మహా ఉప్పెన

ABN , First Publish Date - 2022-05-28T06:19:50+05:30 IST

రెండురోజుల పాటు ఒంగోలు వేదికగా జరుగుతున్న మహానాడు శుక్రవారం ఉదయం నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో ఏర్పాటుచేసిన ప్రాంగణంలో ప్రారంభమైంది. ఉదయం 9గంటలకే ప్రతినిధుల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించారు. వివిధ హోదాల్లో ఉన్న మొత్తం 12వేల మందికి పైగా ప్రతినిధులను మహానాడుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆహ్వానాలు పంపారు. అయితే అంతకు రెండు, మూడు రెట్లుగా కార్యకర్తలు, నేతలు తరలివచ్చి నమోదు ప్రక్రియ ప్రారంభ సమయానికే కౌంటర్ల వద్ద తీవ్రరద్దీ ఏర్పడింది.

మహా ఉప్పెన
మహానాడు తొలిరోజు సభకు భారీగా హాజరైన జనం, హాజరైన ప్రతినిధులు, ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

శ్రేణుల్లో ఉత్సాహం.. ఉత్తేజం..

మహానాడుకు పొటెత్తిన కార్యకర్తలు, నేతలు

చంద్రబాబు ప్రసంగానికి అశేష స్పందన

కిటకిటలాడిన మహానాడు ప్రాంగణం

రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు, భోజనశాలల వద్ద తీవ్ర రద్దీ

జగన్‌ పాలనపై ధ్వజమెత్తిన అధినేత

రాష్ట్ర భవిష్యత్‌, ప్రజల కోసమే పోరాటమని స్పష్టం

ఉభయ రాష్ట్రాలకు చెందిన 17 అంశాల పై తీర్మానాలు

ఒంగోలు, మే 27 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ మహానాడుకు పార్టీనేతలు, కార్యకర్తలు పోటెత్తారు. నిర్దేశించుకొని ఆహ్వానాలు పంపిన ప్రతినిధుల కన్నా రెండు మూడు రెట్లు మంది తరలివచ్చారు. అలా వేలాదిమంది తరలిరావడంతో మహానాడు ప్రాంగణం ఉదయం 10గంటలకే కిటకిటలాడిపోయింది. ఇటు ప్రతినిధుల నమోదు కేంద్రాలు, అటు భోజనశాలల వద్ద తీవ్రరద్దీ ఏర్పడింది. అధికశాతం మంది సభ జరిగే లోపలికి వెళ్లలేకపోయారు. పది గంటలకే సభాప్రాంగణం నిండిపోవడంతో అంతకు రెట్టింపు సంఖ్యలో కార్యకర్తలు వెలుపలే ఉండిపోవడంతోపాటు లోపలికి వెళ్లేందుకు తోసుకునే పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన జీవితంలో ఇలాంటి మహానాడును చూడలేదన్నారు. ఒంగోలు ప్రత్యేకమన్నారు. ఆయన ప్రసంగానికి శ్రేణుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. బాబు కూడా ఉత్సాహంగా మాట్లాడారు. ఆ సందర్భంగా సభాప్రాంగణంలోని నేతలు, కార్యకర్తలు కేరింతలు వేస్తూ కోలాహలంగా కనిపించారు.

 రెండురోజుల పాటు ఒంగోలు వేదికగా జరుగుతున్న మహానాడు శుక్రవారం ఉదయం నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో ఏర్పాటుచేసిన ప్రాంగణంలో ప్రారంభమైంది. ఉదయం 9గంటలకే ప్రతినిధుల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించారు. వివిధ హోదాల్లో ఉన్న మొత్తం 12వేల మందికి పైగా ప్రతినిధులను మహానాడుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆహ్వానాలు పంపారు. అయితే అంతకు రెండు, మూడు రెట్లుగా కార్యకర్తలు, నేతలు తరలివచ్చి నమోదు ప్రక్రియ ప్రారంభ సమయానికే కౌంటర్ల వద్ద తీవ్రరద్దీ ఏర్పడింది. 9 గంటల ప్రాంంతంలో ఉమ్మడి జిల్లా నేతలందరూ అధినేత బసచేసిన ఎన్నెస్పీ అతిధిగృహానికి వెళ్ళి సాదర స్వాగతంతో 10గంటలకు మహానాడు ప్రాంగణానికి తీసుకవచ్చారు.   అక్కడికి వచ్చిన చంద్రబాబు తొలుత 40ఏళ్ళ టీడీపీ చరిత్రపై ఏర్పాటు చేసిన డిజిటల్‌ ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాలను ప్రారంభించి 10.40 ప్రాంతంలో వేదికపై రాగా ప్రతినిధుల కేరింతలతో సభ మార్మోగిపోయింది. అప్పటికే ప్రాంగణం పూర్తిగా నిండిపోగా, అంతకు రెట్టింపు మంది వెలుపల గుంపులుగా, గుంపులుగా నిలిచిపోయారు. వేదికపై ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. 


