Abn logo
Sep 25 2021 @ 00:56AM

కొలువుదీరిన పరిషత్‌ పాలకవర్గం

ఎంపీపీ గొర్లి సూరిబాబును అభినందిస్తున్న ఎమ్మెల్యే అమర్‌

ఎంపీపీగా గొర్లి సూరిబాబు

వైస్‌ ఎంపీపీగా విల్లూరి సూర్యకుమారి


తుమ్మపాల/అనకాపల్లి రూరల్‌, సెప్టెంబరు 24: అనకాపల్లి మండల ప్రజా పరిషత్‌ పాలకవర్గం కొలువుదీరింది. ఎంపీపీగా అక్కిరెడ్డివానిపాలెం ఎంపీటీసీ గొర్లి సూరిబాబు, వైస్‌ ఎంపీపీగా తుమ్మపాల సెగ్మెంట్‌-4 ఎంపీటీసీ విల్లూరి సూర్యకుమారితో పాటు కో-ఆప్షన్‌ సభ్యుడిగా కొండుపాలెం గ్రామానికి చెందిన బొండా అప్పలరాజు ఎన్నికయ్యారు. ఆయా పదవులకు ఒక్కొక్కరే ననామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి జి.సునీల్‌బాబు తెలిపారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలకు ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్‌, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు అభినందనలు తెలిపారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో ఎ.సత్యశ్రీనివాసరావు, ఎంఈవో దివాకర్‌ పాల్గొన్నారు.  


అనకాపల్లి అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

పార్టీలకతీతంగా అనకాపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. తొలి మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో అనకాపల్లి జిల్లా కావడం ఖాయమని, గ్రామీణ ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న అనకాపల్లిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా అధికారులను సమన్వయం చేసుకుంటూ నూతన పాలకవర్గం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు మాట్లాడుతూ, అనకాపల్లి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని చెప్పారు.