రాజధాని రైతులదే భవిష్యత్తు

ABN , First Publish Date - 2020-08-06T06:34:31+05:30 IST

‘సమీకృత అభివృద్ధి వికేంద్రీకరణ-మూడు రాజధానుల బిల్లు’, ‘ఎ.పి.సి.ఆర్‌.డి.ఏ. రద్దు బిల్లు’ లను రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించడం అత్యంత దురదృష్టకరం. ఈ రెండు...

రాజధాని రైతులదే భవిష్యత్తు

మూడు రాజధానుల, సిఆర్‌డిఏ రద్దు చట్టాలకు రాష్ట్ర గవర్నర్‌ ఆమోదముద్ర వేసినంత మాత్రాన అమరావతి రైతులు భయపడవలసిన ఆవశ్యకత లేదు. అమరావతిలో రాజధాని కొనసాగటమే సరియైనదని, ఆ రెండు చట్టాలూ చెల్లవని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తప్పనిసరిగా తీర్పు ఇస్తుందనే విశ్వాసంతో, మనోధైర్యంతో వుండాలి. అమరావతిలోనే ఏకైక రాజధాని కొనసాగుతుందని జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు యివ్వవలసిన రోజు త్వరలో వచ్చి తీరుతుంది.


‘సమీకృత అభివృద్ధి వికేంద్రీకరణ-మూడు రాజధానుల బిల్లు’, ‘ఎ.పి.సి.ఆర్‌.డి.ఏ. రద్దు బిల్లు’ లను రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించడం అత్యంత దురదృష్టకరం. ఈ రెండు బిల్లుల ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ విచారణ సందర్భంలో రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ఆ బిల్లులను శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి నివేదించినట్టు పేర్కొన్నారు. ఈ రెండు బిల్లుల విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగులో వుండగా, హైకోర్టు నిర్ణయం వెలువడక ముందే శాసనసభలో రెండవసారి (2020 జూన్ 16న) ప్రవేశ పెట్టడం నిబంధనలకు విరుద్ధం. లోగడ మండలికి పంపగా ఇదివరకే సెలెక్ట్‌ కమిటీకి పంపాలనే నిర్ణయం జరిగిందని, యిప్పుడు తిరిగి ఎలా ప్రవేశపెడతారని, మెజారిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారే తప్ప తిరస్కరించలేదు. రాజ్యాంగ అధికరణ 197 (1) (ఎ) (బి) (సి) క్రింద పరిణామాలు చోటుచేసుకొనకుండానే, అధికరణ 197 (2) ప్రకారం నెలరోజులు గడచిన తరువాత గవర్నర్‌ ఆమోదానికి రెండు బిల్లులూ పంపటం రాజ్యాంగ విరుద్ధం. లోగడ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎ.ఆర్‌. ఆంటోని విషయంలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం యిచ్చిన తీర్పుకు ఈ చర్య విరుద్ధం. 


వివిధ కోణాలలో పరిశీలించినప్పుడు గవర్నర్‌ ఆమోదం పొందడానికి ఈ రెండు బిల్లులకూ అర్హత లేదు. ‘అభివృద్ధి వికేంద్రీకరణ- మూడు రాజధానుల బిల్లు’కు ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ జతపర్చలేదు. నూతనంగా విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయాలంటే భూసేకరణ వ్యయంతోపాటు, భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కొన్ని వేలకోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ విషయం ప్రజలకు తెలియపర్చకూడదనే భావనతోనే ద్రవ్యబిల్లుగా కాక సాధారణ బిల్లుగా శాసనసభ రూల్‌ 93కు విరుద్ధంగా ‘మూడు రాజధానుల బిల్లు’ను ప్రవేశపెట్టారు. శాసనమండలి వ్యవస్థ వున్న రాష్ట్రాలలో రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లులకు మినహాగా ఇతర బిల్లులకు మండలి ఆమోదం తప్పనిసరి. గవర్నరు ఆమోదానికి బిల్లులను పంపేటప్పుడు రూల్‌ 124 ప్రకారం విధిగా శాసనసభ స్పీకర్‌, శాసనమండలి చైర్మన్‌ ఇద్దరూ సంతకాలు చేయాలి. కానీ ఈ రెండు బిల్లుల విషయంలో మండలి చైర్మన్‌ షరీఫ్‌ సంతకం చేయలేదు. 


