రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ABN , First Publish Date - 2022-01-26T06:00:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మాట్లాడుతున్న మంత్రి గంగుల

- రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేసేవారిపై కఠిన చర్యల

- కరోనా మూడో దశను కూడా కట్టడి చేస్తాం

- జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌

సుభాష్‌నగర్‌, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం  జిల్లా ప్రజాపరిషత్‌లో చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించిందని అన్నారు. మిల్లర్లు, సీడ్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటేనే యాసంగిలో వరి సాగు చేసుకోవచ్చని అన్నారు. ఒప్పదం చేసుకోని రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. 2018 సంవత్సరం నుంచి 2021 వరకు 1,203 కోట్ల రూపాయల రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతులు దృష్టిసారించాలని, ఈ పంట సాగుతో అధిక లాభాలు వస్తాయని అన్నారు. ఫామ్‌ అయిల్‌ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సబ్సిడీ కూడా అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉందని, రైతులు పాడిపై దృష్టి సారించాలన్నారు. ధరణి పోర్టల్‌ను చూసి బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వాలని, మార్టిగేజ్‌ అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలో 2 కోట్ల 94 లక్షల మందికి ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు అందజేశామన్నారు. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించామన్నారు. కరోనా మొదటి దశ, రెండో దశను సమర్థవంతంగా ఎదుర్కొని కట్టడి చేశామని మంత్రి తెలిపారు. మూడో దశను కూడా కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నప్పటికి ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. ఐదు రోజులుగా వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వేను నిర్వహించి కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేశారన్నారు. కొవిడ్‌ మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ను 104 శాతం పూర్తి చేయగా, 2వ డోస్‌వ్యాక్సిన్‌ను 99.6 శాతం పూర్తిచేసి దక్షిణ భారతదేశంలోనే రెండో స్థానంలో నిలిపినందుకు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తోపాటు వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. మిగిలిన 0.4 శాతం వ్యాక్సిన్‌ మంగళవారంతో పూర్తవుతుందని మంత్రి తెలిపారు. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారికి 60 వేల మందికి వ్యాక్సిన్‌ అందించామని అన్నారు. 

ఫ జిల్లా ఆసుపత్రిలో పీఆర్వో వ్యవస్థను మెరుగుపర్చాలి

జిల్లా ఆసుపత్రిలో పీఆర్వో వ్యవస్థను మెరుగుపర్చాలని జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ జ్యోతిని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చేవారికి ఏ వార్డు ఎక్కడ ఉందో వారికి తెలియదని, పీఆర్వో వారిని అడ్మిట్‌ చేసేంత వరకు వెంట ఉండేట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కరోనా ప్రబలకుండా జాతర నిర్వహించే చోట ఒక మొబైల్‌ మెడికల్‌ టీంను, ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు.  కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను ఇవ్వలేదని, బీఆర్‌జీఎఫ్‌ నిధులను కూడా ఇవ్వాలేదని, దీనిపై ఎంపీ బండి సంజయ్‌తోపాటు ఇతర ఎంపీలు నిధుల విడుదల కోసం కృషి చేయాలన్నారు. 

ఫ అసహనం వ్యక్తం చేసిన మంత్రి...

జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సౌండ్‌ సిస్టమ్‌పై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మంత్రితోపాటు సభ్యులు, అధికారులు మాట్లాడిన మాటలు వినిపించకపోవడంతో ఒకింత అసహనానికి గురయ్యారు. కొత్త సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 

ఫ రైతుల సమస్యలు పరిష్కరించలి

- ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి

వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ టి జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులు వరినే ఎక్కువగా సాగు చేస్తారని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు రైతులను మళ్లించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. బాయిల్డ్‌ రైస్‌కు, రా రైస్‌కు నూకల వ్యత్యాసాన్ని పరిశీలించాలని, మొక్కజొన్న ధరను స్థిరీకరణ చేయాలని సూచించారు. పంటలకు కోతుల బెడద ఉందని, దానిని నివారించేందుకు ఓ మొబైల్‌ టీం ద్వారా కోతులకు ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. పంట రుణాలపై ఇప్పటి వరకు రైతులకు అవగాహన లేదని, ఏ పంటకు ఎంత రుణం ఇస్తున్నారో వారికి తెలియజేయాలన్నారు. రైతులకు తనాఖా లేకుండా రుణాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయన్నారు. జాతీయ బ్యాంకులు ఈ నిబంధనను పాటిస్తున్నా.. కో-ఆపరేటివ్‌ బ్యాంకు మాత్రం తనాఖా పెట్టుకొని రుణాలు ఇస్తున్నారన్నారు. పాల ఉత్పత్తిదారులకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్‌ నాలుగు సంవత్సరాలుగా ఇవ్వడం లేదన్నారు.  ఇందులో మూడు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, రూపాయి డెయిరీ నిర్వాహకులు ఇవ్వాల్సి ఉందని, వీరి మధ్య సమన్వయ లోపంతో పాడి రైతులకు ఇన్సెంటివ్‌ అందడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలన్నారు. 

