Abn logo
Sep 15 2021 @ 00:15AM

హత్యాచారాలపై బాధ్యత మరిచిన ప్రభుత్వం

రేప్ కల్చర్ అనేది విలువల సంక్షోభం వల్ల తలెత్తిన విష సంస్కృతి. కేవలం హర్మోన్ల ప్రకోపం వల్లనో, అంతులేని వికారాల వల్లనో జరుగుతున్న దారుణం కాదది. మనిషి నైతిక ఆలోచనలను, నైతిక ప్రవర్తనను నియంత్రించే విలువలు విలుప్తం కావడం వల్ల ఉద్భవించిన విపరిణామం అది. హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక మీద జరిగిన హత్యాచార ఘటన ఇందుకు మరో తార్కాణం. 


హత్యాచారం జరిగినప్పుడు ప్రజల్లో ఆవేశం ఉప్పొంగటం సహజం. ఆ ఘాతుకానికి పాల్పడిన వాళ్లను విచారణకు ముందే కాల్చి చంపాలని డిమాండ్ రావడం సర్వసాధారణమై పోయింది. అయితే కఠినమైన, భయంకరమైన శిక్షల ద్వారా హత్యాచారాలను అదుపు చేయగలమనే అపోహలో మనం ఉన్నంత కాలం అమాయకమైన పిల్లలు బలవుతూనే ఉంటారు. కఠినమైన శిక్షలతో పాటు, ఉదాత్తమైన మానవ విలువలు వ్యవస్థీకృతం కావాలి. రాజ్యం లేదా అధికారంలో ఉన్న వాళ్ల ప్రధాన కర్తవ్యం మానవీయమైన, బాధ్యతాయుతమైన, స్వేచ్ఛాయుత సమాజాన్ని నిర్మించడం. అందుకు అవసరమైన ఉదాత్తమైన సామాజిక నైతిక విలువలను సంఘంలో వ్యవస్థీకృతం చేయడం. ఇది మరీ ఐడియలిస్టిక్‌గా ఉందనిపించినా సరే, ఇదే రాజ్యాంగధర్మం. కానీ మద్యం, మత్తు పదార్థాల ద్వారా రాజ్యం ఆదాయం రాబట్టుకుంటున్నది. హింస, కామ వికారాలను రెచ్చగొడుతున్నది. మనిషిని అసాంఘిక శక్తిగా మార్చే విలువలను అభివృద్ధి పేరుతో ప్రభుత్వమే ప్రచారం చేస్తున్నది. ఆడపిల్లల మీద ఇప్పటివరకు జరిగిన ఏ ఒక్క హత్యాచారం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించ లేదు. ఆడపిల్లలను, మహిళలను గౌరవించాలని, సంస్కారం నేర్పే మాట ఒక్కటీ ఆయన మాట్లాడ లేదు. ఆయన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా ఏ ఒక్క సంఘటన సందర్భంలో బాధితుల తరఫున మాట్లాడ లేదు. కనీసం బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించలేదు. ఇలాంటి పాలనలో మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ ఊహించలేనిది. 


అతిపాశవికమైన ఈ రేప్ కల్చర్‌ను భూస్థాపితం చేయడానికి రెండు పరిష్కార మార్గాలను అవలంబించాలి. ఒకటి– మహిళల రక్షణ, వాళ్ల హక్కులను గౌరవించే నైతిక విలువల ప్రచారాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఇది భావజాల ప్రచారం. స్త్రీ భోగవస్తువనీ, లైంగిక వస్తువనీ, బలహీనురాలని, రెండో శ్రేణి మనిషనీ భావించే భావజాలాన్ని నిర్మూలించే సైద్ధాంతిక పోరాటం చేయాలి. స్త్రీ గౌరవాన్ని ఇనుమడింప చేసి, ఆమె హక్కులను, ఉనికిని గుర్తించే చైతన్యం కల్పించే ప్రచారం చేయాలి. ఈ ప్రచారంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలు ఘోరంగా విఫలమవుతున్నాయనేది నిర్వివాదాంశం. అందుకే ఈ ప్రచారాన్ని ప్రతి సామాజిక, రాజకీయ ఉద్యమసంస్థలు బాధ్యతాయుతంగా చేపట్టాలి. 


రెండు– కెనడా, స్విట్జర్లాండ్, నార్వే దేశాల మాదిరిగా ప్రతి బాలుడు, బాలిక స్వేచ్ఛగా, సంతోషంగా జీవించేలా రక్షణ కల్పిస్తూ నిత్యం పోలీసుల పర్యవేక్షణ ఉండాలి. పైన పేర్కొన్న దేశాలలో అధికారులు అనూహ్యంగా ఇంటికొచ్చి తల్లిదండ్రులు ఆ పిల్లలను ఎలా చూసుకుంటున్నారో విచారించే పద్ధతి ఉంది. ఇది మన లాంటి దేశాలకు అతిగా కనిపించొచ్చు గానీ, వాళ్లు ఈ పనిని గొప్ప బాధ్యతగా భావిస్తారు. పిల్లలంటే దేశ భవిష్యత్తు. ఆ భవిష్యత్తును వాళ్లు చాలా అపురూపంగా చూసుకుంటారు. పిల్లల పెంపకం, మహిళల రక్షణ కుటుంబానికి చెందిన ప్రైవేటు వ్యవహారం అనుకోవడం ఆర్య మనువాద దృక్పథం. ఆడవాళ్లను, పిల్లలను ఆస్తులుగా భావిస్తూ ఆనందపడే ఒక విపరీత సామాజిక వ్యవస్థ ఇక్కడ వేలయేళ్లుగా ఉనికిలో ఉంది. ఇది ఆర్యవాద సంస్కృతి. ఆధునికత, మార్కెటీకరణ ఆర్య సంస్కృతికి తోడవ్వగా మహిళలు మరింత బలహీనంగా మారిపోయారు. పిల్లల, మహిళల వికాసం, రక్షణ సమాజ బాధ్యత అనేది ద్రవిడ సంస్కృతి. మహాత్మా జ్యోతి రావు ఫూలే, పెరియార్ రామసామి, బాబాసాహెబ్ అంబేడ్కర్‌లు అభివృద్ధి చేసిన ద్రవిడ దృక్పథం ఇది. ద్రవిడ సంస్కృతి స్త్రీ కేంద్రమైనది. ద్రవిడ సంస్కృతిని విస్మరిస్తూ, ఉత్తరాది ఆర్య సంస్కృతి ప్రభావంలోకి వెళ్తూన్న కొద్దీ, ఈ దుర్మార్గమైన హత్యాచార సంస్కృతి పెరుగుతూ పోతుంటుంది. ఈ సత్యాన్ని గుర్తెరిగి, మన విలువలను చక్కదిద్దుకుంటేనే మరో పసిమొగ్గ నేల రాలకుండా ఆపగలం.

శ్రీనివాస్ ద్రావిడ్