ఈ అంశాలతో పాటు, ఆ రెండు బిల్లులూ రాజ్యాంగంలో పొందుపర్చబడిన నిబంధనలకు, భారత సర్వోన్నత న్యాయస్థానం యిచ్చిన పలు తీర్పులకు విరుద్ధంగా వున్నందున గవర్నరు ఆమోదం పొందడానికి వీలులేదు. ఉన్నత న్యాయస్థానాల వద్ద న్యాయ సమీక్షలో నిలబడవు. ఎందుకంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ‘అభివృద్ధి వికేంద్రీకరణ - మూడు రాజధానుల బిల్లు’లో సెక్షన్‌ 7 (1) (i), (ii), (iii) ప్రకారం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌, అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014’ సెక్షన్‌ 5(2)లో నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుందని పేర్కొనబడింది. ఒకే అంశానికి సంబంధించి, పార్లమెంటు ఆమోదం పొందిన చట్టంలో పేర్కొనబడిన దానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన చట్టంలో ఆ అంశానికి సంబంధించి భిన్నంగా వుంటే, రాజ్యాంగ అధికరణ 254 (2) ప్రకారం పార్లమెంట్‌ ఆమోదించిన చట్టంలో వున్నదే నిలబడుతుందని, శాసనసభ చేసిన చట్టంలో వున్నది చెల్లదని దీప్‌చంద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హిమాచల్‌ప్రదేశ్‌, లింగప్ప పోచన్న వర్సెస్‌ మహారాష్ట్ర గవర్నమెంట్ మున్నగు పలు కేసులలో సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. వీటిని పరిశీలించకుండా ఆ రెండు బిల్లులను గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడం గర్హనీయం. 


‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014’ ప్రకారం కేంద్రం నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీ నొకదాన్ని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా 2015 అక్టోబరు 22న అమరావతికి శంకుస్థాపన చేశారు. కొత్త రాజధానిలో భవనాల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.1,500 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో పరిపాలనకు అవసరమైన సెక్రటేరియట్‌, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు భవనాలు; ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిలలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తుల కొరకు నివాస భవనాలతోపాటు రహదారులు ఇతర మౌలిక వసతులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.10,000 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా రూ.19,000 కోట్ల రూపాయల పనులు 2019 శాసనసభ ఎన్నికల నాటికి కొనసాగుతూ వచ్చాయి. 


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ ప్రక్రియ సాఫీగా కొనసాగేందుకు ఎ.పి. సి.ఆర్‌.డి.ఎ. చట్టాన్ని, సి.ఆర్‌.డి.ఎ. సంస్థను ఏర్పాటు చేసింది. రాజధానిని అభివృద్ధి చేయటంతోపాటు రైతులకు నివాస, కమర్షియల్‌ ప్లాట్లను ఇవ్వడం, కౌలు, రుణమాఫీ, పెన్షన్‌ మున్నగు ప్రయోజనాలతోపాటు ఎల్‌.పి.ఎస్‌. లే ఔట్‌లను అభివృద్ధిపరిచి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీని విశ్వసించి ‘ఇర్రివర్సిబుల్‌ జనరల్‌ పవరాఫ్‌ అటార్నీ కండెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌’ పైన 26 వేలమంది రైతులు సంతకాలు చేశారు. తమ పట్టాభూములు 34,000 ఎకరాలను ప్రభుత్వానికి అందజేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం నిలుస్తుందా? నిలవదు. ‘స్టెరిలైట్‌ ఇండ్రస్ట్రీస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ వివాదంలో అప్పటికే పరిశ్రమ ఏర్పాటై నడుస్తూ వున్నందున దానిని మూసివేయాలనే ఉత్తర్వులు సరికాదని, అదే సమయంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు తగు చర్యలు తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని యిచ్చిన తీర్పు వంటివి మరికొన్ని ఉన్నాయి. కావున ఎ.పి.సి.ఆర్‌.డి.ఎ. రద్దు చట్టం న్యాయ సమీక్షలో నిలువదు. 


రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకునే నిర్ణయం హేతుబద్ధంగా, సమంజసంగా, రాజ్యాంగానికి లోబడి ఉండాలని, అలాకాని పక్షంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్ధంగా వుంటే కొట్టివేయవలసి వుంటుందని ‘శ్రీలేఖ విద్యార్ధి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యు.పి.’ కేసులో యిచ్చిన తీర్పుతోపాటు మరెన్నో వున్నాయి. వీటన్నిటినీ పరిశీలించకుండానే మూడు రాజధానుల, సిఆర్ డిఏ బిల్లులను గవర్నర్ ఆమోదించడం ఆయన హోదాకు ఎంతమాత్రమూ తగదు.


అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన కొరకు భూములను తీసుకోవడంతోపాటు దాదాపు రూ.270 కోట్లు కేంద్రప్రభుత్వం చెల్లించివున్నా రాజధాని తరలింపు విషయంలో కేంద్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధ్యతారాహిత్యం. వాస్తవంగా రాజ్యాంగంలో అధికరణ 256 ప్రకారంగా పార్లమెంట్‌లో ఆమోదం పొందిన చట్టాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణ వుండాలి. అందుకు భిన్నంగా ఉంటే అధికరణ 257 ప్రకారం, రాష్ట్రప్రభుత్వాన్ని తన పొరపాటు వైఖరిని మార్చుకోవాలని చెప్పి, అమలు చేయించవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానికి ఉంటుందని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో తీర్పులు ఇచ్చింది. కానీ కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులకు రాజ్యసభలో ఆమోదం పొందేందుకు వై.కా.పా. మద్దతు తీసుకునేందుకు గానూ, సాచివేత ధోరణిని అనుసరిస్తూ వుంది.


