మల్లారెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి

ABN , First Publish Date - 2021-06-20T05:16:47+05:30 IST

సిద్దిపేట జిల్లాలోని వేములఘాట్‌లో మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుడు, రైతు మల్లారెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని

మల్లారెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి

 కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి


సిద్దిపేట టౌన్‌, జూన్‌ 19: సిద్దిపేట జిల్లాలోని వేములఘాట్‌లో మల్లన్నసాగర్‌  భూనిర్వాసితుడు, రైతు మల్లారెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం సిద్దిపేటలో పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వజనరల్‌ ఆసుపత్రి అనుబంధ మెడికల్‌ కళాశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడారు. ‘‘ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులు దేవుళ్లతో సమానం. మీ అందరినీ అన్ని వేళలా ఆదుకుంటా’’నని నాడు కేసీఆర్‌ హామీ ఇచ్చి నేడు వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నాడని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు అనవసరపు ఖర్చులు చేస్తూ ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాలను తక్కువ ఖర్చుతో నిర్మించి రైతులకు అండగా నిలవాల్సింది పోయి కేసీఆర్‌ దురహంకారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 20న సిద్దిపేటలో సీఎం పర్యటనలో భాగంగా  మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ భూ నిర్వాసితులకు సిద్దిపేట గడ్డ నుంచి వారికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు, నిర్వాసితులు ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్రనాయకులు దరిపల్లి చంద్రం, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మల యాదగిరి, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, నాయకులు తిరుపతిరెడ్డి, తప్పేట శంకర్‌, రాములు, అంజిరెడ్డి, రామచంద్రం, గణేష్‌, చుంచు రమేష్‌, వంగరి నాగరాజు, మాజర్‌ మాలిక్‌, అతీక్‌, రాయీజ్‌, మున్నా, సంతోష్‌, అనిల్‌ పాలొన్నారు.


మల్లారెడ్డిది ప్రభుత్వ హత్యే!

తొగుట, జూన్‌ 19: మల్లారెడ్డిది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యగానే భావించాల్సి వస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు శశిధర్‌ మండిపడ్డారు. వేములఘాట్‌లో రైతు మృతిచెందిన ప్రాంతాన్ని ఆయన సీపీఎం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. మల్లారెడ్డి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్యాకేజీ వెంటనే అందించాలని సూచించారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి. భాస్కర్‌, వెంకట్‌ మావో, నాయకులు రవికుమార్‌, మహేష్‌, అశోక్‌, సంజు, నిర్వాసితులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:16:47+05:30 IST