పారదర్శక పాలనే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-16T06:33:56+05:30 IST

నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు మిగతా విభాగాల ఆఫీసులను ఏర్పాటు చేశామని, పారదర్శక పాలనే లక్ష్యంగా పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంజాద్‌ బాషా అన్నారు.

పారదర్శక పాలనే లక్ష్యం
నంద్యాలలో పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న డిప్యూటీ సీఎం

సంక్షేమ పథకాలను అందజేస్తున్నాం
76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా
 అట్టహాసంగా వేడుకలు.. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు


నంద్యాల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి), నంద్యాల (కల్చరల్‌): నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు మిగతా విభాగాల ఆఫీసులను ఏర్పాటు చేశామని, పారదర్శక పాలనే లక్ష్యంగా పని చేస్తున్నామని  డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంజాద్‌ బాషా అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పరేడ్‌ వాహనంపై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎస్పీ రఘువీర్‌ రెడ్డిల నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన జిల్లా ప్రగతిపై సందేశమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోందని అన్నారు.

జిల్లా ప్రగతి ఇలా..:

 ఇన్‌చార్జి మంత్రి జిల్లా ప్రగతిని వివరిస్తూ.. 2022-23 సంవత్సరానికి గాను డా.వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద మొదటి విడతగా 2.9 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.157.12 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసిందని అన్నారు. జగనన్న అమ్మఒడి పథకం కింద 2021-22 సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున జిల్లాలో అర్హత ఉన్న  1,72,116 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.224 కోట్లు జమచేసిందన్నారు. ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అన్న నినాదంతో నాడు-నేడు కింద ప్రతి పాఠశాలలో 9 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. నంద్యాల జిల్లాలో జగనన్న లే అవుట్లలో 46,139 గృహాలను మంజూరు చేశామన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా  416 గ్రామ సచివాలయ భవనాలలో ఇప్పటికే 260 భవనాలు పూర్తయ్యాయని, 395 రైతు భరోసా కేంద్రాల్లో 119 పూర్తయ్యాయని, 285 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లలో 65 పూర్తయ్యాయని అన్నారు.  168 వైఎస్సార్‌ డిజిటల్‌ గ్రంథాలయ కేంద్ర భవనాలు, రూ.18 కోట్ల అంచనాలతో చేపట్టిన 103 పాల శీతలీకరణ కేంద్ర భవనాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం ద్వారా మన భూములు, ఆస్తుల రక్షణకు వివాదాలు లేని స్వచ్ఛమైన భూ రికార్డులను రూపొందించేందుకు ఆధునిక పరిజ్ఞానంతో భూ రీసర్వే పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. 2022 ఏప్రిల్‌ 4వ తేది నుంచి ఆగస్టు 12 తేది వరకు జిల్లాలో 7,141 అర్జీలను స్వీకరించి  5252 అర్జీలను పరిష్కరించామని అన్నారు. ఈ సంవత్సరం కేసీ కెనాల్‌ కింద 96,619 ఎకరాలకు, ఎస్సార్బీసీ కాలువల ద్వారా లక్షా 37 వేల ఎకరాలకు, తెలుగుగంగ ప్రాజెక్టు కింద 1,01,400 ఎకరాలకు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ద్వారా 10 వేల ఎకరాలకు, 38 ఎత్తిపోతల పథకాల ద్వారా 55,900 ఎకరాలకు, శివభాష్యం ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాలకు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ ద్వారా 2,900 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని అన్నారు.  

సమరయోధుల కుటుంబాలకు సన్మానం..

 స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలను డిప్యూటీ సీఎం అంజాద్‌, కలెక్టర్‌, ప్రజా ప్రతినిధులు, ఎస్పీ తదితరులు సత్కరించారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి, ఆయన అనుచరుడు వడ్డె ఓబన్న కుటుంబ సభ్యులకు,  కాదరాబాద్‌ నరసింగరావు, బాయికాటి మద్దిలేటి, బీవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.

 అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
 
పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు పాటలు పాడారు. ’సైరా నరసింహారెడ్డి’ అంటూ శాంతినికేతన్‌ విద్యార్థుల చేసిన ప్రదర్శన, గురురాజస్కూల్‌ విద్యార్థుల నమభారతాంబే ప్రదర్శన,   ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ బలపనూరు విద్యార్థుల  పాడదమా స్వేచ్ఛాగీతమ్‌ అనే పాటలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చారు.

నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషొర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా, నందికొట్కూర్‌ ఎమ్మెల్యే తోగూరు ఆర్దర్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పిపి నాగిరెడ్డి, ఎస్పీ రఘువీర్‌ రెడ్డి, డీఆర్వో, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, నంద్యాల తహసీల్దార్‌ బాయికాటి శ్రీనివాసులు, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొని సందర్శించారు.

ఆకట్టుకున్న శకట ప్రదర్శన..

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలయజేస్తూ ఏర్పాటు చేసిన శకటాలను పరేడ్‌ మైదానంలో ప్రదర్శించారు. వ్యవసాయ శాఖ, నీటి యజయాన్యసంస్థ, డీఆర్‌డీఏ, ఎస్‌ఎస్‌ఎ మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ శకటాలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు.  ఐసీడీఎస్‌, విద్య, వైద్య, ఆరోగ్య, సాగునీరు, గిరిజన కోఆపరేటివ్‌, సర్వశిక్ష అభయాన్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌, అగ్రికల్చర్‌, హార్టికల్చ్‌ర్‌, అటవీశాఖ, తదితర స్టాల్స్‌ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. వీటిలో అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఏపీఎమ్‌ఐపీ స్టాల్స్‌కు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి. అనంతరం విధుల్లో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం ప్రశంసా పత్రాలు అందజేశారు.

Updated Date - 2022-08-16T06:33:56+05:30 IST