ప్రతిపక్షాల ముందున్న కర్తవ్యం

ABN , First Publish Date - 2022-03-16T05:52:51+05:30 IST

రాజకీయ చదరంగ క్రీడలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మించినవారు లేరని ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు నిరూపించాయి. సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా తక్కువ ఎత్తుగడలు వేయలేదు. ఆయన పూర్తిగా అంకగణితాన్ని నమ్ముకుని...

ప్రతిపక్షాల ముందున్న కర్తవ్యం

రాజకీయ చదరంగ క్రీడలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మించినవారు లేరని ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు నిరూపించాయి. సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా తక్కువ ఎత్తుగడలు వేయలేదు. ఆయన పూర్తిగా అంకగణితాన్ని నమ్ముకుని పావులు కదిపారు. యాదవులు, ముస్లింలు సంఘటితంగా ఓటు వేస్తే 30 శాతం ఓట్లు లభిస్తాయని, మరో 15 శాతం తనకు లభిస్తే ఎన్నికల్లో విజయం తనదేనని ఆయన ప్రగాఢంగా నమ్మారు. రాష్ట్రం నలుమూలలా ఏడు చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. రకరకాల కులసమీకరణలు చేశారు. వాటివల్ల కనీసం 15 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేశారు. అక్కడితో ఆగకుండా బిజెపి శిబిరంలో ఉన్న స్వామిప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ లాంటి వారికి వల వేశారు. అసంతృప్తులపై ఒక కన్ను వేసి ఉంచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బిజెపి సీటు నిరాకరిస్తే తమవైపు లాగడానికి వీలుగా చివరి నిమిషం వరకూ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఆగారు, యాదవేతర బీసీల్లో కుర్మీలకు అధిక సీట్లు ఇచ్చారు. ముస్లిం ఆధిపత్యం ఉన్న చోట్ల కూడా వారికి సీట్లు ఇచ్చి బిజెపి అభ్యర్థి ఓట్లను చీల్చేందుకు ప్రయత్నించారు. అఖిలేశ్ యాదవ్ ఎత్తుగడలను ఎదుర్కోవడం కోసం బిజెపి చాలా చోట్ల తప్పని సరిగా సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఆలస్యంగా ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ అఖిలేశ్ పన్నాల్సిన ఎత్తుగడలనన్నీ పన్నారు. అంతకంటే ఆయన చేయగలిగింది ఏమీ లేకపోయింది. అయినప్పటికీ సమాజ్‌వాది పార్టీ కేవలం 32 శాతం మాత్రమే ఓట్లు సాధించగలిగింది. కేవలం, ముస్లింలు, యాదవులు బలంగా ఉన్న చోట మాత్రమే అది ఎక్కువ సీట్లను గెలుచుకోగలిగింది. ఎంత కష్టపడ్డప్పటికీ ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా సమాజ్‌వాది పార్టీ ప్రభావం చూపలేదన్న విషయం స్పష్టమైంది.


భారతీయ జనతా పార్టీ కూడా అంకగణితాన్ని ప్రయోగించింది. యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితులపై గతంలో మాదిరే బలమైన సామాజిక సమీకరణలను ఉపయోగించుకుంది. కాని అంకగణితంతో పాటు అనేక ఇతర కారణాలు, ప్రధానంగా మోదీ, యోగీ రసాయనం బిజెపికి ఎక్కువ ఉపయోగపడింది. బహుజన సమాజ్ పార్టీకి చెందిన జాతవులు, జాతవేతర ఓట్లు బిజెపివైపు మొగ్గాయి. బిజెపిని మనువాద పార్టీగా భావించే బలమైన కాన్షీరాం వాదులు తప్ప అంబేడ్కరిస్టులు, మిగతా వారు బిజెపి వైపు మొగ్గు చూపారు, వారిలో యువకులను గుర్తించి బిజెపి వైపు తీసుకువచ్చే ప్రయత్నం చాల కాలం నుంచి జరిగింది, బిఎస్‌పి ఓట్లు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 6.3 నుంచి 2.3 శాతానికి పడిపోయింది. ‘మై లడ్కీ హూ, లడ్ సక్తాహూ’ (నేను ఒక బాలికను, నేను పోరాడగలను) అంటూ ప్రియాంకాగాంధీ 40 శాతం మహిళలకు సీట్లు ఇచ్చినప్పటికీ మహిళలు అత్యధిక శాతం బిజెపికి ఓటు వేశారని సిఎస్ డిఎస్ అంచనాలు వెల్లడించాయి. ఆమె గంగా యాత్రలు కూడా ఫలించలేదు, రాయబరేలీ, అమేథీల్లో కూడా ఆమె పార్టీని గెలిపించలేకపోయారు. ప్రియాంక హవా ఏమీ లేదని తెలిసిన జితిన్ ప్రసాద, ఆర్‌పీఎన్ సింగ్ లాంటి నేతలు బిజెపి వైపు మొగ్గు చూపారు. రైతులపై హింసాకాండ అమలు జరిగిన లఖీంపూర్ ఖేరీలో 8 సీట్లలో ఆరు గెలుస్తామని బిజెపి భావించింది, కాని మొత్తం సీట్లను ఆ పార్టీ గెలుచుకోగలిగింది, ముస్లింలు 30 శాతం ఉన్న చోట్ల కూడా బిజెపికి ఢోకా లేకుండా పోయింది, జాట్‌లలో 50 శాతం పైగా బిజెపివైపు మొగ్గు చూపారని గణాంకాలు చెబుతున్నాయి. బిజెపి ఏఏ వర్గాలను లక్ష్యంగా ఎంచుకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది.


