అందరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-06-25T05:29:40+05:30 IST

అందరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి

అందరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి
షాదీముబారక్‌ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌, జూన్‌ 24 : రాష్ట్ర ప్రభుత్వం అనునిత్యం అందరి సంక్షేమానికి కృషి చేస్తుందని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు షాదీముబారక్‌, కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తుందని, ప్రజలకు అవసరమైన సంక్షేమ ఫలాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, నాయకులు బొండల శ్రీనివాస్‌, మాలే లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

  • జిల్లా కోర్టు కోసం భూమి కేటాయించాలి

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే దృష్టికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాధవరెడ్డి తీసుకెళ్లారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి స్థల విషయమై చర్చించారు. సీఎం ఆదేశానుసారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో 25 ఎకరాల్లో కోర్టు భవనం నిర్మించడం జరుగుతుందని, కావున కోర్టుకు అవవైన స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదులు దుద్యాల లక్ష్మణ్‌, జగన్‌, బందయ్య, రాజశేఖర్‌, యాదవరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, అశోక్‌కుమార్‌ తదితరులు ఎమ్మెల్యేను కలిశారు. 

  • బాలకేంద్రంను బాలభవన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలి

వికారాబాద్‌ బాలకేంద్రాన్ని బాలభవన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని బాల కేంద్రం నిర్వాహకులు అనురాధ ప్రభుత్వాన్ని   కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ వికారాబాద్‌లో 1975లోబాలకేంద్రం ఏర్పాటు చేశారని, ఇందులో విద్యార్థులకు నృత్యం, చిత్రలేఖనం, తబలా, సంగీతం, కుట్టు శిక్షణను శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు తమ ప్రతిభ కనబర్చడం జరిగిందని గుర్తుచేశారు. కానీ, గత ఐదు సంవత్సరాలుగా బాలకేంద్రానికి కనీసం కరెంట్‌ సదుపాయం కూడా లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బాలభవన్‌గా మార్చితే సదుపాయాలతో పాటు, శిక్షణా సిబ్బంది ఇతరత్రా సదుపాయాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. బాలకేంద్రంను బాలభవన్‌గా అప్‌గ్రేడ్‌చేసి సౌకర్యాలు కల్పించాలని కోరారు.

  • జర్నలిస్టులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే

వికారాబాద్‌ నియోజకవర్గంలోని జర్నలిస్టులందరికీ అండగా ఉంటానని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై మాట్లాడారు. కాగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుని పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సీనియర్‌ జర్నలిస్టులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జర్నలిస్టు పెద్దలు, జిల్లా ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:29:40+05:30 IST