బండి నడిచేదెలా?

ABN , First Publish Date - 2020-04-10T10:06:13+05:30 IST

బయటకు వచ్చే దారిలేదు. ఇళ్లలో ఉంటే రోజు గడవదు. జిల్లాలో ఆటోవాలాల బతుకు దయనీయంగా మారింది.

బండి నడిచేదెలా?

ఆటోవాలాల ఆందోళన

కుటుంబ పోషణ పెనుభారం 

మెడపై ఫైనాన్స్‌ కత్తి 

ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): బయటకు వచ్చే దారిలేదు. ఇళ్లలో ఉంటే రోజు గడవదు. జిల్లాలో ఆటోవాలాల బతుకు దయనీయంగా మారింది. జిల్లాలో 45 వేల ఆటోలున్నాయి. వీటిలో 40 వేలకు పైగా ఆటోవాలాల జీవితం వీటి మీదే ఆధారపడి పది ఉంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ తప్పనిసరి. ఆటోవాలాలు ఆటోలను బయటకు తీసే పరిస్థితి లేదు. అత్యవసర సేవల కోసం కాకుండా ఆటోలను బయటకు తీస్తే రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేసి సీజ్‌ చేస్తున్నారు.


దీంతో రోజువారీ ఆదాయం లేదు. దాతలిచ్చే సాయం కొన్ని జీవితాలను తాత్కాలికంగా నిలబెడుతున్నా పూట గడిచేదెలా అనే భయంతోనే ఆటోవాలాల కుటుంబాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో రైతుబజార్లకు కూరగాయలను తరలించటం కోసమో, ఇతర అతవ్యసరాలను సరఫరా చేయటం కోసమో కొన్ని గూడ్స్‌ ఆటోలకు మాత్రమే అవకాశం ఉంటుంది. వాటికి వస్తున్న ఆదాయం కూడా ఆయిల్‌ ఖర్చుకు వస్తుందంతే. సాధారణ ఆటోల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మామూలు రోజుల్లో ఆటో నిర్వహణ ఖర్చులు పోను రోజుకు సగటున రూ.500 నుంచి రూ.700 వరకు ఆటో వాలాలు సంపాదించేవారు. అందులో సగం కిస్తీలకు పక్కన పెడితే మిగిలిన సగంతోనే బతుకు బండిని లాగేవారు. ఇప్పుడు అదీ లేదు.


మెడపై  ఫైనాన్స్ కత్తి 

 జిల్లాలో దాదాపు 35 వేలకు పైగా ఆటో యజమానుల మెడపై ఫైనాన్స్‌ కత్తి వేలాడుతోంది. ఆటోలను కొనుగోలు చేసిన వారు రూ.30 వేల నుంచి రూ.45 వేలు, ఆపైన డౌన్‌ పేమెంట్‌ చెల్లించి ఆటోలను కొనుగోలు చేస్తారు. మిగిలిన మొత్తం ఫైనాన్సే. సగటున నెలకు రూ.7,700 నుంచి రూ.9,000 వరకు కిస్తీ కట్టాల్సి ఉంటుంది. ఈ నెల మొదటి వారం వరకు ఓపిక పట్టిన ఫైనాన్స్‌ సంస్థలు తమ వద్ద ఫైనాన్స్‌ తీసుకున్న ఆటోవాలాలకు ఫోన్లు చేసి, కిస్తీలను తమ అకౌంట్‌లలో జమ చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో అప్పులు దొరికే పరిస్థితి కూడా కనిపించటం లేదని, ఏమిచేయాలో పాలుపోవడం లేదని కలవరపడుతున్నారు. 


ఆదుకోవాలని వినతి

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, లాక్‌డౌన్‌ వరకు నిత్యావసరాలనైనా అందించాలని ఆటోవాలాలు కోరుతున్నారు. ఫైనాన్స్‌ కంపెనీల నుంచి కొంతకాలం ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నియంత్రించాలని, లాక్‌డౌన్‌ తర్వాత నెలవారీగా చెల్లించుకునే అవకాశాన్ని కల్పించాలని, ఇన్సూరెన్స్‌ల గడువు పొడిగించాలని కోరుతున్నారు. 


Updated Date - 2020-04-10T10:06:13+05:30 IST