విస్మృత కావ్యకర్త

ABN , First Publish Date - 2021-02-01T05:55:50+05:30 IST

జంధ్యాల సుబ్రహణ్య శాస్త్రిగారు మార్చి 1, 1892న జన్మించి అక్టోబర్‌ 24, 1980న కన్నుమూశారు. గుర్రం జాషువా వంటి గొప్ప కవులకు సమకాలికులు...

విస్మృత కావ్యకర్త

జంధ్యాల సుబ్రహణ్య శాస్త్రిగారు మార్చి 1, 1892న జన్మించి అక్టోబర్‌ 24, 1980న కన్నుమూశారు. గుర్రం జాషువా వంటి గొప్ప కవులకు సమకాలికులు. సంఘసంస్కరణ, స్వాతంత్ర్యో దమ కాలంలోపుట్టి విప్లవోద్యమ కాలంలో కన్నుమూశారు. అనేక సామా జిక ఉద్యమాలను, పరిణామాలను చూశారు. అయినా వాటితో మమేకమై నట్లు లేరు. ఆయన అవధాని, చారిత్రక కావ్య కవి. అవధానులుగా ఉంటూ గొప్ప కావ్య రచన చేసినవారు పరిమిత సంఖ్యలోనే ఉన్నారనుకుంటాను.  


సుబ్రహణ్యశాస్త్రిగారు రత్నలక్ష్మీశతపత్రం (105 పాఠాల పద్యమాలిక) శ్రీలక్ష్మీ నరసింహస్వామి శతకము, శ్రీశ్రీశ్రీ జినకుంట వేంకటేశ్వరస్వామి శతకము, సీతారామ కళ్యాణం అనే పద్యనాటకం రచించారు. ఇవి మాత్రమే రాసి ఉంటే శాస్త్రిగారిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం ఉండేది కాదు. అలాంటివి చాలామంది రాశారు గనక. శాస్త్రిగారు శంకర భగవత్పాదుల ‘వేదాంత పంచ దశి’ని ‘శ్రీమదాంధ్ర వేదాంత పంచదశి’గా అనువాదం చేశారు. నావరకు ఇది కూడా అంత ముఖ్యం కాదు. ఆయన రెండు చారిత్రక కావ్యాలను కూడా రాశారు. అవి ‘సాలంకార కృష్ణదేవరాయలు’, ‘ఆంధ్ర సామ్రాజ్యము’ అనేవి.  


చరిత్రను పరిశోధించకుండా చారిత్రక కావ్యం రాయడం కష్టం. ‘సాలం కార కృష్ణదేవరాయలు’ విజయనగర రాజ్య చరిత్రను ప్రతిబింబిస్తుంది. ‘ఆంధ్ర సామ్రాజ్యము’ శాతవాహనుల కాలం నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ దాకా గల తెలుగు జాతి చరిత్రను ప్రతిబింబిస్తుంది. బహుశా తెలుగుజాతి చరిత్ర మీద ఇంత పరిమాణంలో ఎవరూ రాయలేదనుకుంటాను (రెండు కావ్యాలూ కలిపి ఐదువేల పద్యాలకు మించి ఉన్నాయి). ఈ కావ్యాలను శాస్త్రిగారు 1960లలో రాశారు. బహుశా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణే ఇందుకు ప్రేరణ అయివుంటుంది. దుర్భాక రాజశేఖర శతావధాని ‘రాణా ప్రతాపసింహ చరిత్ర’, గడియారం వెంకటశేషశాస్త్రి ‘శివభారతము’, మధునాపంతుల సత్యనారా యణ శాస్త్రి ‘ఆంధ్ర పురాణము’, విశ్వనాథ సత్యనారాయణ ‘ఝాన్సీ లక్ష్మి’, ‘ఆంధ్ర పౌరుషము’ వంటి అనేక చారిత్రక కావ్యాలు బాగా గుర్తింపు పొందాయి. జంధ్యాల వారి కావ్యాలు ఎందుకు గుర్తింపు పొందలేదు? చారిత్రక కావ్యరచ నలు భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఎక్కువ వచ్చాయి. అప్పటికి గత చరిత్రను స్మరిం చుకోవడం చారిత్రక అవసరం, సాహిత్య అవసరం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని చారిత్రక కావ్యాలు వచ్చాయి. 1960లు వచ్చేసరికి చారిత్రక కావ్యాల పట్ల ఆసక్తి తగ్గింది. ఇది కారణం కావచ్చు. పైగా అప్పటికి స్వాతంత్ర్యానంతర భారతదేశ పరిణామాలపట్ల విమర్శనాత్మకంగా కవిత్వం రాసే పద్ధతి బలపడింది తెలుగులో. వచన కవిత ప్రధాన వాహికగా ఉంది. ఈ కారణం వల్ల కూడా జంధ్యాల వారి కావ్యాలు మరుగునపడి ఉంటాయి. 


ఈ మధ్య సాహిత్య విమర్శ అవాంఛనీయం అనే అభిప్రాయం చర్చనీ యాంశంగా నలుగుతున్నది. రచయితకు పాఠకులు చాలు, విమర్శకులక్కర లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి 1960లలో రెండు చారిత్రక కావ్యాలు రాశారు. కవి రాశాడు. కానీ పాఠకులు పట్టించుకోలేదు. ఇప్పుడు విమర్శకుడు పట్టించుకున్నాడు. పాఠకులు చాలు, విమర్శకులు అక్కరలేదు అనుకుంటే, 50ఏళ్ల క్రితం వచ్చిన కావ్యాలను విస్మరించిన సమాజానికి దిక్కెవరు? ఆ కవికి దిక్కెవరు? విమర్శకులే. నియోగివంటి విమర్శకులే. నియోగిగారి ఈ విమర్శ గ్రంథం సాహిత్యానికి విమర్శకులెంత అవసరమో ఋజువు చేస్తున్నది. ఈ పుస్తకం పేరు ‘అక్షరాల అడుగుజాడల్లో పంచసహస్రావధాని’. పాఠకుల చేతులలో ఈ పుస్తకాన్ని పెట్టిన సందర్భంగా నియోగిగారికి శుభాకాంక్షలు. 

రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, 94402 22117

Updated Date - 2021-02-01T05:55:50+05:30 IST