అంతరిక్షానికి ఎగరబోతున్న అమ్మాయీ

ABN , First Publish Date - 2021-07-07T06:10:05+05:30 IST

గడప దాటేందుకే ఆంక్షలు విధించే సమాజాన్ని లాంచింగ్‌పాడ్‌గా చేసుకుని అంతరిక్షానికి ఎగరబోతున్న ఓ అమ్మాయీ!...

అంతరిక్షానికి ఎగరబోతున్న అమ్మాయీ

గడప దాటేందుకే ఆంక్షలు విధించే సమాజాన్ని

లాంచింగ్‌పాడ్‌గా చేసుకుని

అంతరిక్షానికి ఎగరబోతున్న 

ఓ అమ్మాయీ!


బయటకు వెళ్ళే ఆడపిల్లలకు

సలహాలు ఇవ్వడం మా అలవాటు కదా

ఇవిగో నీకు కూడా కొన్ని


నువ్వు వెళ్ళే దారంతా

సంప్రదాయాలు, కట్టుబాట్ల

కంచెలు కట్టి ఉంటాయి

నీ విశ్వాసపుకత్తితో

వాటిని విరిచెయ్యి

అంట్లగిన్నెలను వదిలి నీ దారిలో 

అంతరిక్షానికి పయనమవుదాం అనుకునే

అమ్మాయిలకు ప్రయాణం కొంచెం తేలిక చెయ్యి


మేమింకా ఇక్కడ

మతాల మారణహోమాలలో

కులాల కుమ్ములాట్లలో

ఊపిరాడకుండా ఉన్నాము

వీటికి దూరంగా ఎగిరిపో

స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకో 

అంత ఎత్తుకి వెళ్లినా

ఏ దేవుడూ అక్కడ కూర్చుని

ప్రపంచాన్ని నడపడం లేదని

నువ్వు తెలుసుకున్న వాస్తవాన్ని

పీఠాధిపతులందరికీ

        వర్తమానం పంపు


దేశాలను జయించాలనీ

సామ్రాజ్యాలను స్థాపించాలనీ

మేమే అధికులుగా నిలవాలనీ

ఇక్కడ కత్తులు దూసుకుంటున్నాం

యుద్ధాలు చేసుకుంటున్నాం

వేల మైళ్ళ ఎత్తు నుండి

మా అల్పత్వాన్ని చూసి నవ్వుకుంటావేమో

సువిశాల పాలపుంతలో

మేమింత నక్షత్రధూళికి కూడా

సరితూగే వారం కాదని

అహాలతో కొట్టుమిట్టాడుతున్న

మానవజాతికి సందేశమివ్వు

నీకేవో ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయనీ

వాటి వల్లనే నువ్వు

ఎగరగలుగుతున్నావనీ

అనుకుంటున్నారిక్కడ అమ్మాయిలు

నీ ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష

అంతులేని శ్రమ మాత్రమే

నీకు రెక్కలనిచ్చాయని

అవి తనకి కూడా ఉన్నాయని 

పదహారేళ్ళకే పురిటినొప్పులు

మోసిన అమ్మాయికి చెప్పు


అంతరిక్షానికి ఎగరబోతున్న 

ఓ అమ్మాయీ!


నువ్వు తిరిగి వచ్చే దారంతా

వంటిళ్ళలో ఒత్తిళ్ళలో

నలిగిపోతున్న కోట్లాది స్త్రీల

విరిగిన కలలు ఎదురయ్యి

నిన్ను కలతపెడతాయేమో

నిబ్బరంగా ఉండు

వాటిని ఓపికగా సేకరించు

నీ విశ్వాసపు రెక్కలు తొడిగి

వాటిని భూమి మీదకి విసిరెయ్యి

ఎక్కడో ఒకచోట ఎవరో ఒక పాప

వాటిని అందుకోక పోదు

ఆ కలల రెక్కల మీద

అంతరిక్షానికి ఎగరక పోదు

భారతి కోడె

Updated Date - 2021-07-07T06:10:05+05:30 IST