Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 25 Jan 2022 02:26:41 IST

ఆదాయంపై అబద్ధాలు

twitter-iconwatsapp-iconfb-icon
ఆదాయంపై అబద్ధాలు

 • ‘జీతాల భారం’పై సర్కారువన్నీ సాకులే...
 • కేంద్రం నుంచి ఇతోధికంగా లోటు నిధులు
 • హైదరాబాద్‌ వదులుకున్నందుకు ఏపీకి
 • రూ. 17,000 కోట్లమేర లోటు గ్రాంట్‌
 • కేంద్ర పన్నుల్లో 3వేల కోట్లు రాష్ట్రానికి
 • ఇతరేత్రా కూడా ఢిల్లీ నుంచి సొమ్ములు
 • ఇవన్నీ కలిపి ఆదాయం 1,40,000 కోట్లు
 • గత ఏడాది కంటే 23 వేల కోట్లు ఎక్కువ
 • తెలంగాణ కంటే 2 వేల కోట్లే తక్కువ
 • అయినా, ఆదాయంపై అడ్డగోలు వాదనలు
 • 2020-21లో రాష్ట్ర ఆదాయం రూ.1,17,000 కోట్లు
 • 2021-22లో ఆదాయ అంచనా రూ. 1,40,000 కోట్లు
 • (ముగిసిన 8 నెలల కాలానికి ఇప్పటికే 88 వేలకోట్లు ఖజానాకు) 
 • ఈ ఆదాయంలో అత్యధికం కేంద్ర నుంచి వచ్చిన నిధులే
 • అనూహ్యంగా ఆదాయంలో 23 వేలకోట్ల పెరుగుదల
 • హైదరాబాద్‌ వదులుకున్నందుకు లోటుగ్రాంట్‌ 17 వేలకోట్లు
 • కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా కింద మరో రూ.3 వేల కోట్లు


(అమరావతి - ఆంధ్రజ్యోతి): సొంతంగా సంపద సృష్టించుకుని, ఆదాయం పెంచుకునే చర్యలేవీ లేవు! కానీ... రాష్ట్రానికి రూపాయి రాకలో ఏమాత్రం లోటు లేదు. కేంద్రం నుంచి రకరకాల రూపాల్లో సొమ్ములు ముడుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా అదనపు సహాయమూ అందింది. అయినా సరే... కొవిడ్‌తో ఆదాయం పడిపోయిందని, జీతాలు పెంచలేమని సర్కారు చెబుతోంది.  కనీసం తెలంగాణకు తగ్గకుండా వేతన సవరణ చేయాలంటే.. ఆదాయం బాగా ఎక్కువ ఉన్న ఆ రాష్ట్రంతో పోలిక సరికాదంటోంది. ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదని అధికారులే చెబుతున్నారు. రెవెన్యూ లోటు పూడ్చడానికి కేంద్రం అందిస్తున్న చేయూతతో అనూహ్యంగా రూ. 23వేల కోట్ల మేర ఏపీ ఆదాయం పెరగనుంది. కేవలం 2వేల కోట్లు మాత్రమే ఆర్జనలో తెలంగాణ కంటే ఏపీ వెనుకబడింది. ఈ మాట సమ్మెకు వెళుతున్న ఉద్యోగులో, ప్రతిపక్షాలో అంటున్నది కాదు. ఒక ఏడాది రాష్ట్ర ఆదాయ గ్రాఫ్‌ పరిశీలించినా అర్థమయ్యేది ఇదే! నిన్న ‘కాగ్‌’ కూడా ఇదే చెప్పగా...జీతాల సమస్య తలెత్తకముందు ప్రభుత్వం కూడా ఔను..ఔను అంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.  