ఒక నూతన రాష్ట్రంలో ఒక పర్యాయం, ఒక ప్రభుత్వం ఒకచోట, వేలాది కోట్లు ఖర్చుచేసి రాజధానిని నిర్మించిన దరిమిలా, తరువాత వచ్చిన ప్రభుత్వం అక్కడి నుండి రాజధానిని మార్చేందుకు భారత రాజ్యాంగంలోగాని ఏ చట్టంలోగాని అవకాశం లేనప్పటికీ, బాధ్యత కల బి.జె.పి. అగ్రనాయకులు కొందరు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని, రాజధానిని తరలించాలని శాసనసభ తీర్మానం చేస్తే మార్చవలసి వస్తుందనే భావనను వ్యక్తం చేయడం ఆశ్చర్యకరం! అంతేకాక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం–1957, సెక్షన్‌ 51(1) రాజ్యాంగంలో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పరిశీలించి నవ్యాంధ్రప్రదేశ్‌లో హైకోర్టు కార్యస్థానం అమరావతిలో వుంటుందని భారత రాష్ట్రపతి నోటిఫై చేయగా, రూ.200 కోట్ల ఖర్చుతో నేలపాడు వద్ద హైకోర్టు భవనాల నిర్మాణం జరిగింది. 2018 జనవరి 1 నుండి హైకోర్టు పనిచేస్తూ వుండగా బి.జె.పి. రాజ్యసభ సభ్యుడు ఒకరు కర్నూలుకు హైకోర్టు తరలించాలని మాట్లాడటం సిగ్గుచేటు. 


మూడు రాజధానుల అంశం భూములిచ్చిన రైతులకే పరిమితమైన సమస్య కాదు. రాష్ట్ర అభివృద్ధిపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపే అంశం. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్ట దలిచిన పారిశ్రామికవేత్తలకు రాష్ట్రప్రభుత్వంపైన నమ్మకం సడలుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిలో రాజధానిని సమర్థించి, అధికారం వచ్చిన దరిమిలా మాటమార్చిన చందంగానే పరిశ్రమలు ఏర్పాటైన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పులు వచ్చే అవకాశం వుందని వారు భావించేందుకు ఆస్కారమున్నది. ఇప్పటికే కొన్ని ప్రముఖ సంస్థలు వెనుకకు వెళ్ళిపోయాయి. భవిష్యత్తులో పెద్దగా నూతన పరిశ్రమలు రానప్పుడు నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమౌతుంది. దాదాపు సంవత్సర కాలంగా తాయిలాలు అందించడమే తప్ప ఆశించిన స్థాయిలో నూతన నిర్మాణాలు కాని, ప్రాజెక్టుల ప్రగతిగాని కంచుకాగడా వేసినా ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, బి.జె.పి. నాయకత్వం చోద్యం చూడటం మాని మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా 13 జిల్లాలలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిచ్చేలా వ్యవహరించమని, రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి నచ్చజెప్పాలని ప్రజానీకం కోరుకుంటూ వుంటే, యిప్పుడు రాష్ట్ర గవర్నర్‌ రెండు బిల్లులకూ ఆమోదముద్ర వేయడం వెనుక కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వ పరోక్ష అంగీకారం వుందని స్పష్టంగా అర్ధమౌతూ వుంది. 


మూడు రాజధానుల, సిఆర్‌డిఏ రద్దు చట్టాలకు రాష్ట్ర గవర్నర్‌ ఆమోదముద్ర వేసినంత మాత్రాన అమరావతి రైతులు భయపడవలసిన ఆవశ్యకత లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో జరిగినట్లే అమరావతిలోనే రాజధాని కొనసాగటమే సరియైనదని, మూడు రాజధానుల చట్టం, సి.ఆర్‌.డి.ఎ. రద్దు చట్టాలు చెల్లవని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తప్పనిసరిగా తీర్పు యిస్తుందనే విశ్వాసంతో, మనోధైర్యంతో వుండాలి. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చిట్టచివరి క్షణంలో నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు యిచ్చినట్లే, అమరావతిలోనే ఏకైక రాజధాని కొనసాగుతుందని జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు యివ్వవలసిన రోజు త్వరలో వచ్చి తీరుతుంది.

వడ్డే శోభనాద్రీశ్వరరావు

Updated Date - 2020-08-06T06:34:31+05:30 IST