నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేవి దేవీ శరన్నవరాత్రులు. అయితే భారతీయ సంస్కృతిలో వివిధ మాసాల్లో నవరాత్రులను జరిపే సంప్రదాయం ఉంది. వాటిని చైత్ర, ఆషాఢ, మాఘ మాసాల్లో నిర్వహిస్తారు.
చైత్రే శ్వినే తథాషాడే మాఘే కార్యోమహోత్సవః
చతుర్షు నవరాత్రేషు విశేషాత్ఫలదాయకః- అని ‘దేవీ భాగవతం’ చెబుతోంది. గొప్ప ఫలితాలను కోరుకొనే వారు ఈ నాలుగు నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించాలని సూచిస్తోంది.
వసంత నవరాత్రి: వసంతకాల ప్రారంభమైన చైత్ర మాసంలో మొదటి తొమ్మిది రోజులూ నిర్వహించే నవరాత్రులను ‘వసంత నవరాత్రులు’ అంటారు. దేవీ పూజలను ఈ రోజుల్లో విశేషంగా చేస్తారు. అలాగే పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీరామ నవరాత్రులను జరిపి, తొమ్మిదో రోజైన శ్రీరామ నవమి నాడు సీతారామ కల్యాణం నిర్వహిస్తారు.
ఆషాఢ నవరాత్రి: ఆషాఢ మాస శుక్ల పక్షంలోని తొలి తొమ్మిది రోజులూ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటిని ‘శాకంబరీ నవరాత్రులు’గా, ‘గుప్త నవరాత్రులు’గా వ్యవహరిస్తారు.
శరన్నవరాత్రులు: శరద్రుతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులను ‘శరన్నవరాత్రులు’, ‘దేవీ నవరాత్రులు’గా పాటిస్తారు. అమ్మవారిని వివిధ సంప్రదాయాల ప్రకారం తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. పదో రోజైన విజయదశమిని చెడుపై మంచి గెలిచిన పర్వదినంగా నిర్వహిస్తారు.
మాఘ నవరాత్రులు: మాఘ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకూ... తొమ్మిది రోజులు ఆదిపరాశక్తిని ఆరాధిస్తారు. మహా విష్ణువుకూ, సూర్యుడికీ ప్రీతికరమైన మాఘ మాసంలోని ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం అత్యంత ఫలదాయకమని పెద్దలు చెబుతారు.
- పుష్య నవరాత్రుల ప్రస్తావన ‘దేవీ భాగవతం’లో లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో పుష్య పాడ్యమి నుంచి నవమి వరకూ దేవీ ఆరాధన చేసే సంప్రదాయం ఉంది.