అమ్మ దూరమైందని...

ABN , First Publish Date - 2021-08-06T05:23:34+05:30 IST

తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. గుండెలవిసేలా విలపించాడు. అమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... తానూ తనువు చాలించాడు. తల్లి మరణించిన మూడు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డాడు. టెక్కలి మండలం జగన్నాథపురంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల్లో తీరని విషాదాన్ని నింపింది.

అమ్మ దూరమైందని...
తల్లి వరలక్ష్మి, కుమారుడు బాబూరావు (ఫైల్‌)

- తల్లి మృతితో ఆగిన కుమారుని గుండె

 - మూడు గంటల వ్యవధిలో ఇద్దరూ మృత్యువాత

టెక్కలి మండలం జగన్నాథపురంలో విషాదం

టెక్కలి, ఆగస్టు 5: తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. గుండెలవిసేలా విలపించాడు. అమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... తానూ తనువు చాలించాడు. తల్లి మరణించిన మూడు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డాడు. టెక్కలి మండలం జగన్నాథపురంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల్లో తీరని విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. జగన్నాథపురానికి చెందిన మెండ వరలక్ష్మి (69) అనే వృద్ధురాలు అనారోగ్యంతో గురువారం ఉదయం ఏడు గంటలకు మృతి చెందింది. అక్కడకు మూడు గంటల తరువాత ఉదయం 10 గంటల సమయంలో ఆమె కుమారుడు బాబూరావు (52) గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. బాబూరావు దివ్యాంగుడు. వివాహమైనా, భార్య కొన్నేళ్ల కిందట అతడి నుంచి విడిపోయింది. అప్పటి నుంచి తల్లితో కలిసి నివాసముంటున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి వరలక్ష్మిని బాబూరావు కంటికి రెప్పలా చూసుకునేవాడు. తల్లి మరణంతో మనోవేదనకు గురయ్యాడు. రోదిస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. తల్లీ కూమారుల మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2021-08-06T05:23:34+05:30 IST