కౌలు రైతుల కష్టాలు

ABN , First Publish Date - 2021-09-14T05:42:43+05:30 IST

జిల్లాలో తగినంత భూమి లేని రైతులు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు.

కౌలు రైతుల కష్టాలు

  1. వర్తించని రైతుబంధు
  2. జిల్లాలో 39 వేల మందేనా?
  3. రుణం అందింది 1,017 మందికే 


కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 13: జిల్లాలో తగినంత భూమి లేని రైతులు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతులే పంటలు చేతికి రాక, వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. బ్యాంకుల సాయం అందక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతులకు రుణాలు ఇప్పించి ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పడమే కానీ ఆచరణలో లేదు. 


గుర్తించింది 39వేల మందినే


జిల్లాలో దాదాపు 50 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరు దాదాపు 2 లక్షల హెక్టార్లు సాగు చేస్తున్నారు. గత ఏడాది జూలైలో అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహించి 39వేల మంది కౌలు రైతుల పేర్లను గుర్తించారు. వారికి రుణ అర్హత కార్డులను అందించారు. పొలం యజమానులు అగ్రిమెంట్‌ రాసిచ్చిన వారినే కౌలు రైతులుగా అధికా రులు గుర్తిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తమకు రద్దువుతాయన్న భయం తో పొలం యజమానులు కౌలు రైతులకు అగ్రిమెంట్లు రాసివ్వడం లేదు. అగ్రిమెంటు లేని రైతులను కౌలు రైతులుగా ఎలా గుర్తించాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. 


పంట రుణాలు ఇంతేనా?


గత ఏడాది ఖరీఫ్‌లో 605 మంది కౌలు రైతులకు మాత్రమే బ్యాంకులు రుణం ఇచ్చాయి. రూ.100 కోట్ల దాకా రుణాలు అందించాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే బ్యాంకులు రూ.1.45 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఈ ఏడాదైనా రుణాలు అందిస్తారేమోనని రుణ అర్హత కార్డులు పొందిన కౌలు రైతులు ఆశ పడ్డారు. అయితే 39వేల మందికి గాను 1,017 మందికే.. రూ.184 కోట్ల లక్ష్యానికి గాను రూ.2.72 కోట్లు మాత్రమే బ్యాంకర్లు ఇచ్చారు. ఒక శాతం లక్ష్యాన్ని కూడా బ్యాంకు అధికారులు చేరుకోలేదు. పొలం యజమాని హామీ పత్రం ఉంటేనే కౌలు రైతులు ఇస్తామని బ్యాంకు అధికారులు అంటున్నారు. ఇదేకాకుండా రైతుభరోసా, రాయితీ విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, నష్టపరిహారం చాలా మంది కౌలు రైతులకు అందడం లేదు. 


కౌలు రైతులను గుర్తిస్తున్నాం


జిల్లాలో కౌలు రైతులను గుర్తిస్తున్నాం. ఈ ఏడాది గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు కావడం వల్ల కౌలు రైతుల గుర్తింపు సులువు కానుంది. పొలాలను కౌలుకు తీసుకున్న ప్రతి రైతు పేరు రికార్డుల్లో నమోదు అవుతుంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే కౌలు రైతులు తమ దగ్గరిలోనిసచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల  అధికారుల దృష్టికి తీసికెళ్లి గుర్తింపు కార్డు పొందాలి. 


-వరలక్ష్మి, జేడీఏ


నేడు రైతు సమస్యలపై టీడీపీ నిరసన


 ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం: సోమిశెట్టి, గౌరు


కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 13: వైసీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వారు మాట్లలడుతూ జగన్‌ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిరసనలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారన్నారు. మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో రైతుల కోసం తెలుగుదేశం అనే నినాదంతో కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. తెలుగుదేశం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఓర్వకల్లులో నిరసన చేపడుతారన్నారు.


ఉసురు తీసిన అప్పులు


కొత్తపల్లి, సెప్టెంబరు 13: మండలంలోని దుద్యాల గ్రామానికి చెందిన చిన్ననాగన్న (48) అనే రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్‌ఐ రామనాథ్‌ వివరాల మేరకు.. చిన్ననాగన్నకు 3 ఎకరాల సొంతపొలం ఉంది. రెండేళ్లుగా మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా సరైన దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయాడు. దీంతో పెట్టుబడి, కుటుంబం కోసం చేసిన అప్పులు రూ. పది లక్షల మేర పేరుకుని పోయాయి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన చిన్న నాగన్న ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు కర్నూలు వైద్యశాలకు తరలించగా చిన్ననాగన్న అక్కడ కోలుకోలేక సోమవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్త్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-09-14T05:42:43+05:30 IST