మాస్క్‌డ్ ఆధార్‌పై ప్రభుత్వ సలహా ఉపసంహరణ

ABN , First Publish Date - 2022-05-29T20:57:25+05:30 IST

అధికారిక అనుమతి లేని ప్రైవేటు సంస్థకు వ్యక్తులు తమ ఆధార్ కార్డు

మాస్క్‌డ్ ఆధార్‌పై ప్రభుత్వ సలహా ఉపసంహరణ

న్యూఢిల్లీ : అధికారిక అనుమతి లేని ప్రైవేటు సంస్థకు వ్యక్తులు తమ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీని ఇచ్చేటపుడు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌డ్ ఆధార్ కార్డును వినియోగించాలని సలహా ఇచ్చిన కాసేపటికే ఈ సలహాను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ సలహాను UIDAI ప్రాంతీయ కార్యాలయం అధికారి జారీ చేశారని, దీనిని ఉపసంహరిస్తున్నామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 


UIDAI పత్రికా ప్రకటనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందువల్ల దానిని ఉపసంహరిస్తున్నట్లు ఈ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను ఆదివారం విడుదల చేసింది. ఆధార్ కార్డు హోల్డర్లు తమ ఆధార్ సంఖ్యలను ఉపయోగించేటపుడు, ఇతరులతో పంచుకునేటపుడు సాధారణ వివేకాన్ని వినియోగించాలని మాత్రమే యూఐడీఏఐ తెలిపిందని వివరించింది. 


అంతకుముందు విడుదల చేసిన ప్రకటనలో, ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరింది. కేవలం ఆధార్ కార్డుల మాస్క్‌డ్ కాపీస్‌ను మాత్రమే షేర్ చేయాలని తెలిపింది. ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా జెరాక్స్ కాపీ తీసి ఇతరులకు ఇవ్వాలని తెలిపింది. 


‘‘మీ ఆధార్‌ జెరాక్స్ కాపీని ఏ సంస్థకూ ఇవ్వకండి, ఎందుకంటే, అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేవిధంగా మాస్క్‌డ్ ఆధార్‌ను మాత్రమే ఇవ్వండి’’ అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2022-05-29T20:57:25+05:30 IST