Abn logo
Jun 11 2021 @ 03:43AM

ధనాధన్‌.. ఫటాఫట్‌!

వేగంగా భూముల అమ్మకానికి సర్కారు సన్నద్ధం.. 20 వేల కోట్లు లక్ష్యం

అధికారులతో 4 అంచెల కమిటీలు..

రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

రాష్ట్రమంతటా అన్ని ప్రభుత్వ విభాగాల్లో వృథాగా పడిఉన్న భూముల గుర్తింపు

న్యాయ చిక్కుల్లేనివి, ముందే కొలిచి సరిహద్దులు గుర్తించాలి

కన్సల్టెంట్ల సాయంతో ధర నిర్ణయించాలి..

కొనుగోలుదారులకు రెడ్‌ కార్పెట్‌

భూములు చూపించేందుకు బృందాలు..

ఈ-వేలం పద్ధతిలో భూముల వేలం

కొన్న 3 వారాల్లో భూమి అప్పగింత..

నిర్మాణాలకు వారంలో అనుమతులు


హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు ఆర్థికంగా సతమతం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భూముల అమ్మకం ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించడంతో పాటు వాటిని అమ్మే విధానాన్ని సరళీకరించే చర్యలను తీసుకుంది. భూములు అమ్మాలన్న నిర్ణయం కొత్తేమీ కాదు. గతంలో కూడా ప్రభుత్వం అనేక దఫాలు అనుకుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి ముందుకు పడలేదు. పరిస్థితులు అనుకూలించక పోవడంతో పాటు పరిపాలన పరంగా నిర్ణయలేమి కూడా ఒక కారణం. దాన్ని దృష్టిలో పెట్టుకొనిఅలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా భూముల అమ్మకం చకచకా జరిగే విధంగా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. భూముల విక్రయానికి సీఎస్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారులతో స్టీరింగ్‌ కమిటీని వేసింది. విక్రయం సాఫీగా జరగడానికి అధికారులతో మరో మూడు కమిటీలను వేసింది.


గతంలో అమ్మిన భూములకు సంబంధించి ప్రభుత్వం న్యాయపరమైన వివాదాలతో సతమతం అయ్యింది. కొన్నవాళ్లకీ కష్టాలు తప్పలేదు. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. ప్రభుత్వం స్థలాల అమ్మకంపై ఆర్థిక మంత్రి టి.హరీ్‌షరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్‌ను కూడా భారీగా ప్రతిపాదించారు.


ఆశించిన మేర ఆదాయం రావడం లేదు. ఈ నేపథ్యంలోనే వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించారు. భూముల విక్రయం ద్వారా సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనికి కొనసాగింపుగానే గురువారం కమిటీలు వేశారు. విక్రయించే భూములు వివాదంలో లేకుండా ఉండేందుకు, వాటిలో కొనుగోలుదార్లు నిర్మించే భవనాలకు, ఇతర కార్యకలాపాల కోసం సత్వర అనుమతులు ఇవ్వడానికి కమిటీలు పని చేయనున్నాయి. విక్రయించిన వెంటనే భవనాలను నిర్మించడం కోసం టీఎ్‌స-బీపాస్‌ ద్వారా సత్వర అనుమతులను కూడా జారీ చేయనున్నారు.


స్టీరింగ్‌ కమిటీ  

ఛైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్యులుగా రెవిన్యూ, ఆర్థిక, హౌజింగ్‌, మున్సిపల్‌, పరిశ్రమలు, న్యాయశాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు ఉంటారు. కమిటీ 15 రోజులకోసారి సమావేశమై, భూముల విక్రయ ప్రక్రియను సమీక్షించి, అందుకనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటుంది. 

భూముల కమిటీ!

న్యాయ శాఖ కార్యదర్శి, సీసీఎస్‌ఏ ప్రతినిధి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ కమిటీలో ఉంటారు. విక్రయించే భూములు, ప్లాట్లను గుర్తించడం కలెక్టర్‌ బాధ్యత. సదరు భూములకు సరిహద్దులు గుర్తింపజేసే బాధ్యతా ఆయనదే. 1000 ఎకరాలకు తక్కువ కాకుండా విక్రయించదగ్గ ల్యాండ్‌ బ్యాంకును ఏర్పాటు చేసే బాధ్యత కలెక్టర్‌కు అప్పగించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎన్ని ఎకరాలు సేకరిస్తారో జీవోలో చెప్పలేదు. 