ఫ ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యం

- కనమల్ల విజయ, జడ్పీ చైర్‌పర్సన్‌ 

జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ మట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి, రైతాంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. జిల్లా ప్రజా పరిషత్‌కు రావాల్సిన 3.5 కోట్ల నిధులు ట్రెజరీలో ఆగిపోయాయని, అభివృద్ధి పనులు ముందుకు సాగాలంటే వాటిని మంజూరు చేయించాలని మంత్రిని కోరారు. 

ఫ హుజూరాబాద్‌ మినహా వడ్డీలేని రుణాలు ఇవ్వలేదు

- గీకురు రవీందర్‌, చిగురుమామిడి జడ్పీటీసీ

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు జిల్లాలో హుజూరాబాద్‌ నియోజకవర్గం మినహా మరెక్కడా ఇవ్వలేదు. 2019-20, 2020-21, 2021-22 వరకు ఎంతమందికి వడ్డీ లేని రుణాలు ఇచ్చారో అధికారులు లెక్కలు చెప్పాలి. స్వశక్తి సంఘాల్లో మహిళలకు జీవిత బీమా కల్పిస్తున్నారు. వారితోపాటు వారి భర్తలకు కూడా జీవిత బీమా కల్పించాలి. పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా ఎలాంటి పంటలు వేయాలి, వాటిని ఎక్కడ అమ్మాలి లాంటి ప్రణాళికలు అధికారులు ఇంతవరకు తయారు చేయలేదు. ఈ విషయంపై రైతు కమిటీలతో అధికారులు చర్చించలేదు. జిల్లా అంతటా రైతు వేదికలు నిర్మించారు కాని అందులో రైతులతో ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదు. వరి మినహా ఇతర ఏదైనా పంట వేయాలని రైతు వేదిక ద్వారా  అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఐదు ఎకరాలకంటే ఎక్కువ భూమి ఉన్నవారికి రైతుబంధు కల్పించవద్దని ఓ 10వ తరగతి విద్యార్థి తన వ్యాసరచనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. 

ఫ ధాన్యం కమీషన్‌ ఇంతవరకు రాలేదు

- చిలుక రవీందర్‌, చొప్పదండి ఎంపీపీ

ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన కమీషన్‌ ఇంత వరకు రాలేదు. ఈజీఎస్‌లో భాగంగా నిర్మించిన వైకుంఠధామాల్లో బోరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించలేదు. మిషన్‌ భగీరథ పథకం అధికారులను కూడా సంప్రదించాం.. తమ పనులు పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించామని చెప్పారు. ప్రకృతి వనాలు, వైకుంఠధామాల్లో విద్యుత్‌, నీటి సౌకర్యం కల్పించేందుకు ఆదేశాలు జారీ చేయాలి. 

ఫ ప్రైవేట్‌ ఆసుపత్రుల ఫీజులను నియంత్రించాలి

- శేఖర్‌ గౌడ్‌, మానకొండూర్‌ జడ్పీటీసీ

కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు ట్రీట్‌మెంట్‌ పేరుతో అధిక ఫీజులు వసూలు చేశారు. ఎలాగైనా తమ వారిని కాపాడుకోవాలని వారు అడిగినంత కట్టారు. దాంతో చాలామందిపై ఆర్థిక భారం పడింది. రానున్న రోజుల్లో మరేదైనా విపత్తు వస్తే ప్రజలు తట్టుకోలేరు. కాబట్టి ప్రైవేట్‌ ఆసుపత్రుల ఫీజులను నియంత్రించాలి. మానకొండూరు మండలంలోని రంగపేటలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం కోసం మొక్కలను పెంచుతున్నారు. వాటికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సకాలంలో నీరు అందక మొక్కలు చనిపోతున్నాయి. మొక్కలను పెంచే చోటనే బోరు వేస్తే మొక్కలను కాపాడుకోగలం. 

ఫ రూర్బన్‌ మిషన్‌ వివరాలు ఇవ్వలేదు

- శ్రీరాం శ్యాం, జమ్మికుంట జడ్పీటీసీ

జమ్మికుంట పరిధిలో అమలు చేస్తున్న రూర్బన్‌ మిషన్‌ పథకం వివరాలు అడిగితే ఇంతవరకు ఇవ్వలేదు. జమ్మికుంటతోపాటు ఇల్లందకుంట వివరాలు ఇవ్వాలి. 

సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, జడ్పీటీసీలు, కో-ఆప్షన్‌ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ డిప్యూటీ సీఈవో పవన్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-26T06:00:55+05:30 IST