ఎగసిన ఉద్యమజ్వాల

ABN , First Publish Date - 2022-01-19T06:43:12+05:30 IST

పీఆర్సీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసంపై ఉద్యోగజ్వాల ఎగసింది. సర్కారుపై ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు సమరానికి సిద్ధమయ్యారు.

ఎగసిన ఉద్యమజ్వాల
డీఎంహెచఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఎన్జీఓ సంఘం నాయకులు, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది

సర్కారుతో సమరానికి సై అన్న ఉద్యోగులు

జీఓలు వచ్చిన 24 గంటల్లోనే భగ్గుమన్న వైనం

జిల్లావ్యాప్తంగా 800పైగా స్కూళ్లలో నిరసనలు

ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆందోళనలు

నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు..

ఎక్కడికక్కడ జీఓల ప్రతులు దహనం

మద్దతుగా రోడ్డెక్కిన విద్యార్థి, 

ఉద్యోగ, కార్మిక సంఘాలు

అనంతపురం విద్య, జనవరి 18: పీఆర్సీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసంపై ఉద్యోగజ్వాల ఎగసింది. సర్కారుపై ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు సమరానికి సిద్ధమయ్యారు. పీఆర్సీకి సంబంధించి జీవోలు 1, 2, 9 ఇచ్చిన 24 గంటల్లోనే ఉద్యోగవర్గాలు వేలాదిమంది కదం తొక్కారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు ఇలా ఎక్కడికక్కడ గర్జించారు. మంగళవారం అనంతపురం జిల్లావ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు చేశారు. పీఆర్సీ ప్రతులను దహనం చేశారు. తమ నిరసన సెగ ప్రభుత్వాన్ని తాకేలా చేశారు. పీఆర్సీపై ప్రభుత్వం జీఓలు విడుదల చేయడంతో... అందులో హెచఆర్‌ఏ స్లాబును ఏకంగా 8 శాతానికి పరిమితం చేయడంతో భగ్గుమన్నారు. ఫోర్టో రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణ ఆధ్వర్యంలో స్కూళ్లలో భారీగా నిరసనలకు దిగారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సైతం స్కూళ్లలో నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసనలు తెలిపారు. స్కూళ్లలోనే జీఓ ప్రతులను దహనం చేశారు. 800కిపైగా పాఠశాలల్లో 5 వేల మందికిపైగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసనలు తెలిపారు. అనంతపురంలోని కేఎ్‌సఆర్‌ హైస్కూల్‌, న్యూటౌన్‌బాయ్స్‌ హైస్కూల్‌, ఉరవకొండ మండలం నెరమెట్ల స్కూల్‌, గుమ్మఘట్ట మండలం రంగచేడు, సనప, ముద్దినాయనపల్లి, కళ్యాణదుర్గం మండలంలోని నారాయణపురం, కదిరి మున్సిపాలిటీలోని నిజాంవలి కాలనీ మున్సిపల్‌, గుండ్లపల్లి, కుమ్మరవాండ్లపల్లి, వెంకటంపల్లి, వలస ఉన్నత, రాచానపల్లి, కేకు తండా, శెట్టిపల్లి ప్రాథమిక పాఠశాలలతోపాటు వందలాది స్కూళ్లలో వేలాదిమంది టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసనలు తెలియజేశారు. జడ్పీలోని ఏపీపీఆర్‌ఏంఏ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, ఇతర సంఘాల నాయకులు జడ్పీలో నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసన వ్యక్తంచేశారు. 


జీఓ ప్రతులు దహనం

ఫ్యాప్టో ఆధ్వర్యంలో వందలాదిమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశారు. సాయం త్రం క్లాక్‌టవర్‌ వద్ద జీఓ ప్రతులను దహనం చేశారు. గంటసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. సంఘం నాయకులు జయరాంరెడ్డి, సాలవేము ల బాబు, సూర్యుడు, నాగేంద్ర మాట్లాడుతూ ఉద్యోగులకు సీఎం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. పాత హెచఆర్‌ఏ స్లాబును కొనసాగించాలనీ, అశుతోష్‌ మిశ్రా నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిరాజుద్దీన్‌, రవీంద్ర, పెద్దన్న, ఓబులేసు, శ్రీనివాసులు, విశ్వనాథ్‌రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు. ఉద్యోగుల నిరసనకు విద్యార్థి సంఘాలు ఏఐఎ్‌సఎఫ్‌, పీడీఎ్‌సయూ నాయకులు, ఆర్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు పోతుల నాగరాజు, నారాయణ నాయక్‌ మద్దతు తెలిపారు. గుంతకల్లులో భారీ ర్యాలీ చేశారు. అనంతరం జీఓ కాపీలను దహనం చేశారు. రాయదుర్గంలో సైతం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, జీఓ ప్రతులను దహనం చేశారు.


వైద్య ఉద్యోగుల ధ్వజం

అనంతపురం వైద్యం: జిల్లా వైద్యశాఖ కార్యాలయం ఎదుట ఏపీఎన్జీఓల సంఘం నేతలతో కలిసి వైద్యశాఖ, జిల్లా సర్వజనాస్పత్రి, వైద్య కళాశాల, టీబీ విభాగం తదితర విభాగాల ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై పీఆర్సీ ప్రతులను దహనం చేశారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఈసందర్భంగా ఏపీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు అతావుల్లా, నగర అధ్యక్షుడు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గత 60 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి మోసపు పీఆర్సీని ఉద్యోగులు చూడలేదన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇవ్వడంతో నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు సీఎం జగన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. ఐఆర్‌ కన్నా పీఆర్సీ ఫిట్‌మెంట్‌ తక్కువ ప్రకటించడమే కాకుండా చివరకు హెచఆర్‌ఏతో పాటు ఇతర రాయితీలకు కోత పెట్టి జీఓలు విడుదల చేయడం దుర్మార్గమన్నారు. అన్యాయపు పీఆర్సీ జీఓలను ఉపసంహరించుకోవాలనీ, లేకపోతే భవిష్యత్తులో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్జీఓ, వైద్య ఉద్యోగుల సంఘాల నాయకులు చంద్రశేఖరరెడ్డి, వేణుగోపాల్‌, చంద్రమోహన, లక్ష్మన్న, మనోహరరెడ్డి, శ్రీనివాసులు, నాగరాజు, పెద్దఎత్తున వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు.









Updated Date - 2022-01-19T06:43:12+05:30 IST