మక్కలు కొంటారా?

ABN , First Publish Date - 2021-04-13T08:37:46+05:30 IST

మక్కల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడటం లేదు. సుమారు నెల రోజులుగా మొక్కజొన్నలు మార్కెట్‌కు వస్తున్నా..

మక్కలు కొంటారా?

  • ఇంత వరకు కేంద్రాలను ప్రారంభించని ప్రభుత్వం
  • మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ నిధి కింద రూ. 377.35 కోట్లు
  • కేటాయింపులతో సరిపెడితే ప్రయోజనం శూన్యం.. 
  • మార్క్‌ఫెడ్‌కు రుణమివ్వడానికి బ్యాంకులు సిద్ధం
  • రైతులకు అందని ద్రాక్షలా మద్దతు ధర.. 
  • ఎమ్మెస్పీ కంటే రూ.350-400 తక్కువకు కొంటున్న ట్రేడర్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మక్కల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడటం లేదు. సుమారు నెల రోజులుగా మొక్కజొన్నలు మార్కెట్‌కు వస్తున్నా.. ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వరి ధాన్యం కొనుగోలు చేయటానికి పౌర సరఫరాల సంస్థకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నల విషయంలో మార్క్‌ఫెడ్‌కు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. వ్యాపారులు, దళారులు ఇష్ట మొచ్చిన ధరలకు మక్కలు కొనుగోలు చేస్తుండటంతో రైతులు క్వింటాలుకు రూ.350 నుంచి రూ.400 వరకునష్టపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు వరి ధాన్యం కొంటారా? లేదా? అనే సందిగ్ధం ఉండేది. ఇటీవల సీఎం ప్రకటనతో రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కానీ మొక్కజొన్నల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వ ఆదేశాలు వస్తే వెంటనే కేంద్రాలు ప్రారంభించటానికి మార్క్‌ఫెడ్‌ సిద్ధంగా ఉంది. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇస్తే.. మార్క్‌ఫెడ్‌కు రుణాలు ఇవ్వడానికి నాబార్డ్‌, ఎన్‌సీడీసీ సహా పలు వాణిజ్య బ్యాంకులు రెడీగా ఉన్నాయి. తాజా బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ కింద రూ.377.35 కోట్లు కేటాయించింది. మొక్కజొన్నలు సహా ఇతర పప్పు ధాన్యాలేవైనా సేకరిస్తే.. బస్తాలు, హమాలీ, రవాణా చార్జీలు ఇతరత్రా ఖర్చుల కోసం నోడల్‌ ఏజెన్సీ కోటాలో మార్క్‌ఫెడ్‌కు కేటాయించింది. అయితే ఈ నిధులు కేటాయింపులకే పరిమితమైతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మక్కల కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వడంతోపాటు మార్క్‌ఫెడ్‌కు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ విడుదలచేస్తే కోనుగోళ్లు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. దీనిపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 


క్వింటాకు రూ.1,450 నుంచి రూ.1,500

మార్క్‌ఫెడ్‌ తప్ప ప్రత్యామ్నాయం లేకపోవడంతో ట్రేడర్లు, దళారులు ఇష్టమొచ్చిన ధరలకు మక్కలు కొంటున్నారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) క్వింటాకు రూ.1,850 ఉండగా.. వ్యాపారులు గరిష్ఠంగా రూ.1,450 నుంచి రూ.1,500 చొప్పున కొంటున్నారు. దీంతో క్వింటాకు రూ.350-400 వరకు రైతులు నష్టపోతున్నారు. అయితే గరిష్ఠ ధర కూడా చాలా తక్కువ మంది రైతులకే లభిస్తోంది. మోడల్‌ ధర, గరిష్ఠ ధర కొంత మంది రైతులకే ఇచ్చి.. మిగిలిన రైతుల నుంచి అతి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. సోమవారం జగిత్యాల మార్కెట్‌లో కొందరు రైతులకు మోడల్‌ ధర రూ.1,515 ఇచ్చి.. మిగిలిన రైతుల నుంచి రూ.1,045కే కొనుగోలు చేశారు. మరోవైపు పౌలీ్ట్రకి క్వింటాకు రూ.1,700 చొప్పున వ్యాపారులు మక్కలను విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వరి ధాన్యం తరహాలోనే మక్కలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వానాకాలంలో 174 సెంటర్లు పెట్టి 2,62,424 టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. 2019-20 యాసంగిలో రికార్డుస్థాయిలో 1,097 సెంటర్లు ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో 9,47,889 టన్నులు కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఈ యాసంగిలో ఇంకా కేంద్రాలు ప్రారంభించకపోవటంతో రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-04-13T08:37:46+05:30 IST