వరి రైతుకు.. దిక్కేదీ..?

ABN , First Publish Date - 2021-12-09T05:04:45+05:30 IST

చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో వరి సాగు చేస్తారు. నవంబరు 18వ తేదీ వరకు చెయ్యేటికి అటు ఇటు పెనగలూరు, నందలూరు, రాజంపేట మండలాల్లోని 40 గ్రామాల వెంబడి 20వేల

వరి రైతుకు.. దిక్కేదీ..?
పులపత్తూరు ప్రాంతంలో రాళ్లు, ఇసుక మేటతో పాడైపోయిన వరి పంట

వేలాది ఎకరాల్లో వరి పాడవడంతో అప్పులపాలైన అన్నదాత

ఇంత వరకు నష్టపరిహారం చెల్లించని ప్రభుత్వం

వరద ప్రాంతంలో లబోదిదోమంటున్న రైతులు

రాజంపేట, డిసెంబరు 8 : చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో వరి సాగు చేస్తారు. నవంబరు 18వ తేదీ వరకు చెయ్యేటికి అటు ఇటు పెనగలూరు, నందలూరు, రాజంపేట మండలాల్లోని 40 గ్రామాల వెంబడి 20వేల ఎకరాల్లో కోనసీమను తలపిస్తూ వరికయ్యలు కళకళలాడేవి. ఈ ప్రాంతంలో అడుగుపెడితే వెన్ను దశలో, పండే దశలో, పంట చేతికందే దశలో ఉండే పొలాలతో ఎటు చూసినా కన్నుల పండువగా ఉండేది. అటువంటి పంటలన్నీ అన్నమయ్య డ్యాం తెగిపోయి ముంచెత్తిన వరదతో పూర్తిగా నాశనం అయ్యాయి. ఎకరాకు రూ.20వేలు అనుకున్నా 20వేల ఎకరాల్లో సుమారు రూ.40కోట్ల పైబడి వరిరైతులకు నష్టం వాటిల్లింది.


ఇసుక మేటలు.. నీటి కోతలు

చెయ్యేరు పరివాహక ప్రాంతంలోని వరి రైతులు పూర్తిగా నష్టపోయారు. చాలా పొలాల్లో వరదతో ఐదారు అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. మరికొన్ని చోట్ల పొలాలు కోతకు గురయ్యాయి. ఇవన్నీ సాగుకు పనికిరాకుండా పోయాయి. చాలా మంది రైతులు వరదకు ముందు కోతలు కోసి ధాన్యం నూర్పిళ్లు చేసి ఇళ్ల వద్ద పట్టలు కప్పి భద్రం చేసి పెట్టుకున్నారు. ముంచెత్తిన వరదతో ధాన్యం బస్తాలు ఊడ్చుకుపోయాయి. వరద పోటెత్తిన గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మొలకెత్తిన ధాన్యం గింజలు వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మానవ తప్పిదాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇంతగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. 


పాడిరైతుకు ఇచ్చి.. పంట రైతుకు నిలిపి..

వరదతో వేలాది పశువులు మృతిచెందాయి. చెయ్యేరు పరివాహక గ్రామాల్లో చాలామందికి పాడి పోషణే జీవనాధారం. అరొకర సాయమైనా ప్రభుత్వం నుంచి వీరికి అందింది. ప్రధానమైన వరి సాగుచేసిన రైతులను మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ కనికరించలేదు. ఎకరా వరిసాగు చేయాలంటే దుక్కులు దున్నడానికి, నారు పోయడానికి, నారు తీయడానికి, ఎరువులకు, గెనాలు వేయడానికి ఇలా మొత్తం ఖర్చు రూ.20వేలు అవుతుంది. పెట్టుబడి రూపంలోనే ఈ ప్రాంతంలో రైతులు రూ.40కోట్లకు పైగా  నష్టపోయారు. దీనికి ఆదాయం కలుపుకుంటే ఈ నష్టం మరింత ఎక్కువ అవుతుంది.


ప్రభుత్వమిచ్చే సహాయం ఇదే..

ప్రభుత్వం ఒక హెక్టారులో వరిపంట 33 శాతం పైబడి దెబ్బతింటే రూ.15వేలు, పూర్తిగా ఇసుక మేట వేస్తే రూ.12,200, భూమి కోతకు గురైతే రూ.37,500లు నష్టపరిహారం ఇస్తుంది. అది కూడా పంట నష్ట నివేదికలు అందాక. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు నివేదికలను ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఏ మూలకూ సరిపోదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం పెంచాలని, దీనిని వీలయినంత తొందరగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


వరి పంటే జీవనాధారం

- జయరామయ్య, రైతు, పులపత్తూరు గ్రామం 

మా ప్రాంతంలో ప్రజలకు వరిపంటే జీవనాధారం. చెయ్యేరు నది పక్కనంతా వరి  పండిస్తారు. సంవత్సరానికి మూడు కార్లు వరిని సాగు చేస్తారు. అటువంటి పంటంతా నేడు కనబడకుండా పోయింది. ప్రభుత్వం వరిరైతును ఆదుకోవాలి. 


వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

- ఉమామహేశ్వర్‌రాజు, రైతు, పులపత్తూరు 

పాడి రైతులకు నష్టపరిహారం వెంటనే ఇచ్చారు. అదే విధంగా వరి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అన్నదాతనే కాపాడలేకపోతే మనం ఎవరిని కాపాడగలుగుతాం. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. 


నివేదికలను ఉన్నతాధికారులకు పంపాం

- ఉమ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, రాజంపేట

పంట నష్ట నివేదికలను ఉన్నతాధికారులకు పంపాం. క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి రైతులకు జరిగిన నష్టాన్ని నివేదిక రూపంలో జిల్లా అధికారులకు పంపాం. భూమి కోతకు గురైతే హెక్టారుకు రూ.37,500, ఇసుక మేట చేరితే రూ.12,200, పంట దెబ్బతింటే రూ.15,000 నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది. నష్టపోయిన రైతుల ఖాతాలలో నేరుగా జమ అవుతుంది.

Updated Date - 2021-12-09T05:04:45+05:30 IST