ఇవిగో గణాంకాలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం అనూహ్యంగా పెరిగింది. ఎవరు కాదన్నా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని సీఎం జగన్‌, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రావత్‌ పదే పదే చెప్తున్నప్పటికీ అందులో పస లేనేలేదని వాస్తవిక గణాంకాలు నిరూపిస్తున్నాయి. కాగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఈ 8 నెలల గణాంకాలు పరిశీలిస్తే నెలకు సగటున రూ.11,500 కోట్లు చొప్పున ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈ కాలంలో వచ్చిన ఆదాయం రూ.88,600 కోట్లు. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు  నాలుగు నెలల పాటు కూడా ఇదే స్థాయిలో ఆదాయం లెక్కిస్తే రాష్ట్రం మొత్తం ఆదాయం రూ.1,38,000 కోట్లకు చేరుతుంది. మార్చిలో ప్రభుత్వానికి కేంద్రం నుంచి పన్నుల్లో వాటా కింద అదనంగా దాదాపు రూ.2000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఆదాయం రూ.1,40,000 నుంచి రూ.1,41,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో వచ్చిన ఆదాయం కంటే ఇది రూ.23,000 కోట్లు ఎక్కువ. 


అంతా కేంద్రం దయే..

రాష్ట్రానికి పెరిగిన ఆదాయ అంచనాలో సింహభాగం అంటే రూ.17,257 కోట్లను కేంద్రం రెవెన్యూ లోటు గ్రాంటు కింద ఇస్తోంది. విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని కేంద్రం ఈ గ్రాంటుతో భర్తీ చేస్తోంది. ఇందులో మొదటి 8 నెలల్లో రూ.11,500 కోట్లు ఇచ్చేసింది. మిగిలిన రూ.5757 కోట్లను డిసెంబరు నుంచి మార్చిలో నెలల్లో ఇస్తుంది. హైదరాబాద్‌ ను కోల్పోయినందుకు ఇంత భారీగా గ్రాంటు వస్తున్నప్పటికీ విభజన నష్టాల కారణంగా ముఖ్యంగా హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్రం ఆదాయం తగ్గుతోందంటూ సీఎస్‌, ఆర్థిక శాఖ అధికారులు పదే పదే అవాస్తవాలు చెప్తున్నారు. ఈ 8 నెలల్లో ఏపీకి వచ్చిన రూ.88,600 కోట్ల ఆదాయంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో వచ్చినవి రూ.23,500 కోట్లు. ఇందులో  రూ.11,500 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంటు నిధులు, రూ.969 కోట్లు స్థానిక సంస్థలకు వచ్చిన గ్రాంట్లు, మిగిలిన రూ.11,031 కోట్లు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు ఉన్నాయి. 


తిరిగి మూడేళ్లనాటి స్థితికి..

పన్ను ఆదాయానికి వచ్చేసరికి చంద్రబాబు హయంలో తెలంగాణతో పోల్చితే ముందంజలో ఏపీ ఉంది. జగన్‌ వచ్చిన తొలి రెండేళ్లలో బాగా వెనుకబడి ఈ ఏడాది కొంత పురోగతి సాధించింది. చంద్రబాబు దిగిపోయే సంవత్సరం 2018-19లో ఏపీ పన్ను ఆదాయం రూ.62,395 కోట్లు కాగా, ఆ ఏడాది తెలంగాణకు వచ్చిన పన్ను ఆదాయం రూ.59,612 కోట్లు. అలాంటిది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో ఈ వ్యత్యాసం కొంత మేర తగ్గింది. పన్ను ఆదాయం రూ.62,962 కోట్లు రాగా, తెలంగాణకు రూ.64,857 కోట్లు వచ్చింది. అంటే... ఏపీ కంటే తెలంగాణ పన్ను ఆదాయం కేవలం రూ.1895 కోట్లు మాత్రమే ఎక్కువ. 


కొసమెరుపు  ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.10,700 కోట్లమేర అదనపు భారం పడుతుందని సీఎం చెబుతున్నారు. అయితే, ఉద్యోగులు మాత్రం పెరిగే జీతాలు తమకొద్దని, పాతజీతాలే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగుతున్నారు. వారు కోరినట్టుగా... పాతజీతాలు అంటే ప్రభుత్వం దృష్టిలో తక్కువ జీతాలు ఇచ్చి ఖజానాకు రూ.10,700 కోట్లు మిగిల్చినట్టే! మరి ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయడం లేదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.