నకిలీల గుట్టు రట్టు

ABN , First Publish Date - 2020-07-01T11:53:06+05:30 IST

అడ్డదారిలో సులువుగా డబ్బులు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడిన ఆరుగురు వ్యక్తుల పథకాన్ని పోలీసులు ఆదిలోనే రట్టు చేశారు.

నకిలీల గుట్టు రట్టు

రూ.500 నోట్ల కట్టలను తయారు చేసిన ముఠా

మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే యత్నం

ఆదిలోనే చిక్ని ఆరుగురు నిందితులు

రూ.31 లక్షల నకిలీ కరెన్సీ... రూ.65,350 నగదు స్వాధీనం 

 

విజయనగరం క్రైం, జూన్‌ 30: అడ్డదారిలో సులువుగా డబ్బులు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడిన ఆరుగురు వ్యక్తుల పథకాన్ని పోలీసులు ఆదిలోనే రట్టు చేశారు. భోగాపురం సర్కిల్‌ని అవనాం గ్రామ సమీపంలో పెట్రోల్‌ బంకు వద్ద నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.31 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను, అసలు కరెన్సీ రూ.65,350తో పాటు కలర్‌ జిరాక్స్‌ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఎస్పీ రాజకుమారి మంగళవారం విలేకరులకు తెలిపారు. 


 విశాఖ జిల్లా పద్మనాభం మండలం అయినాడ గ్రామానికి చెందిన మజ్జి రమణ, గెడ్డపేట గ్రామానికి చెందిన తొట్టకూటి గౌరీనాయుడు, డెంకాడ మండలం అక్కివరం గ్రామానికి చెందిన కంది రాము, చింతలవలస గ్రామానికి చెందిన లెంక శేఖర్‌, విజయనగరం లంకవీధికి చెందిన కొర్నాన సురేష్‌, పూల్‌బాగ్‌ కాలనీకి చెందిన మొగిలి విజయ్‌కిరణ్‌లు ముఠాగా ఏర్పడి దొంగనోట్లు తయారు చేశారు. కీలక నిందితుడు కంది రాము ఇంజినీరింగ్‌ చదివాడు.  కొన్ని ప్రైవేటు ఉద్యోగాలు చేసినా నిలదొక్కలేకపోయాడు.


సులువుగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా చేసుకున్నాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో యూట్యూబ్‌ ద్వారా కరెన్సీకి సంబంధించిన జిరాక్స్‌, నోట్ల కటింగ్‌ మిషన్ల గురించి తెలుసుకుని వాటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. అనంతరం పాత పరిచయాలున్న మజ్జి రమణ, తొట్టకూటి గౌరీనాయుడులకు వీటి గురించి తెలియజేసి తనతో కలుపుకున్నాడు. లెంక శేఖర్‌, కర్నాన సురేష్‌, మొగిలి విజయ్‌కిరణ్‌లు కూడా వీరికి తోడయ్యారు. కె.సురేష్‌, ఎల్‌.సురేష్‌ల వద్ద ఉన్న కలర్‌ జిరాక్స్‌ మిషన్ల సాయంతో ఆరుగురు కలసి రూ.31 లక్షల నకిలీ నోట్లను తయారు చేశారు. వీటిని మార్కెట్‌లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. భోగాపురం మండలం సవరవల్లిలో సోమవారం జరిగే సంతలో తొలుత కరెన్సీ మార్పునకు ప్రయత్నించారు. కందిరాము మొదట మజ్జి రమణ, తొట్టకూటి గౌరీనాయుడు నుంచి అసలైన నోట్లు రూ.4,500 తీసుకుని తన వద్ద ఉన్న నకిలీనోట్లు రూ.15వేలు ఇచ్చాడు.


వీరిద్దరూ నోట్ల మార్పు కోసం సంతకెళ్లి గొర్రెల విక్రయదారుడు దువ్వు రామసూరిని కలిశారు. రెండు గొర్రెలను కొనుగోలు చేసేందుకు ధర మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య అంగీకారం కుదరడంతో రూ.10 వేల నకిలీ కరెన్సీ ఇచ్చి గొర్రెను కొనుగోలు చేశారు. వెంటనే విక్రయదారుడు తనకిచ్చిన నోట్లను నకిలీవిగా అనుమానించాడు. అన్నింటిపై ఒకటే సీరియల్‌ నంబర్‌ ఉండడంతో నకిలీవని నిర్ధారణకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే సమయంలో  గొర్రెలను తీసుకువెళ్తున్న వాహనాన్ని కూడా అనుసరించాడు. కొద్దిదూరం వెళ్లాక అడ్డగించి నిలదీశాడు. అంతలో భోగాపురం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. దర్యాప్తులో గుట్టురట్టయింది.


వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆరుగురిని అరెస్టు చేశారు.  రూ.31 లక్షల నకిలీ కరెన్సీ (500 నోట్ల కట్టలు), అసలైన కరెన్సీ రూ 65,300, ఐదు సెల్‌ఫోన్లు, కరె న్సీ నోట్ల ముద్రకు ఉపయోగించిన జెరాక్స్‌ మిషన్‌, కరెన్సీ కట్టర్‌, హీటింగ్‌ మిషన్‌, వైట్‌పేపర్‌బాక్స్‌, గ్రీన్‌పేపర్‌, రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ చెప్పారు. నకిలీ కరెన్సీ నోట్లు ప్రాథమిక స్థాయిలోనే పట్టుబడ్డాయి. లేకపోతే చాలా మంది బాధితులుగా మిగిలిపోయేవారు. విలేకరుల సమావేశంలో ఏఎస్‌పీ శ్రీదేవిరావు, విజయనగరం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, భోగాపురం సీఐ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


నకిలీ కరెన్సీపై అప్రమత్తం

నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో  మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే, నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కొంతమంది ఈ విధంగా చేస్తుంటారని, అటువంటివారి దారిలో ఎవరూ వెళ్లకూడదని సూచించారు.

Updated Date - 2020-07-01T11:53:06+05:30 IST