లక్ష్యం.. స్పష్టంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-01-20T06:33:18+05:30 IST

ఆనందమైన, అందమైన జీవితం కోసం కొత్త సంవత్సరం రోజున అందరూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొందరే వాటిని ఆచరణలో పెడతారు.

లక్ష్యం.. స్పష్టంగా ఉండాలి

నందమైన, అందమైన జీవితం కోసం కొత్త సంవత్సరం రోజున అందరూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొందరే వాటిని ఆచరణలో పెడతారు. మిగతావారు ఏవో కారణాలు చెబుతుంటారు. వారు మానసికంగా సన్నద్ధం కాలేకపోవడమే అందుకు కారణం. మనసులో దృఢంగా అనుకుంటే ఏమంత కష్టం కాదు. అందుకు ఏం చేయాలంటే... 


లక్ష్యాలు స్పష్టంగా: ‘డబ్బు పొదుపు చేయాలి’, ‘బరువు తగ్గాలి’ అని కాగితం మీద రాయడం, ఊరికే అనుకోవడం కాదు. ఆ దిశగా అడుగులు వేయాలి. మీరు ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారు, ఎన్ని కిలోలు తగ్గాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. అప్పుడు మీ మెదడులో ఇవే ఆలోచనలు తిరుగుతుంటాయి. ఫలితంగా లక్ష్యం మీద దృష్టి పెడతారు. అనుకున్నది సాధిస్తారు. 


ప్రతిదీ ముఖ్యమే: లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చిన్న విజయం సాధించగానే అలసత్వం చూపొద్దు. ఈ చిన్న చిన్న విజయాలు మిమ్మల్ని గమ్యానికి చేర్చే నిచ్చెనల లాంటివని గ్రహించాలి. మరింత పట్టుదలగా చివరి వరకు ప్రయత్నించాలి. ప్రతి చిన్న విషయం కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.


 సన్నిహితులకు చెప్పాలి: కొత్త ఏడాదిలో మీరు చేయాలనుకున్న పనులను మీ కుటుంబసభ్యులు, స్నేహితులతో చెప్పాలి. దాంతో ఎప్పుడైనా మీరు డీలా పడినప్పుడు వారు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తారు. మిమ్మల్ని అనుక్షణం ప్రోత్సహిస్తారు. వారి సహకారం, మద్దతుతో మీకు ఎక్కడలేని శక్తి వస్తుంది.


 స్ఫూర్తినిచ్చే కోట్స్‌: మీ గదిలో, మీరు పనిచేసుకునే టేబుల్‌ మీద స్ఫూర్తినిచ్చే మాటలు, సూక్తులను అతికించాలి. అలా చేయడం వల్ల ఆ కోట్స్‌ను చూసిన ప్రతిసారి మీ లక్ష్యం గుర్తుకు వస్తుంది. ఆ కోట్స్‌ మీలో పాజిటివ్‌ ఆలోచనలను పెంచి మిమ్మల్ని లక్ష్యంపైపు నడిపిస్తాయి.


 పొరపాట్లను దిద్దుకుంటూ: ఒక్కోసారి కొన్నిపరిస్థితుల్లో వెనకడుగు వేయడం తప్ప మరో మార్గం కనిపించదు. అలాంటప్పుడు మానసికంగా దృఢంగా ఉండాలి. పొరపాట్లను సరిచేసుకుంటూ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మళ్లీ ప్రయత్నించాలి. సంకల్పంతో వేసే ప్రతి అడుగు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుందని మరచిపోవద్దు. 

Updated Date - 2021-01-20T06:33:18+05:30 IST