చె త్తకుండీలనూ ఎత్తుకెళ్లారు..!

ABN , First Publish Date - 2021-04-14T06:06:40+05:30 IST

హిందూపురంలో మునిసిపాలిటీ ఏర్పాటుచేసిన చెత్తకుండీలు ఒక్కొక్కటిగా మాయం అవుతున్నాయి. రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం పట్టణంలో లక్షలు వెచ్చించి స్టీల్‌ చెత్తకుండీలను వీధి వీధిన ఏర్పాటుచేసింది

చె త్తకుండీలనూ ఎత్తుకెళ్లారు..!
స్టీల్‌ చెత్తకుండీలు ఎత్తుకెళ్లగా కడ్డీలు మాత్రం దర్శనమిస్తున్న దృశ్యం


పట్టించుకోని అధికారులు... ప్రజల సొమ్ము దొంగల పాలు

హిందూపురం టౌన్‌, ఏప్రిల్‌ 13 : హిందూపురంలో మునిసిపాలిటీ ఏర్పాటుచేసిన చెత్తకుండీలు ఒక్కొక్కటిగా మాయం అవుతున్నాయి. రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం పట్టణంలో లక్షలు వెచ్చించి స్టీల్‌ చెత్తకుండీలను వీధి వీధిన ఏర్పాటుచేసింది. ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో వీటిని ఆ ప్రాంతంలోని ప్రజలు బాగా ఉపయోగించుకున్నారు. కొద్దిరోజుల తరువాత వీటిపై పర్యవేక్షణ కరువైంది. ఈ పరిస్థితుల్లో ఒక్కో చెత్తకుండీ మాయం అవుతూ వస్తోంది. అప్పట్లో ఒక్కోచోట ఏర్పాటు చేయడానికి రూ.5వేలకు పైగానే ఖర్చు చేశారు. ఇలా పట్టణంలో దాదాపు 150 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు.  ప్లాస్టిక్‌ ఏర్పాటు చేస్తే పాడైపోతాయన్న ఉద్దేశంతో దీర్ఘకాలికంగా మన్నిక వస్తాయని స్టీల్‌ చెత్తకుండీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన కూడళ్లలో వీటిని ఒక్కొక్కటిగా తొలగించి ఎత్తుకెళ్లారు.   ముఖ్యంగా ఈ చెత్తకుండీలు ఏర్పాటు చేసిన చోటంతా సీసీ కెమెరాలున్నాకానీ వీటిని తస్కరించడం గమనార్హం. దుకాణాల ముందున్నవాటిని ఎత్తుకెళ్లినా అక్కడున్నవారు క నీసం మునిసిపల్‌ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం.  దానిని పర్యవేక్షించిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో నేడు పట్టణంలో అవి పూర్తిగా కన్పించకుండా పోయాయి. మొదట్లోనే ఎత్తుకెళ్లినప్పుడు మునిసిపల్‌ అధికారులు స్పందించి ఉంటే మిగిలినవి మిగిలేవి.   అయితే ఆ దిశగా మునిసిపల్‌ అధికారులు చర్యలు చేపట్టలేదు. ఇటీవల కొన్నింటిని మునిసిపల్‌ అధికారులు తీసుకొచ్చి తమ కార్యాలయంలో భద్రపరిచినట్లు తెలిసింది. 


        దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావును వివరణ కోరగా.. ‘ కొన్నిచోట్ల స్టీల్‌ చెత్తకుండీలు ఎత్తుకెళ్లారు. అయితే  కడ్డీలు మాత్రం అలాగే వదిలేశారు. కొన్నింటిని తీసుకొచ్చి కార్యాలయంలో భద్రపరిచాం. సీసీ కెమెరాలు ఉన్నచోట కూడా వీటిని ఎత్తుకెళ్లారు. దీనిపై విచారణ చేపడతాం. ఎవరైనా వీటిని ఎత్తుకెళ్తే వారిపై దొంగతనం కేసుతోపాటు, క్రిమినల్‌ కేసు నమోదుచేసేలా సిఫార్సు చేస్తాం’ అని అన్నారు.


Updated Date - 2021-04-14T06:06:40+05:30 IST