గాడితప్పుతున్న బడి!

ABN , First Publish Date - 2021-02-24T05:30:00+05:30 IST

జిల్లాలో పని చేస్తున్న కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వివాదాల్లో చిక్కుకొని విద్యాశాఖను అబాసుపాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గాడితప్పుతున్న బడి!
తలమడుగులో విద్యార్థిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఈవో

వివాదాల్లో పలువురు ఉపాధ్యాయులు

వైరల్‌ అవుతున్న బేల మండల విద్యాశాఖా అధికారి వీడియోలు

మరో ఉపాధ్యాయురాలిపై పలు ఆరోపణలు

డుమ్మా మాస్టర్లపై వేటు

అయినా మారని తీరు


ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పని చేస్తున్న కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వివాదాల్లో చిక్కుకొని విద్యాశాఖను అబాసుపాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాజానికి ఆదర్శంగా ఉంటూ విద్యార్థులను సరైనమార్గంలో నడిపించే గురువులే విమర్శలకు కేంద్ర బిందువుగా మార డం చర్చనీయాంశంగా మారింది. సుధీర్ఘ కాలం తర్వాత కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి పున: ప్రారంభమైనా సర్కార్‌ బడు ల్లో చదువులు ముందుకు సాగడం లేదంటున్నారు.


ఎక్కువగా పేద, మధ్య తరగతి విద్యార్థులే చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య వివాదాలు తలెత్తి సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది. అసలే చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న జిల్లాను మొదటిస్థానంలో నిలిపేందుకు ఉన్నతాధికారులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు పవిత్రమైన ఉపాధ్యాయవృత్తిని పక్కన పెట్టి ప్రైవేట్‌ వ్యాపారాలపై మోజు చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వడ్డీ వ్యాపారం, రియల్‌ ఎస్టేట్‌, ఇతర ప్రైవేట్‌ వ్యాపారాలలో తలదూర్చుతూ విధులను విస్మరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.


జిల్లాలో అన్ని రకాల పాఠశాలలు కలిపి 1,320 పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో లక్షా30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారుగా 2,500 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయితే తాజాగా బేల మండల విద్యాధికారి కోల నర్సింహులు వీడియో లు వైరల్‌ కావడం, మరో ఉపాధ్యాయురాలు లలితారెడ్డి పలు ఆరోపణ ల్లో చిక్కుకోవడం, మరికొందరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడ డం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 




ఎంఈవోపై ఆర్‌జేడీకి నివేదిక

బేల మండల విద్యాధికారిగా పని చేస్తున్న కోల నర్సింహులు పేకాట ఆడుతూ, మద్యం మత్తులో తూగుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆయన పనితీరు పట్ల విచారణ జరిపిన జిల్లా విద్య శాఖాధికారి ఆర్‌జేడీ వరంగల్‌కు చర్యల నిమిత్తం నివేదిక పంపిన ట్లు తెలిసింది. ఏకంగా ఎమ్మార్సీ భవనంలోనే నిత్యం మద్యం తాగుతూ విధులకు ఎగనామం పెట్టడంపై విద్యాశాఖాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ అధికారికి బేల మండలంతో పాటు తాంసి, భీంపూర్‌ మండలాల ఇన్‌చార్జి బాధ్యతలు ఉన్నాయి.


మండల విద్యాధికారిగా ఉంటూ సక్రమంగా విధులు నిర్వహించకుండా ఇతర ఉపాధ్యాయులతో కలిసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఎంఈవోను వెంటనే సస్పెండ్‌ చేయాలని జిల్లావ్యాప్తంగా డీటీఎఫ్‌, ఉపాధ్యాయ సంఘాల నేతలు బుధవారం నిరసన చేశారు. ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


మరో ఉపాధ్యాయురాలిపై వేటు

తలమడుగు మండల కేంద్రంలోని జడ్పీఎస్‌ ఎస్‌ పాఠశాలలో సోషల్‌ టీచర్‌గా పని చేస్తున్న లలితారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇటీవల అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని విచక్షణ రహితంగా చితకబాది గాయపరిచిన సంఘటనపై దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. దీంతో సదరు ఉపాధ్యాయురాలిని వెంటనే అదే మండలంలోని కుచ్లాపూర్‌ పాఠశాలకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు.


అయినా కొందరు దళిత సంఘా ల నాయకులు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కావడంతో హుటాహుటిన బుధవారం తలమడుగు పాఠశాలను సందర్శించిన డీఈవో రవీందర్‌రెడ్డి బాధిత విద్యార్థితో పాటు పాఠశాల ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ప్రకటించారు. ఈ ఉపాధ్యాయురాలిపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. తాజాగా  విద్యార్థిని దూషిస్తూ చితకబాదడంపై వివాదానికి దారి తీసింది.




ఇప్పటికే పలువురిపై సస్పెన్షన్‌ వేటు

ఇప్పటికే బడికి డుమ్మా కొట్టిన కొందరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అయినా ఉపాధ్యాయుల తీరు మారినట్లు కనిపించడం లేదు. గత నెలరోజుల క్రితం సిరికొండ మండలం కుంటగూడ గ్రామం లో విధులు నిర్వహిస్తున్న రమేష్‌ అనే ఉపాధ్యాయుడు గత ఆరు నెలలుగా విధులకు హాజరుకాకుండా ఇంటర్‌ విద్యార్థిచే పాఠాలను చెప్పి స్తున్న వ్యవహారం బయటకు రావడంతో ఆయనను సస్పెండ్‌ చేశారు.


అదేవిధంగా నేరడిగొండ మండలం శంక్రాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మరో ఉపాధ్యాయుడు కొవిడ్‌ అనంతరం పాఠశాలలు ప్రారంభమైనా.. విధులు నిర్వహించక పోవడంతో అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికా రి ఆయనపై సస్పెండ్‌ వేటు వేశారు.


అలాగే తాంసి మండలంలో మరి కొంత మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. అయినా కొంత మంది ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదన్న ఆరో పణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తలమడుగు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న లలితారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేయడం ఉపాధ్యాయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

 

ఎంఈవోపై చర్యలకు ఆర్జేడీకి నివేదిక

- రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, ఆదిలాబాద్‌

బేల ఎంఈవోగా పని చేస్తున్న కోల నర్సింహులు మద్యం తాగుతూ, పేకాట ఆడే వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దానిపై విచారణ చేపట్టి చర్యల నిమిత్తం వరంగల్‌ ఆర్‌జేడీకి నివేదిక పంపించడం జరిగింది. అలాగే తలమడుగు జడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న లలితారెడ్డిపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా క్రమశిక్షణ చర్యలు తప్పవు.

Updated Date - 2021-02-24T05:30:00+05:30 IST