ప్రతినబూనదాం..

పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కార్యక్రమాలను పర్యవేక్షించగా తొలుత ఇటీవల కాలంలో మరణించిన నేతలు, కార్యకర్తల సంతాప తీర్మానాన్ని జిల్లాకు చెందిన వైపాలెం ఇన్‌చార్జీ ఎరిక్షన్‌బాబు ప్రవేశపెట్టారు. అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కే.అచ్చెన్నాయుడు, బి.నరసింహులు ప్రసంగించారు. ఒకవైపు పార్టీ అవిర్భావం జరిగి 40ఏళ్ళు పూర్తి, మరోవైపు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శతజయంతి సమయంలో జరిగే మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్న అచ్చెన్నాయుడు రాష్ట్రంలో దుర్మార్గపు జగన్‌రెడ్డి పాలనను అంతమొందించి తిరిగి చంద్రబాబును సీఎంను చేసేందుకు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ప్రతిబూనాలని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు.


జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపుదాం

ఉదయం 11.35 ప్రాంతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షోపన్యాసం చేశారు. గంటకుపైగా ప్రసంగించిన ఆయన రాష్ట్రంలో వైసీపీ ఆరాచకపాలన, ప్రజలపై మోపుతున్న భారాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం అడ్డుపెట్టుకొని వైసీపీ సాగిస్తున్న అరాచకాన్ని అడ్డుకొని టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మండిపడ్డ చంద్రబాబు జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్రానికి చెందిన 13మంది, తెలంగాణకు చెందిన మూడు, అండమాన్‌కు చెందిన మరొకటి కలిపి మొత్తం 17 అంశాలపై మహానాడు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించారు. రాష్ట్రంలో ప్రధానంగా శాంతిభద్రతలు, ప్రశ్నించే వారిపై దాడులు, వివిధ రకాల భారాలు పెంచి బాదుడే, బాదుడు, వ్యవసాయ రంగం, ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమరంగాల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలు చేశారు. 


జిల్లా నేతలకు అభినందనలు

బాదుడే బాదుడు తీర్మానంపై జిల్లాకు చెందిన కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి మాట్లాడగా సంతాప సభ తీర్మానాన్ని వైపాలెం ఇన్‌చార్జీ ఎరిక్షన్‌బాబు ప్రవేశపెట్టారు. కాగా మహానాడు ప్రతినిధుల సభను దిగ్విజయం చేసిన ఉమ్మడి జిల్లా నేతలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రనేతలు అభినందించారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, దామచర్ల జన్దాన్‌, ఉగ్ర నరసింహారెడ్డి, బీఎన్‌ విజయకుమార్‌, అశోక్‌రెడ్డి, దివి శివరాం, ఇంటూరి నాగేశ్వరరావు, పమిడి రమేష్‌, ఎంఎం కొండయ్య, నూకసాని బాలాజీ, చల్లా శ్రీనివాసరావు, సాయికల్పనారెడ్డి తదితరులు వేదికను అలంకరించిన వారిలో ఉండగా పార్టీ యువనేత, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్య వేదికపై ముఖ్యనేతల అవసరాలను పర్యవేక్షిస్తూ ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. సాయంత్రం వరకు వేలాది మంది కార్యకర్తలు, నేతలు, ఉత్సాహంగా ఉత్తేజంగా సభాప్రాంగణంలో కనిపించారు. 






Updated Date - 2022-05-28T06:19:50+05:30 IST