తరాలు మారినా మరని తలరాత

ABN , First Publish Date - 2020-08-09T07:53:59+05:30 IST

తరాలు మారినా ఆదివాసుల తలరాతలు మారడం లేదు. అడవినే నమ్ముకొని జీవిస్తున్న..

తరాలు మారినా మరని తలరాత

  •  పోడు భూముల కోసం కొనసాగుతున్న పోరు
  •  నెరవేరని సీఎం కేసీఆర్‌ హామీ
  •  ఏజెన్సీని వణికిస్తున్న కరోనా వైరస్‌
  •  నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

 

ఇల్లెందు/భద్రాచలం, ఆగస్టు 8: తరాలు మారినా ఆదివాసుల తలరాతలు మారడం లేదు. అడవినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసుల జీవితాలు నేటికీ అభద్రతలో కూరుకుపోతున్నాయి. పాలకులు మారుతున్నా మారని తలరాతలతో ఆదివాసులు బతుకు పోరాటం సాగిస్తున్నారు. తమ సంస్కృతి సంప్రదాయలను కాపాడుకుంటూ అడవుల్లోనే బతుకులీడుస్తున్న ఆదివాసులు జల్‌జంగల్‌ జమిన్‌ కోసం పోరాడుతున్నారు. నిన్నటి దాక ప్రకృతి ఒడిలో స్వేచ్చగా సాగు చేస్తున్న పోడుభూముల్లో సాగు చేయవద్దంటూ పాలకులు విధిస్తున్న ఆంక్షలు, మైనింగ్‌, ఇరిగేషన్‌, కోల్‌ తదితర పారిశ్రామిక అవసరాలు, ప్రాజెక్టుల పేరిట అటవి భూములను స్వాదీనం చేసుకుంటున్న పరిణామాలతో ఆదివాసుల ఉనికికే ముప్పు ఏర్పడుతున్న తరుణంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆదివాసీ దినోత్సవాలను తరుణంలో పాలకులు ఆదివాసుల సంక్షేమం కోసం అనేక వాగ్దానాలు చేయడం, తరువాత వాటిని విస్మరించడం పరిపాటిగా మారింది.  


రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా అడవిబిడ్డలు

రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో ఆదివాసీ గిరిజనులు ఉండటం విశేషం. 28 శాతం ఆదివాసీ గిరిజన జనాభాతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా ఆదిలాబాద్‌ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. బ్రిటీష్‌ ఆంత్రోపాలజీస్టు హెమన్‌డార్ప్‌ గిరిజనుల స్థితి గతులపై జరిపిన అఽఽధ్యయనాలు, ఆదివాసీ పోరాట యోదుడుగా, ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న కొమరం భీం పోరాటాల మూలంగా కొంత మేర ఆదివాసుల సంక్షేమం కోసం చట్టాలు వచ్చినా ఆవి పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం మూలంగా ఆదివాసుల జీవన విధానాలు మెరుగు పడలేదు. ప్రధానంగా ఆదివాసులు భూమి కోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్య పోరాటాలు సాగిస్తున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభం కాగానే అటవీ, పోలీసు అధికారులతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు పోడు భూముల్లో హోరాహోరీగా తలపడటం పరిపాటిగా మారింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను స్వయంగా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లి పోడు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇంకా హామీగానే మిగిలింది. 


అతీగతీలేని పోడు పట్టాలు

అటవీహక్కుల చట్టం-2006 ప్రకారం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ హక్కు పత్రాల కోసం 2018 మార్చి 31వరకు 11,01,511ఏకరాల సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని 1,86,879 మంది దరఖాస్తులు సమర్పించారు. అయితే వీటికి మరో రెండు రెట్లు అదనంగా దరఖాస్తులు వచ్చినా గ్రామసభల్లో, సబ్‌డివిజన్‌ స్ధాయి, డివిజన్‌ స్ధాయి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కమిటీలు ప్రాథమిక పరిశీలన దశల్లోనే తొలగించారు. వివిధ దశల పరిశీలనల పిదప వ్యక్తిగత పోడు రైతుల్లో 93,639 మంది రైతులకు, కమ్యూనీటి క్లెయిమ్‌లలో 721 దరఖాస్తులకు సంబందించిన భూములకు మాత్రమే పట్టాలు జారీ చేశారు. మరో 83,757 దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు, 8562 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచినట్లు గిరిజన సంక్షేమశాఖ అదికారులు ప్రకటించారు. అయితే క్షేత్ర స్ధాయిలో మరో 10వేలమంది గిరిజన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల కోసం ఎదురుచూస్తున్నా గడిచిన ఆరేళ్లలో పట్టాలు జారీ కాకపోవడం గమనార్హం.


ఏజెన్సీని వణికిస్తున్న కరోనా 

కరోనా వైరస్‌ ఏజెన్సీ ప్రాంతాలను సైతం వణికిస్తోంది. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న మారుమూల ఏజెన్సీ గ్రామాలు వైరస్‌ విజృంభణతో భయంతో వణికిపోతున్నారు. మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీకి రాకపోకలు పెరగడం, మహానగరాలు, నగరాల్లో నివసించేవారు పల్లెలే సురక్షితమని పల్లెలకు చేరుతుండడంతో గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గిరిజన నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ నేపధ్యంలో ఏజెన్సీలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఏటా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సదస్సులు, సెమినార్‌లు, ర్యాలీలు నిర్వహించగా ఈసారి కొవిడ్‌ నేపధ్యంలో ఆన్‌లైన్‌, సామాజిక మాద్యమాల ద్వారా సమావేశం కావాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. 

 

ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి

- భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్‌ పోట్రు

భద్రాచలంటౌన్‌, ఆగస్టు 8: ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భద్రాచలం ఐటీడీఏ గౌతమ్‌ పోట్రు శనివారం ఓ ప్రకటనలు పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఏజెన్సీ మండలాల్లోని ఆదివాసీ గిరిజనులను ఉత్సహంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదివాసీలకు పీవో శుభాకాంక్షలు తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించాలని తెలిపారు. 

Updated Date - 2020-08-09T07:53:59+05:30 IST