అనుమతుల కమిటీ

విక్రయించే భూముల్లో నిర్మాణాలు, ఇతర కార్యకలాపాలకు అనుమతులను ఇవ్వడం కోసం మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్‌ ఎండీ, హెచ్‌ఎండబ్ల్యుఎ్‌సఎ్‌సబీ ఎండీ, ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌, టీఎ్‌సపీసీబీ మెంబర్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. విక్రయించే భూములకు సరిహద్దులు సరిగ్గా ఉండే విధంగా ఈ కమిటీ చూడాలి. భవన నిర్మాణాలకు, విద్యుత్‌, ఫైర్‌ వంటి అనుమతులు వచ్చే విధంగా చూడాలి. ఇదంతా టీఎ్‌స-బీపాస్‌ ద్వారానే ఏడు రోజుల్లో జరగాలి. అమ్మిన భూములను కొనుగోలుదారు బహుళ విధాలుగా ఉపయోగించుకోవడానికి వీలుగా మార్చాలి. నీరు, విద్యుత్‌ వాటిని అదనపు చార్జీలు లేకుండా సమకూర్చాలి. మధ్యలో రోడ్లు ఉంటే మార్పులు చేయాలి.


వేలం కమిటీ

హెచ్‌ఎండీఏ కమిషనర్‌, హౌజింగ్‌ బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌, టీఎ్‌సఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్లతో వేలం కమిటీని ఏర్పాటు చేశారు. విక్రయించే భూములను కనీస స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను ఈ కమిటీ తీసుకుంటుంది. బ్రోచర్ల ముద్రణ, రోడ్ల నిర్మాణం, విద్యుత్‌, లైట్ల ఏర్పాటు, సైట్‌ విజిట్‌ కోసం ఏర్పాటు, మార్కెటింగ్‌ సెల్‌ ఏర్పాటు చూసుకుంటుంది. 


హౌసింగ్‌ బోర్డులో 870 ఎకరాలు

తెలంగాణ హౌసింగ్‌ బోర్డు 870 ఎకరాల మేర కలిగి ఉంది. హౌసింగ్‌ బోర్డుకు రాజధాని మధ్యలో చిన్న చిన్న ఖాళీ స్థలాలు కూడా ఉండిపోయాయి. తాజాగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంతో వీటిని కూడా అమ్మే వీలు కలుగుతోంది. మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ వంటి చోట్ల కూడా బోర్డుకు విలువైన భూములు ఉన్నాయి. 

‘దిల్‌’ భూముల అమ్మకం!తాజా మార్గదర్శకాల ప్రకారమే దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లాండ్‌ హోల్డింగ్స్‌(దిల్‌) భూములు విక్రయించే అవకాశం ఉంది. ‘దిల్‌’కు చెందిన భూములు 2080 ఎకరాల మేర రాజధానిని ఆనుకునే ఉన్నాయి. హయత్‌నగర్‌, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, కోహెడ, మొయినాబాద్‌, శంషాబాద్‌, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్‌, కీసర, తదితర ప్రదేశాల్లో ‘దిల్‌’ భూములు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాల, తుమ్మలూరు, తదితర చోట్ల 1450 ఎకరాల మేర అమ్మకానికి గత ఏడాదే గుర్తించారు. ఖానామెట్‌, బుద్వేలులో 77 ఎకరాలు అమ్మాలని ప్రభుత్వం ఇంతకు ముందే నిర్ణయించింది. ఈ భూమిని టీఎ్‌సఐఐసీకి అప్పగించబోతున్నారు. కోకాపేటలో కూడా మరో 600 ఎకరాలు అమ్మకానికి ఇంతకు ముందే గుర్తించారు.


పాటించాల్సినవి

 • భూముల అమ్మకం ఆదాయంలో 2 శాతం మార్కెటింగ్‌కు ఖర్చు పెట్టొచ్చు. 
 • త్వరగా నిర్మాణ అనుమతులు రావడం కోసం భూవినియోగాన్ని ‘మల్టీపర్ప్‌స’గా నోటిఫై చేయాలి. 
 • హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల మాస్టర్‌ ప్లాన్‌లలో మల్టీ పర్పస్‌ అనే విషయాన్ని పొందుపరచాలి. 
 • టీఎ్‌స-బీపాస్‌ ద్వారా సింగిల్‌ విండోలో ఏడు రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. 
 • మార్కెట్‌ ధరలను అనుసరించి భూములకు మంచి అప్‌సెట్‌ ధరను నిర్ణయించాలి.
 • ఇందుకు కన్సల్టెంట్ల సాయం తీసుకోవచ్చు. 
 • ఈ-ఆక్షన్‌ కోసం నోడల్‌ డిపార్ట్‌మెంట్‌ తాత్కాలిక షెడ్యూల్‌ ప్రకటించాలి. 
 • విక్రయించే భూములను చూపించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. 
 • నోడల్‌ ఏజెన్సీలో ఈ-ఆక్షన్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలి. 
 • బిడ్లను ఖరారు చేయడానికి, అనుమతించడానికి నోడల్‌ డిపార్ట్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని వేయాలి. 
 • కొనుగోలు చేసిన వారికి డబ్బులు చెల్లించిన మూడు వారాల్లో భూమి అప్పగించాలి. వారి పేరిట బదిలీ జరగాలి.