‘ఎడారి’ కష్టాలు

ABN , First Publish Date - 2022-10-07T09:43:33+05:30 IST

సౌదీ అరేబియాలో ఓ తెలుగు మహిళ తన పసిబిడ్డతో కలిసి స్వదేశానికి వెళ్లడానికి అనేక కష్టాలు పడింది.

‘ఎడారి’ కష్టాలు

బిడ్డ బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం ఓ తెలుగు మహిళ పాట్లు

సాయమందించిన ప్రవాసీయులు

నేడు విజయవాడకు తల్లి, బిడ్డ

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)


సౌదీ అరేబియాలో ఓ తెలుగు మహిళ తన పసిబిడ్డతో కలిసి స్వదేశానికి వెళ్లడానికి అనేక కష్టాలు పడింది. తెలుగు ప్రవాసీయులు చేయూతతో ఎట్టకేలకు ఆమె స్వదేశానికి... స్వరాష్ట్రానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విజయవాడకు చెందిన ఒక మహిళ సౌదీ అరేబియాలోని తబూక్‌ ప్రాంతంలోని ఒక మారుమూల ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఏడాది గడువున్న సందర్శకుల వీసాతో భర్త, ఆమె వద్దకు వచ్చారు. వారికో బాబు జన్మించాడు. ఆ బాబు జనన నమోదు ప్రక్రియ కోసం ఆ మహిళ రెండున్నర నెలలపాటు తీవ్రంగా శ్రమించారు. భాషాపరమైన సాంకేతిక సమస్యలతో సర్టిఫికెట్‌ జారీ జాప్యమయింది. ఆ సర్టిఫికెట్‌ లేకపోతే పసిబిడ్డకు పాస్‌పోర్టు జారీ కాదు. మరోవైపు విజిటింగ్‌ వీసాతో వచ్చిన ఆమె భర్త వీసా గడువు దగ్గరపడింది. భర్త వెళ్లిపోతే ఎడారి దేశంలో తన బిడ్డను చూసేవారెవ్వరూ ఉండరన్న దిగులుతో సహాయం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించింది. సహాయం కోసం ఎందరినో అభ్యర్థించింది. ఆమె ఇబ్బందులను తెలుసుకున్న ఓ తెలుగు ప్రవాసీయుడు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకొని వెళ్లారు. ఆ బిడ్డకు సౌదీ జనన సర్టిఫికెట్టు, భారతీయ పాస్‌ పోర్టు జారీ చేయించారు. ఈ రెండింటినీ సౌదీ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ నెలల బిడ్డ దేశం దాటడానికి వీలవుతుంది. దురదృష్టవశాత్తు ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి పుణ్యకాలం దాటిపోయింది. ఆమె భర్త వీసా గడువు ముగిసింది. గత్యంతరం లేక అతను బుధవారం... భార్య, కుమారుడిని వదిలి విజయవాడ వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయిన ఆమెకు రియాద్‌లోని సమాజ సేవకుడు, ఒంగోలు భాగ్యనగర్‌ వాసి... ముజమ్మీల్‌ షేక్‌ అండగా నిలిచారు. ఎట్టకేలకు తన బిడ్డతో సహా స్వదేశానికి వెళ్లడానికి తగిన పత్రాలన్నీ ఆమెకు సమకూరాయి. దీంతో నేడు ఆమె విజయవాడకు పయనమవుతున్నారు. 

Updated Date - 2022-10-07T09:43:33+05:30 IST