సమస్యలు పరిష్కరించడమే రీసర్వే లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-01T05:26:50+05:30 IST

రీసర్వే ద్వారా ఏళ్ల తరబడి ఉన్న భూసమస్యలను పరిష్కరిస్తారని సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించారు

సమస్యలు పరిష్కరించడమే రీసర్వే లక్ష్యం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌ - పాల్గొన్న అన్నమయ్య కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

గడువులోగా పూర్తి చేయాలి - సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎ్‌సజీ

రాయచోటి(కలెక్టరేట్‌), జూన్‌ 30: రీసర్వే ద్వారా ఏళ్ల తరబడి ఉన్న భూసమస్యలను పరిష్కరిస్తారని సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలోని తన కార్యాలయం నుంచి సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లగా నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసర్వే చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యం మేరకు భూసర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పు డు పరిష్కరించుకోవాలన్నారు. వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో సర్వే పనులను చేపడుతోందన్నారు. సవరణలు, మ్యుటేషన్స్‌ కోసం అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. భూరికార్డుల సవరణ, 22ఏ, మ్యుటేషన్స్‌ కోసం అందిన దరఖాస్తులపై వీఆర్‌ఓ లు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిశీలించాలన్నారు. రెవెన్యూ కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్లు రెవెన్యూ సిబ్బందితో తరచూ సమీక్షించాలన్నారు. అనంతరం కల్టెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులతో మాట్లాడుతూ భూముల సర్వే నిమిత్తం అవసరమైన చోట పక్క గ్రామాల నుంచి విలేజ్‌ సర్వేయర్లను తీసుకుని గ్రౌండ్‌ ట్రూపింగ్‌ టీంలను పెంచుకుని జిల్లాలో రీసర్వే పనులు ప్రణాళికా బద్దంగా వేగంగా చేయాలన్నా రు.

ఓఆర్‌ఐ (ఆర్థోరెక్టిఫైడ్‌ రాడార్‌ ఇమేజెస్‌) చిత్రాల ప్రక్రియ, డ్రోన్లు, రోవర్లు, సర్వేరాళ్లు సమకూర్చుకోవడం ఇలా ప్రతి అంశంలోనూ వేగం పెంచాలన్నారు. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని, దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌ఓ, సర్వే ఏడీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:26:50+05:30 IST