Abn logo
Mar 30 2021 @ 00:42AM

‘మహా’ సంకటం

రానురాను మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడుతున్నది. ఒక వైపు దేశంలోనే అత్యధికంగా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తుండగా, మరోవైపు హోంమంత్రిపై పోలీసు అధికారి చేసిన ఆరోపణల పర్యవసానాలు తీవ్రంగా పరిణమిస్తున్నాయి. శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లాగైనా సంకటంలోకి నెట్టాలని భారతీయ జనతాపార్టీ, కేంద్రప్రభుత్వం మొదటినుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ రాజకీయ సామర్థ్యం కారణంగా, సంకీర్ణ ప్రభుత్వం అంతర్గత విభేదాలలోకి కూరుకుపోకుండా కొనసాగుతున్నది. తాజాగా, భాగస్వామ్య పక్షాల మధ్య కూడా పొరపొచ్చాలు కనిపించడంతో పరిస్థితిలో మార్పు వస్తోంది. వీటికి తోడు శరద్ పవార్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం, శస్త్రచికిత్స అవసరం కావడంతో మరికొన్ని రోజుల పాటు ఆయన అందుబాటులో ఉండకపోవడం- రానున్న రోజులలో మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను ఆసక్తికరం చేస్తున్నాయి.


ముఖేశ్ అంబానీ 27 అంతస్థుల ఇంటి ఎదుట ఫిబ్రవరి 25వ తేదీన పేలుడు పదార్థాలు, ఒక బెదిరింపు లేఖ ఉన్న స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. తన వాహనం కనిపించడం లేదని ఫిబ్రవరి 18 నాడే ఫిర్యాదు చేసిన స్పార్పియో యజమాని హత్యకు గురయ్యాడు. ఎన్ఐఎ ఈ కేసులోకి ప్రవేశించింది. ఎన్‌కౌంటర్ల స్పెషలిస్టుగా పేరుపొందిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేను అరెస్టు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ఠాకరంగా పరిణమించడంతో ముంబై పోలీసు ఉన్నతాధికారి పరమ్ వీర్ సింగ్‌ను ప్రభుత్వం అప్రధానమైన పదవికి బదిలీచేసింది. పరమ్ వీర్ సింగ్ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌పై ఆరోపణలు చేశారు. బార్లు, పబ్బుల నుంచి నెలకు వందకోట్ల మామూళ్లు వసూలు చేయాలని మంత్రి ఆదేశించారని సింగ్ ఆరోపణ. దరిమిలా, హోంమంత్రిని తొలగించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో దేశ్‌ముఖ్ ఎన్‌సిపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన మీద వచ్చిన ఆరోపణలపై తన కోరిక మేరకు ముఖ్యమంత్రి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తారని దేశ్‌ముఖ్ ఆదివారం నాడు వెల్లడించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఒక వైపు విశ్వప్రయత్నం చేస్తూనే, మరోవైపు పరస్పరం మిత్రపక్షాలు నిందించుకుంటున్నాయి.


అనిల్ దేశ్‌ముఖ్ యాదృచ్ఛికంగా హోంమంత్రి (యాక్సిడెంటల్ హోమ్ మినిస్టర్) అయ్యారని శివసేన ఎంపి సంజయ్ రౌత్ పార్టీ పత్రిక ‘సామ్నా’లో తన కాలమ్‌లో వ్యాఖ్యానించారు. దీనిని ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సిపికి చెందిన అజిత్ పవార్ తప్పుపట్టారు. మంత్రిపదవులన్నవి భాగస్వామ్య పక్షాల నాయకుల నిర్ణయం ప్రకారం జరుగుతాయని, మిత్రపక్షాల ఐక్యతలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరూ చేయవద్దని ఆయన హెచ్చరికతో కూడిన వ్యాఖ్య చేశారు.


ఈమధ్య శరద్ పవార్‌కూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు నడుమ అహ్మదాబాద్‌లో ఒక సమావేశం జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. దాని గురించి అమిత్ షా ను విలేఖరులు ప్రశ్నించగా, అన్ని విషయాలూ బయటకు చెప్పలేమని- అనుమానం కలిగే విధంగా సమాధానం చెప్పారు. అటువంటి సమావేశం ఏదీ జరగలేదని ఎన్‌సిపి వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఇటువంటి వదంతులు ప్రధాన భాగస్వామ్య పక్షాలైన శివసేన- ఎన్‌సిపి మధ్య అపనమ్మకాన్ని పెంచే అవకాశం ఉన్నది. అదే సమయంలో, ప్రభుత్వమే పడిపోయే పక్షంలో తమ భవిష్యత్తు తాము చూసుకోవలసిన అగత్యం భాగస్వామ్యపక్షాలకు ఉంటుంది. అయితే, కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉన్నా, బిజెపితో కలవదు. శివసేన అధినేత ఠాక్రే- బిజెపి నడుమ ఉప్పునిప్పుగా ఉన్నందున వారి మధ్య సయోధ్య సాధ్యపడదు. అయితే గియితే శరద్ పవార్ పార్టీకే ఫిరాయించే అవసరం ఉంటుంది. ఇప్పటివరకు ఆయన మిశ్రమ ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్న తీరు చూస్తే, బిజెపితో చేయి కలుపుతారని విశ్వసించడం కష్టం. ఇటువంటి సంక్లిష్ట సమయంలో, శరద్ పవార్ అస్వస్థులు కావడం రాష్ట్ర రాజకీయాలను ఎటు మలుపు తిప్పుతుందో చూడవలసి ఉన్నది.


దేశం మొత్తం మీద 24 గంటల్లో 68 వేల కొత్త కరోనా కేసులు నమోదు కాగా, అందులో మూడింట రెండువంతులు, 40 వేల కేసులు మహారాష్ట్రలోనే. తాజా లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న ఈ రాష్ట్రం వ్యాధిని సమర్థంగానే ఎదుర్కొంటున్నప్పటికీ, అదుపు చేయలేకపోతున్నది. కొవిడ్–19ను అనేక రాజకీయప్రయోజనాలకు కూడా ఉపయోగించుకున్న కేంద్రప్రభుత్వం, నూతన వ్యాప్తి నెపంతో రాష్ట్ర ప్రభుత్వంపై చర్య తీసుకుంటుందేమోనన్న అనుమానాలు కూడా శివసేన శిబిరంలో ఉన్నాయి. రానున్న గడ్డురోజులను ఆ రాష్ట్రం, ప్రభుత్వం ఎట్లా దాటుతాయో చూడాలి.


జాతీయస్థాయిలో అనేక సమస్యలు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండబోతాయన్న దానిపై ప్రభావితం కానున్నాయి. అస్వస్థత లేకపోతే, ఏప్రిల్ 1 నుంచి శరద్ పవార్ బెంగాల్‌లో మమతా బెనర్జీ పక్షాన ప్రచారంలో పాల్గొనవలసి ఉండింది. ప్రతిపక్షాలకు తగిన స్థైర్యం వచ్చే విధంగా ఫలితాలు ఉంటే, సమస్యలున్న మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా బలం కూడగట్టుకుంటాయి. కేంద్రానికి గట్టి ప్రతిఘటన ఇస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి నైతిక బలం ఇప్పుడు ఆవశ్యకం.

Advertisement
Advertisement
Advertisement