గత ఎనిమిది సంవత్సరాల్లో నాలుగు ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం చిన్న విషయం కాదు. మళ్లీ మళ్లీ బిజెపికి ఓటు ఎందుకులే అన్న నిరాసక్తత జనంలో రాకుండా బిజెపి చూసుకుంది. ఓటింగ్‌కు వెళ్లాలి, బిజెపిని గెలిపించాలి అన్న టెంపోను నిలబెట్టారు. కేవలం సామాజిక సమీకరణాలే కాదు, క్రింది స్థాయి నుంచి పనిచేసే బలమైన సంస్థాగత శక్తి బిజెపికి ఉన్నది. ఎంత అభివృద్ధి జరిగినా తమకేమి ఒరిగిందిలే అని సామాన్య ప్రజలు భావిస్తారని తెలిసినందువల్ల లబ్ధిదారులపై దృష్టి కేంద్రీకరించారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే బిజెపిలో లుకలుకలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, జాతీయ, రాష్ట్ర పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేసేలా చూశారు. ప్రతి రాష్ట్రం నుంచీ 2వేల మంది కార్యకర్తల్ని రప్పించారు, మిగతా పార్టీలకంటే బిజెపిలో తిరుగుబాటు అభ్యర్థులు తక్కువే ఉన్నారు. ఆరుగురు తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో ఇద్దరు మాత్రమే చివరకు మిగిలారు, మిగతా వారు ఎన్నికల ప్రచారం చేయకుండా నాయకులు చూసుకున్నారు. 30 మంది ఎమ్మెల్యేలు యోగీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉంటే వారు మోదీ ముఖం చూసి పార్టీకోసం పనిచేసేలా చూశారు. అన్నిటికన్నా బిజెపి నేతలందర్నీ కట్టిపడేసేది అధికంగా సంఘ్‌తో అనుబంధం, ఒక సైద్ధాంతిక బంధం. ఈ విషయంలో మిగతా పార్టీలు బిజెపితో పోటీ పడలేవు.


అంతర్గత అంచనాల ప్రకారం ముస్లింలు పూర్తిగా అఖిలేశ్ యాదవ్ వైపు మొగ్గలేదు, కేవలం 0.49 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఎంఐఎం ఏడు సీట్లలో ఎస్‌పికి నష్టం చేయగలిగింది, తాను పోటీ చేసిన సీట్లలో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు, సాధించింది మంచి పనితీరే కనపరిచింది, ఆసక్తికరమైన విషయం ఏమంటే 8 నుంచి 16 శాతం వరకు ముస్లింలు ప్రధానంగా ముస్లిం మహిళలు బిజెపికి ఓటు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉజ్వల్, పక్కా ఇళ్ల విషయంలో ముస్లింల పట్ల వివక్షత చూపలేదని, 33 శాతం ఇళ్లు ముస్లింలకే కేటాయించామని బిజెపి నేతలు చెబుతున్నారు.


