Abn logo
Jun 16 2021 @ 00:06AM

ప్రేయసి వదిలేసిందని...

ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో మేనేజర్‌ అతడు. ఉండడానికి ఇల్లు... తిరగడానికి కారు ఉన్నాయి. ‘బేసిగ్గా ఈ మాత్రం సమాచారం ఉంటే చాలు... సిటీలో ఏ బ్యాంక్‌ అయినా లోన్‌ ఇస్తుంది. ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది’... ఇదీ తేజ అభిప్రాయం. ‘నన్నూ ఒకమ్మాయి ప్రేమించింది. రీసెంట్‌గా హ్యాండిచ్చింది. మొదట్లో మూవ్‌ ఆన్‌ అనుకున్నాను. కానీ మనసు తన జ్ఞాపకాలతో హ్యాంగ్‌ ఆన్‌ అయింది. ఏదైనా ఫోన్‌లో నెంబర్‌ డిలీట్‌ చేసినంత ఈజీ కాదు... మనసులో మనిషిని తీసెయ్యడం. ఫ్రెండ్‌ని సలహా అడిగాను... క్వార్టర్‌ తాగితే అన్నీ మరిచిపోవచ్చన్నాడు! నాకు మాత్రం పాయిజన్‌ తాగి చచ్చిపోవాలనిపించింది. అందరూ అనుకోవచ్చు... చావు సమస్యకు పరిష్కారం కాదని. కానీ బతకడమే సమస్యయినప్పుడు చావడమే పరిష్కారం. ఇట్లు... తేజ.’ అనూహ్యంగా మొదలవుతుంది ‘ఊపిరి’ షార్ట్‌ ఫిలిమ్‌. 


చావును కౌగలించుకోవాలని చీకట్లో కూర్చున్న అతడికి ఓ కాల్‌ వస్తుంది. ‘అన్‌నోన్‌ నెంబర్‌. పోయే ముందు పరిచాయాలెందుకు’ అనుకుని కట్‌ చేస్తాడు. మళ్లీ అదే నెంబర్‌... చికాగ్గా ‘హలో’ అనగానే... ‘హలో సార్‌... మా నాన్నకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. సాయంత్రం నుంచి ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చాలంటే లక్ష కట్టమంటున్నారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుంది! అందుకే గవర్నమెంట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లాం. కానీ అక్కడ ఆక్సిజన్‌ లేదు’ అంటూ ఏడుస్తూ చెబుతుంది ఫోన్‌లో అమ్మాయి. ‘అయితే ఏంటి?’... అడుగుతాడు తేజ. ‘నా దగ్గరున్న లిస్టులో ఆక్సిజన్‌ సప్లయర్స్‌ అందరికీ కాల్‌ చేశాను సార్‌. ఫలితం లేదు. చివర నెంబర్‌ మీదే! ఎలాగైనా ఒక్క ఆక్సిజన్‌ సిలిండర్‌ ఇప్పించండి సార్‌’... తను ప్రాథేయపడుతుంది. ‘ఆగండి... మీకెవరో రాంగ్‌ ఇన్ఫర్‌మేషన్‌ ఇచ్చినట్టున్నారు. నేను ఆక్సిజన్‌ సప్లయర్‌ను కాదు’ అని తేజ అనగానే ఆ అమ్మాయి గుండె ఆగినంత పని అవుతుంది.


ఊపిరి తీసుకోవాలనుకొంటున్న అతడికి... ఊపిరి అందక కొట్టుకొంటున్న మరో ప్రాణాన్ని నిలబెట్టాలన్న అభ్యర్థన! విచిత్రమైన సందర్భం. పోయే ముందు ఒక మంచి పని చేసి పోదామనుకొంటాడు అతడు. ఆ అమ్మాయి గూగుల్‌పేకి లక్ష రూపాయలు పంపిస్తాడు. తను ఆనందంతో ఫోన్‌ చేసి థ్యాంక్స్‌ చెబుతుంది. తెల్లారుతుంది. మనోడు ఇంకా మత్తులో జోగుతుంటాడు. ఆమె నుంచి ఫోన్‌... ‘సార్‌... నాన్నను ఆసుపత్రిలో జాయిన్‌ చేశాం. ఆక్సిజన్‌ కూడా పెట్టారు. త్వరగానే కోలుకొంటారన్నారు. ఇదంతా మీ వల్లే సార్‌. మీ డబ్బులు ఎలాగైనా తిరిగిచ్చేస్తాను’ అంటుంది తను. ‘అక్కర్లేదు. నేనొక పావుగంటలో పోతున్నా. కలవడం కుదరదు. ఎలాగూ పోతున్నాను కదా! డబ్బులేం చేసుకొంటానని నీకు హెల్ప్‌ చేశానంతే’... తేజ బదులిస్తాడు. ఆమె షాక్‌. ‘సార్‌... మీ ఇబ్బందేమిటో నాకు తెలియదు. కానీ ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్‌ కాదు’... తను చెబెతుండగానే... ‘బతికి సాధించాలి. పదిమందికి మనమేంటో చూపించాలి. ఇలాంటివి చెప్పక. అయినా మా నాన్న ఒక మాట చెప్పాడు. తాగి ఏ నిర్ణయాలూ తీసుకోవద్దురా అని.

అందుకే ప్రస్తుతానికి ఆగాను. నువ్వు ఎంత ట్రై చేసినా నా నిర్ణయం మార్చుకోను’... అంటాడు అతడు. ‘మీరు చెప్పినదాన్నిబట్టి మీకు ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ ఏమీ లేవు. నాకు తెలిసి మీది లవ్‌ ఫెయిల్యూర్‌ అయుండవచ్చు. మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయి ఉండవచ్చు. అంతేనా సార్‌. దానికే చచ్చిపోదామనుకుంటున్నారా?’... ఆమె మాటలు సూటిగా తగులుతాయి అతడికి. చివరకు తను తేజను ఆత్మహత్య చేసుకోకుండా ఆపిందా? ఇంతకీ ఎవరు తను? తెలియాలంటే ‘ఊపిరి’ లఘుచిత్రం చూడాలి. సాయితేజ, విరాజితలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు కూడా సాయితేజానే. స్ర్కిప్ట్‌ పక్కాగా ఉంటుంది. అనవసరమైన డైలాగ్‌ ఒక్కటి కూడా కనిపించదు. యూట్యూబ్‌లో గత వారం విడుదలైన ఈ షార్ట్‌ ఫిలిమ్‌ను ఇప్పటికి దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు.