Abn logo
Nov 24 2020 @ 00:19AM

ముందున్నది మహా పరీక్ష

ఇప్పుడిక దృష్టి మరొక బృహత్ కార్యం వైపు మళ్లించవలసి ఉన్నది. ఇంతకాలం, మన ప్రమేయం లేకుండా ముంచుకువచ్చిన ఉపద్రవం నుంచి కాచుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాము. కొవిడ్–19 ఇంతకుముందు తెలిసినది కాదు కాబట్టి, దానికి మందు లేదు కాబట్టి, ఆ తరహా వ్యాధులకు ఇప్పటికే వాడుతూ ఉన్న చికిత్సా పద్ధతులను, మందులను ఉపయోగిస్తున్నాము. సకాలంలో చికిత్స మొదలుపెట్టని, పెట్టలేకపోయిన రోగులు, చికిత్స అందినా ఫలితం పొందని రోగులు చనిపోతుంటే ప్రపంచం నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. ప్రపంచవాప్తంగా ఒకేసారి కమ్ముకున్న అంటువ్యాధి మరొకటి చరిత్రలో లేదు. ఆరు కోట్ల మందికి వ్యాధి సోకగా, పధ్నాలుగు లక్షల మంది మరణించారు. ఇంత కంటె చిన్న ఈతివ్యాధులకు కూడా ఇంత కంటె ఎక్కువ సంఖ్యలో జనం చనిపోయి ఉండవచ్చును. కానీ, వైద్య ఆరోగ్య వ్యవస్థలు, చైతన్యం ఇంతగా పెరిగిన ఈ ఆధునిక కాలంలో ఇన్ని ప్రాణాలు బలి అయ్యాయంటే, వైరస్ తీవ్రత ఎంతటిదో, మానవ సామర్థ్యం పరిమితి ఏమిటో అర్థం అవుతుంది. 


వ్యాధి వ్యాప్తి తీవ్రత తగ్గుతోంది. కొన్ని చోట్ల తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నది. భారత్‌లో కేసుల సంఖ్య రానురాను తగ్గుతూ ఉన్నది. మరోవిడత వ్యాప్తి రాకపోతే, ఈ పతనం శుభసూచకమే. కరోనా కారణంగా మూతపడిన సమస్త జీవనరంగాలూ క్రమంగా సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని వచ్చేశాయి. మరి కొన్నిటికి ప్రజలు పూర్తి సంసిద్ధత తెలపడం లేదు, ఇంకొన్నిటిని ముందుజాగ్రత్తతో ప్రభుత్వాలు, యాజమాన్యాలు ---అనుమతించడం లేదు. వ్యాధి వ్యాప్తి నిలిచిపోయిందని మాత్రమే కాక, మళ్లీ రాదని హామీ దొరికితే తప్ప, పూర్వ స్థితికి ప్రపంచం రాదు. అందుకు అంతిమ మార్గం- సమర్థమైన, దీర్ఘకాలిక రక్షణ ఇచ్చే టీకా మాత్రమే. టీకా పరిశోధనల విషయంలో వినిపిస్తున్న మంచివార్తలు ఈ కరోనాకాలం త్వరలో ముగిసిపోతుందన్న ఆశ కలిగిస్తున్నాయి. అనేక దేశాల్లో వివిధ బృందాలు 42 ఔషధాలను క్షేత్రస్థాయిలో పరీక్షిస్తున్నాయి. ప్రస్తుతానికి కనీసం మూడు ప్రయోగాలు ఫలితానికి సమీపంలో ఉన్నాయి. ప్రాణులపై, మనుషులపై ప్రయోగాలు, ఇతర సామర్థ్య పరీక్షలు మాత్రమే కాదు, తయారుచేసిన టీకాలు మూలమూలలకు ఎట్లా చేరవేయడం అన్నది పెద్ద పరీక్ష. ఒక్కొక్కరికి రెండు పర్యాయాలు టీకా ఇవ్వాలని అనుకుంటే, వెయ్యి కోట్లకు పైగా డోసులను రవాణా చేయవలసి ఉంటుంది. కనీసం పదిహేనువేల విమానసర్వీసులు ఈ రవాణా కోసమే నడపవలసి ఉంటుంది. 


అమెరికాలో రూపొందిస్తున్న ఒక టీకాను మైనస్ 70 డిగ్రీల దగ్గర నిల్వ చేయాలట. అంతటి చల్లదనాన్ని నిర్వహించే రిఫ్రిజిరేటర్లు మందుల దుకాణాల వద్ద ఉండవు. రవాణా చేయడంలోనూ ఆ నిల్వ శీతలత సమస్య అవుతుంది. టీకాను రూపొందిస్తున్న ఫైజర్ కంపెనీ సూట్‌కేసు పరిమాణంలో ఉండే, పారిశ్రామిక అవసరాలకు, నిల్వల కోసం వాడే డ్రై ఐస్‌ను మాత్రమే ఉపయోగించే సంచార రిఫ్రిజిరేటర్ రూపొందించింది. ఇందులో సుమారు 2 నుంచి 4 వేల దాకా డోసులున్న టీకా సీసాలు నిల్వ చేయవచ్చు. వాటి రవాణా, నిర్వహణ కూడా ఎంతో సున్నితమైనవి. భారతదేశం అతిశీతల స్థితిలో ఉంచిన టీకాలను కాక, ద్రవరూపంలో ఉండే టీకాలను కోరుకుంటున్నది. మన దేశంలో కూడా గాజు సీసాలను కోట్లాది సంఖ్యలో తయారు చేయడం, రవాణా చేయడం ఎంతో సాధకబాధకాలతో కూడుకున్నది. 


పైన పేర్కొన్నవన్నీ, టీకా తయారీకి ఉన్న భౌతికమయిన పరిమితులు, ఇబ్బందులు. మానవులందరికీ టీకా వేయడం అన్నది అంతకు మించిన పెద్దపని. పిల్లలకు సార్వత్రకంగా టీకా వేయడం అందరికీ తెలిసిందే. పల్స్ పోలియో టీకా వంటివి ఏకకాలంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలు. గర్భవతులకు ధనుర్వాతం రాకుండా వేసే టీకా తప్ప వయోజనులకు మన దేశంలో ఏ టీకా కూడా వేయడం లేదు. కొవిడ్–19 టీకా అటువంటి మొట్టమొదటిది. అందరికీ, అన్ని వయసుల వారికీ వేయవలసిన టీకా. ఏకకాలంలో వేయవలసిన అవసరం లేకపోవచ్చును, అది సాధ్యం కూడా కాకపోవచ్చును. ప్రాధాన్యాలు ఉం టాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది, ఎక్కువ మంది ప్రజలతో మెలిగే ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు- ఇట్లా ప్రాధాన్య వర్గాలను గుర్తించవచ్చు. కానీ, సార్వజనీనంగా టీకా అందుతోందా లేదా అన్నది గమనించవలసిన అంశం. మన దేశంలో ఏ టీకా కూడా నిర్బంధం కాదు. రకరకాల కారణాల వల్ల టీకాల విషయంలో విముఖత కూడా ప్రజలలో ఉన్నది. లక్షలాది మంది వైద్యసిబ్బంది, ముఖ్యంగా నర్సులు ఈ బృహత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. తగినంత మంది శిక్షిత సిబ్బంది లేకపోతే, అందవలసిన వారికి అందకపోతే, అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కరోనా టీకాలకు ఎన్నికలకు ముడిపెట్టిన ఉదాహరణలున్న దేశంలో, ప్రభుత్వాలకు టీకాలు వేయడం పెద్ద సవాలే. ప్రజల సహకారాన్ని, స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యాన్ని పొందకుండా పూర్తిచేయగలిగే కర్తవ్యం కాదు ఇది.

 

ప్రభుత్వాలు ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటున్నాయా, తగిన సన్నాహాలు చేసుకుంటున్నాయా- అని అనుమానం కలుగుతూ ఉంటుంది. అనుమానాలకు తావు లేకుండా భరోసా ఇవ్వవలసిన బాధ్యత పాలకులదే. ప్రభుత్వాల, ప్రభుత్వ యంత్రాంగాల సామర్థ్యానికే ఇది పెద్ద పరీక్ష.

Advertisement
Advertisement
Advertisement