ముసుగు వెనక ప్రభుత్వం, నిఘా నీడన ప్రజలు

ABN , First Publish Date - 2021-08-06T06:13:31+05:30 IST

ప్రజాస్వామ్యం ద్వారా పొందిన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు భారతీయ జనతాపార్టీ కుట్ర పన్నుతోంది. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకు...

ముసుగు వెనక ప్రభుత్వం, నిఘా నీడన ప్రజలు

ప్రజాస్వామ్యం ద్వారా పొందిన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు భారతీయ జనతాపార్టీ కుట్ర పన్నుతోంది. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ‘అణచివేత–గోప్యత–నిర్వీర్యం–నిఘా’ అనే ఫార్ములాను అనుసరిస్తోంది. ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, వాటికి తొత్తుగా మారిన పోలీసు వ్యవస్థ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్యమకారులను నిరవధికంగా జైళ్లలో పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం పేరుతో ఊపా చట్టం ద్వారా అక్రమ కేసులు బనాయించి బెయిల్ రాకుండా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే బీజేపీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వంటి రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి పెంచుతోంది. సమాచార హక్కు చట్టం ద్వారా అంతో ఇంతో ప్రజలకు సమాచారం తెలిసే అవకాశాన్ని కాలరాస్తూ ఆర్టీఐ కమిషనర్ల అధికారాలను తగ్గించింది. ప్రజలకు, దేశానికి తెలియాల్సిన విషయాల పట్ల గోప్యతను పాటించే విధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం, తమకు అనుకూలంగా లేని వారి వ్యక్తిగత గోప్యతను లెక్క చేయకుండా వారిపై నిఘా పెడుతోంది. దీనికి అనేక ఉదాహరణలను చూడవచ్చు. ఈ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాల వ్యవహారంపైన, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపైన వివరాలు బైటికి పొక్కనియ్యదు. ఋణ ఎగవేతదారుల పేర్లు, కరోనా మరణాల లెక్కలు ప్రజలకు తెలియనివ్వదు. కానీ పెగాసస్ భూతద్దంతో ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాస్తూ వారి జీవితాల్లోకి తొంగి చూస్తోంది. ఇటీవల బహిర్గతమైన ఈ కుంభకోణంలో భారతదేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్లు హ్యాక్ అయినట్టు వెల్లడయ్యింది. ఈ నెంబర్లలో విపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఎంతోమంది విపక్ష నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, హక్కుల కార్యకర్తల పేర్లు ఉన్నాయి. ప్రభుత్వమే వారిపై నిఘా ఉంచిందని ఆరోపణలు ఎన్ని వస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. బీజేపీ వ్యవహారశైలితో మన ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న ముప్పును ప్రజలు గ్రహించాలి. ప్రజలు చైతన్యవంతులైతేనే రాజ్యాంగ సంస్థలను, జవాబుదారీతనాన్ని, పారదర్శకతను కాపాడుకోగలం. 

మహమ్మద్ ఆరిఫ్

Updated Date - 2021-08-06T06:13:31+05:30 IST