ప్రాణహితకు పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2022-08-13T04:07:34+05:30 IST

బెజ్జూరు మండల సరిహద్దుల్లో ప్రవహి స్తున్న ప్రాణహిత నదికి వరద ఉధృతి తగ్గకపోవడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రాణహితకు పోటెత్తిన వరద
బెజ్జూరు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత నది

- బెజ్జూరు మండలంలో 12 గ్రామాలకు నిలిచిన రాకపోకలు 

- పలు చోట్ల నీట మునిగిన పంటలు

బెజ్జూరు, ఆగస్టు 12: బెజ్జూరు మండల సరిహద్దుల్లో ప్రవహి స్తున్న ప్రాణహిత నదికి వరద ఉధృతి తగ్గకపోవడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  ఎగువన మహారాష్ట్రలో ప్రాజెక్టుల నుంచి వరద నీరు వదిలిపెట్టడంతో ప్రాణహితకు వరద పోటెత్తింది. దీంతో బ్యాక్‌ వాటర్‌ పూర్తిగా పంట చేలల్లోకి చేరింది. ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ కారణం గా తలాయి, తిక్కపల్లి, భీమారం, సుస్మీర్‌, సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, నాగెపల్లి, చింతలపల్లి, ఎర్రూడ, బండలగూడ తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తలాయి, పాత సోమిని గ్రామాల మధ్య వంతెన పూర్తిగా వరద నీటిలో మునిగింది.  ఆయా గ్రామాల ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

చింతలమానేపల్లి: భారీ వరద ఉధృతికి మండల పరిధిలోని  ప్రాణహిత నది తీరంలోని గూడెం, దిందా, కోయపల్లి గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ కోయపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపైకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని దిందా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

సిర్పూర్‌(టి): మండల సరిహద్దున ప్రవహిస్తున్న పెన్‌గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. పెన్‌గంగా బ్యాక్‌ వాటర్‌ పారిగాం గ్రామ సమీపంలోని కౌటాల- సిర్పూర్‌(టి) ప్రధాన రోడ్డుపైకి చేరడంతో నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. 

కౌటాల: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, తాటిపల్లి, గుండాయిపేట వద్ద పెన్‌గంగా ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నది పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరదనీరు ప్రా ణహిత పుష్కర ఘాట్‌ మెట్లను దాటి ప్రాణహిత నది ఒడ్డున గల కార్తీక్‌ మహారాజ్‌ ఆలయం చు ట్టూ నీరు చేరింది. పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నది పరివాహక ప్రాం తాల్లోకి ప్రజలు వెళ్ల కూడదని  తహసీల్దార్‌ రాంలాల్‌, ఎస్సైలు బుద్దేస్వామి, మనోహర్‌ సూచించారు.

దహెగాం: మండలంలోని రాంపూర్‌, మొట్లగూడ గ్రామాల్లోని పంటలు ప్రాణహిత బ్యాక్‌వాటర్‌తో మునిగి పోయాయి. అధికారుల సర్వే చేసి పరిహారం అందంచాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-08-13T04:07:34+05:30 IST