చిత్తానుసారం ఫలం

ABN , First Publish Date - 2020-11-03T09:16:10+05:30 IST

కేతుమాల వర్షంలో సత్యకేతుడు, ధర్మకేతుడు, కామ్యకేతుడు అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ముగ్గురూ తమ విద్యాభ్యాసం పూర్తికాగానే

చిత్తానుసారం ఫలం

కేతుమాల వర్షంలో సత్యకేతుడు, ధర్మకేతుడు, కామ్యకేతుడు అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ముగ్గురూ తమ విద్యాభ్యాసం పూర్తికాగానే గురువుగారి ఆశీస్సులతో సాధనా మార్గంలో ప్రవేశించారు. ఇంటికి వెళ్లకుండా దగ్గరలో ఉన్న విపుల పర్వత శ్రేణిలోని సితోద సరస్సు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఎత్తైన మహా వృక్షాలుండేవి. వాటిలో ఒక విశాలమైన వృక్షం ఈ అన్నదమ్ములు ముగ్గురికీ నివాసంగా కుదిరింది. ఆ చెట్టుకు మూడువైపులా మూడు గుహల వంటి తొర్రలలో వారు నివాసం ఏర్పరచుకున్నారు. సంవత్సర దీక్ష తీసుకుని శివుని గురించి తపస్సు చేయడం మొదలు పెట్టారు. అయితే వారి తపస్సు మొదలైన తొలి వారం నుంచి చెట్టుపైనున్న కొమ్మల నుంచి బంగారపు రాశులు తునకలు తునకలుగా వారి ముందు పడుతున్నాయి. చెట్టు పైన ఉన్న భేరుండ పక్షులు సమీప వనాల నుంచి మిగుల ముగ్గిన సువర్ణవృక్ష ఫలాలను తెచ్చి తినే సమయంలో రాలుతున్నతునకలవి. సత్యకేతుడు ప్రతి రోజూ అలా పడిన బంగారాన్ని అంతటినీ పోగుచేసి, దూరంగా పారబోసి వచ్చేవాడు. అతనికి మనసులో ఎప్పుడూ శివుని దివ్య స్వరూపమే కనబడుతుండేది. ధర్మకేతుడు తనముందు పడిన బంగారాన్ని పోగుచేసి వారానికి ఒకసారి సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్లి ఆ గ్రామస్థులకు దానం చేసి వస్తుండేవాడు. వారి ఉద్దరణకు తాను ఏదో చేయాలి అనుకునే వాడు. కామ్యకేతుడు తానున్న గుహను అలా పడిన తునకలతో నింపుతున్నాడు. రోజులు నెలలవుతున్నాయి. వారి దీక్ష ఎంతో శ్రద్ధాసక్తులతో జరుగుతోంది.


ఈ మధ్యలో కామ్యకేతుణ్ని.. అక్కడ సంచరించే సిద్ధపురి దంపతుల విహారాలు కూడా ఆకట్టుకున్నాయి. సితోద సరస్సులో వారి జలక్రీడల సమయం, ఇతని స్నానసమయం ఒకటే. ఒకసారి సిద్ధపురి రాజకుమారిని చూశాడు. ఇక అతని సంకల్పంలో ప్రతి నిత్యం సిద్ధరాజకుమారి కూడా ఒక భాగం అయ్యింది. సంవత్సర దీక్ష ముగిసింది. ముగ్గురికీ శివ సాక్షాత్కారం అయ్యింది. సత్యకేతుడు తనకు మోక్షం తప్ప మరేమీ అక్కర్లేదన్నాడు. ధర్మకేతుడు.. ప్రజలను ధర్మ తత్పరులను చేసి, ధర్మస్థాపన చేసేందుకు తగిన శక్తిసామర్థ్యాలను కోరుకున్నాడు. కామ్యకేతుడు.. తాను కుబేరుడంత ధనవంతుడు అయ్యేలా, సిద్ధరాజకుమారి తనకు భార్య అయ్యేలా వరం అడిగాడు. శివుడు ముగ్గురినీ తథాస్తు అని ఆశీర్వదించాడు. అయితే.. ‘‘ముందు మీ గ్రామాలకు వెళ్లి పితృ ఋణం తీర్చుకోండి’’ అని సూచించాడు. శివుని ఆజ్ఞ మేరకు ముగ్గురూ తమ గ్రామానికి చేరుకునేసరికి వారి తండ్రి గతించాడు. తండ్రికి జరపవలసిన ఉత్తర క్రియలన్నీ నిర్వహించారు. తల్లిని చూసుకునే బాధ్యతను ధర్మకేతుడు తీసుకున్నాడు. కామ్యకేతుడు తాను తెచ్చిన బంగారాన్ని ఇంటికి చేర్చగానే అది అనంతంగా పెరగడం మొదలు పెట్టింది.


అతని ఐశ్వర్యం లోకోత్తరంగా ఉంది. సిద్ధచక్రవర్తికి కబురు పంపగానే కామ్యకేతుని గురించి అంతా తెలుసుకుని.. రాజు తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. సత్యకేతుడు తనువు చాలించి శివసాయుజ్యం పొందాడు. అతను తనువును విడిచిన ప్రదేశంలో ఒక దివ్య వటవృక్షం ఆవిర్భవించింది. కష్టాలతో బాధపడేవారు ఆ చెట్టు కిందకు చేరి ప్రార్థన చేస్తే వారి కష్టాలు తీరుతుండేవి. ధర్మ కేతువు తన ప్రాంతానికి రాజై ప్రజలనందరినీ ధర్మవర్తనులుగా తీర్చి దిద్దాడు. చిత్తానుసారం ఫలం.. అంటే, భగవంతుని ఎవరు ఏ బుద్ధితో కొలిస్తే అదే విధమైన ఫలితం లభిస్తుందని చెప్పే కథ ఇది. 


                                                                                                            ఆచార్య రాణి సదాశివ మూర్తి



Updated Date - 2020-11-03T09:16:10+05:30 IST