ఏ ఎన్నికకైనా కొన్ని సంవత్సరాల ముందే పకడ్బందీగా ప్రణాళికా బద్దంగా పనిచేయడం బిజెపి తత్వం. ముఖ్యంగా నరేంద్రమోదీకి ఎన్నికలంటే ఎంతో ఇష్టం. ఉత్తరప్రదేశ్‌లో ఏడాది ముందు నుంచే ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు, ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రెండో దశలో ప్రచారంలో ఉండేవారు. యూపీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి 24 గంటలు కాకముందే నరేంద్రమోదీ గుజరాత్‌కు వెళ్లి రెండు రోజులు అక్కడే గడిపారు. అహ్మదాబాద్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. పంచాయతి మహా సమ్మేళన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీని ప్రారంభించారు. అన్నిటికంటే ఎక్కువగా అందర్నీ ఆకర్షించింది మోదీ తన తల్లి ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవడం. ఈ సన్నివేశాలన్నీ డిసెంబర్‌లో గుజరాత్‌లో జరిగే ఎన్నికలకు నాందీ ప్రస్తావనలుగా భావించినప్పటికీ, మోదీని నవ రస నటనా సార్వభౌముడిగా అనేక మంది అభివర్ణించినప్పటికీ ప్రజలు తన హావభావాలను సహజంగా భావించేలా చేయడమే ఆయన ప్రత్యేకత. మోదీ చేసిన పనులే రాహుల్ గాంధీ చేస్తే చాలా కృత్రిమంగా కనిపిస్తుంది, ప్రియాంక ‘హరహర మహదేవ’ అని నినాదం చేస్తే జనం వింతగా చూశారు. అందువల్ల 2019 చివరి దశ పోలింగ్ సమయంలో నరేంద్రమోదీ కేదార్‌నాథ్ గుహకు వెళ్లి తపోధ్యానంలో మునిగిపోయినా, యూపీ ఎన్నికల చివరి ఘట్టంలో వారణాసిలో రైల్వే స్టేషన్‌కు వెళ్లి సామాన్యులతో సంభాషించినా జనం మనసుల్లో బలమైన ముద్ర వేయడానికే అని అర్థమైనప్పటికీ ఆయనను ఈ విషయంలో అధిగమించగలిగిన నేత విపక్షాల్లో లేరని మాత్రం చెప్పక తప్పదు, మోదీ రసాయనానికి అంకగణితం తోడైతే ఏమవుతుందో ఈ ఎన్నికలు నిరూపించాయి.


అయితే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలు మోదీని ఎదుర్కొనే విషయంలో వెనక్కు తగ్గుతాయా? వెనక్కి తగ్గినంత మాత్రాన బిజెపి ఆ పార్టీలను కబళించకుండా ఉంటుందనుకోవడానికి వీల్లేదు, కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్న బిజెపి ప్రాంతీయ పార్టీలను నిర్మూలించడంపై ఏనాడో దృష్టి సారించింది. కనుక అవి తమ అస్తిత్వం కాపాడుకోవడానికైనా పోరాడక తప్పదు. ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలను కాపాడుకోవడానికైనా కలిసికట్టుగా కార్యాచరణ చేయక తప్పదు. అంతేకాదు, యూపీ ఎన్నికలను సెమిఫైనల్స్‌గా భావించడానికి వీలు లేదు. ఈ ఏడాది గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలోనూ, వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. బిజెపి జగన్నాథ రథచక్రాలను అడ్డుకోవాలంటే ముందుగా ఆ పార్టీ ప్రత్యర్థులు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సుపరిపాలనపై దృష్టి కేంద్రీకరించాలి. బిజెపి తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఏ విధంగా అధిగమించిందో గ్రహించాలి. బిజెపిని ఎదుర్కోవడానికి వాటికి సైద్ధాంతిక స్పష్టత కూడా అవసరం. అఖిలేశ్ యాదవ్ అనుభవం నుంచి ఆయా ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది.


మోదీకి మాత్రమే కాదు, నిజానికి ప్రపంచంలో చాలా మంది నేతలకు ఎన్నికలంటే చాలా ఇష్టం. ఎన్నికలు జరిగితే ప్రజల్లో తమ జనాకర్షణ నిరూపించుకోవచ్చునని వారు అతి ఉత్సాహంతో భావిస్తారు. ఆధునిక ప్రపంచంలో రష్యాలో వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ యున్, బెలారస్‌లో అలెగ్జాండర్ లుకషెంకో మొదలైన వారు ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యంలో తమ వంటి ప్రజానాయకులకు తిరుగులేదని భావిస్తారు. ఎమర్జెన్సీలో అరాచక పాలన చేసిన ఇందిరాగాంధీ కూడా రెండేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చి తన విధానాలకు ప్రజలు తిరిగి ఆమోద ముద్ర వేశారని భావించారు. రాజీవ్ గాంధీ అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు. అయినా ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేకం దురదృష్టకర పరిణామాలకు దారితీశాయి. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉండడం, విధానాలు సవ్యంగా ఉండడం వేర్వేరు విషయాలు. గెలుపు ఓటములతో ప్రమేయం లేకుండా నిర్ణయాలు, వ్యవహారశైలి, విధానాలు, పనితీరు ఆధారంగా చేసే విమర్శలే కాలపరీక్షకు నిలబడతాయి. వందిమాగధులే సరైన వారనే అభిప్రాయానికి ఎలాంటి విలువా ఉండదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-03-16T05:52:51+05:30 IST