హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ కార్మికులపై లేదు

ABN , First Publish Date - 2021-10-21T06:13:43+05:30 IST

సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ సింగరేణి కార్మికవర్గంపై లేదని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ కార్మికులపై లేదు
మాట్లాడుతున్న వాసిరెడ్డి సీతారామయ్య

 - ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, అక్టోబరు 20: సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ సింగరేణి కార్మికవర్గంపై లేదని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం ఆర్‌జీ-1లోని జీడీకే 2ఏ ఇంక్లైన్‌లో జరిగిన గేట్‌ మీటింగ్‌, భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు కష్టపడి పని చేసి సంస్థకు లాభాలు తీసుకువస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సింగరేణిని తమ జేబుసంస్థగా మార్చుకుని వేల కోట్లు దోచుకుంటుందని, కార్మికవర్గాన్ని మోసం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి వేల కోట్లు బకాయిలు పడినా ఇప్పటి వరకు ఇవ్వడం లేదన్నారు. సంస్థకు రావాల్సిన వేల కోట్లను వెంటనే  చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నూతన చట్టం ప్రకారం సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌ వారికి ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించిందన్నారు. వీటిని వెంటనే నిలిపివేసి సింగరేణికే కేటాయించాలని సీతారామయ్య డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ఈ నెల 26న సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్‌మెంట్లపై ఆందోళనలు చేపడుతామన్నారు. అయినా కేంద్రం దిగిరాకపోతే ఛలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామన్నారు. సింగరేణికి ఈ ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాలను తక్కువ చేసి చూపించడం వల్ల ఒక్కో కార్మికుడికి వాటాలో రూ.50వేల నష్టం జరిగిందన్నారు. కార్యక్రమాల్లో నాయకులు మడ్డి ఎల్లయ్య, రంగు శ్రీనివాస్‌, గండి ప్రసాద్‌, నాగేంద్ర కుమార్‌, బోగ సతీష్‌బాబు, వెంకన్న, గొడిశెల నరేష్‌, నరేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:13:43+05:30 IST