకోవడం ముత్యాల సుబ్బయ్యకు చాలా కష్టమైంది. ‘మా అన్నయ్య’ చిత్రానికి ఆయన అడ్వాన్స్‌ కూడా తీసుకోలేదు. ‘తర్వాత తీసుకుందాం.. నిర్మాతలు ఎక్కడికి పోతారు’ అనుకొని మొదట ఊరుకొన్నా, ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా ఉండడం వేస్ట్‌ అనుకొని, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ దర్శకుల సంఘానికి ఓ లేఖ రాశారు. ఆ సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన నిర్మాతలతో మాట్లాడి ముత్యాల సుబ్బయ్యకు నష్టపరిహారం ఇప్పించారు.


- వినాయకరావు