మురికివాడ రహిత నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-06-18T05:34:05+05:30 IST

విశాఖను మురికివాడ రహిత నగరంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని, దీనిపై దృష్టి సారించామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.

మురికివాడ రహిత నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం
సమీక్షలో పాల్గొన్న విజయసాయిరెడ్డి

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

విశాఖపట్నం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): విశాఖను మురికివాడ రహిత నగరంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని, దీనిపై దృష్టి సారించామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. జీవీఎంసీ పరిఽధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై జీవీఎంసీ పాతకౌన్సిల్‌హాల్‌లో గురువారం జరిగిన సమీక్షలో ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జీవీఎంసీ పరిధిలో 794 మురికివాడలు ఉండడంతో వాటిని అక్కడే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసేలా ఒక ప్రణాళిక తయారుచేసి అందజేయాలని జీవీఎంసీ అధికారులను కోరామన్నారు. జీవీఎంసీ పరిధిలో గతంలో ప్రభుత్వ పథకాల కింద నిర్మించి పేదలకు అందజేసిన ఇళ్లు మరమ్మతులకు గురికావడంతో ఒక్కో ఇంటికి మరమ్మతుల కోసం రూ.పది వేలు చొప్పున అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆ మొత్తం మరమ్మతులకు సరిపోకపోతే  జీవీఎంసీ మానవతాదృక్పథంతో మిగిలిన పనులను పూర్తిచేస్తుందన్నారు. జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో రూ.ఐదు కోట్లు అంచనాతో వెయ్యి మంది కూర్చొనే సదుపాయం ఉండేలా ఎకరా నుంచి రెండెకరాల భూమిలో ఏసీ కన్వెన్షన్‌ సెంటర్లను నిర్మించి వచ్చే మూడేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. వీటికి అవసరమైన నిధులను ఎంపీ లాండ్స్‌ కింద తాను కేటాయిస్తానని చెప్పారు.

Updated Date - 2021-06-18T05:34:05+05:30 IST