పేదవాడి కడుపు నిండపమే కాంగ్రెస్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-29T05:42:02+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పేదవారి కడుపు నిండపమే కాకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు, రైతు కూలీలకు పెద్దపీట వేస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

పేదవాడి కడుపు నిండపమే కాంగ్రెస్‌ లక్ష్యం
నిజామాబాద్‌ రచ్చబండలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

కోనరావుపేట, మే 28: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పేదవారి కడుపు నిండపమే కాకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు, రైతు కూలీలకు పెద్దపీట వేస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నిజామాబాద్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి తరుగు లేకుండా కొనుగోలు చేశామన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, వడ్డీ రాయితీలు అందించామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు రుణమాఫీ చేయకపోవడమే కాకుండా ఉన్న రాయితీలను తీసివేసిందన్నారు. విత్తనాలు, సబ్సిడీ పనిముట్లు, వడ్డీ రాయితీలు తీసివేసి వాటన్నింటికి అయ్యే ఖర్చు కూడబెట్టి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఎక్కడి ధాన్యం రాశులు అక్కడే ఉన్నాయని ఆరోపించారు. ఒక్కో క్వింటాల్‌కు తరుగు పేరిట ఆరు కిలోలు తీసివేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వంట గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను గతంలో విధంగానే అందిస్తామని అన్నారు.  కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి ఆది శ్రీనివాస్‌, సర్పంచ్‌ అరుణ జగన్‌రెడ్డి, జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, కచ్చకాయల ఎల్లయ్య, చేపూరి గంగాధర్‌, చందనగిరి గోపాల్‌, నాలుక సత్యం, మండల నాయకులు తాళ్లపల్లి ప్రభాకర్‌, నందుగౌడ్‌, బొర్ర రవీందర్‌, గొట్టె రుక్మిణి, లింబయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T05:42:02+05:30 IST