పోరాటాల జెండా ధర్మబిక్షం

ABN , First Publish Date - 2021-03-26T06:28:45+05:30 IST

ప్రజల మనిషి బొమ్మగాని ధర్మబిక్షం శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సంవత్సరమిది. తన యావత్‌ జీవితాన్ని ఉద్యమాలకు, ప్రజాసమస్యల...

పోరాటాల జెండా ధర్మబిక్షం

ప్రజల మనిషి బొమ్మగాని ధర్మబిక్షం శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సంవత్సరమిది. తన యావత్‌ జీవితాన్ని ఉద్యమాలకు, ప్రజాసమస్యల పరిష్కారానికీ అంకితమిచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ యోధుడు 2011మార్చి 26న తుది శ్వాస విడిచారు. 


నైజాం నవాబు ఏలుబడిలో రాజ్యమేలుతున్న అన్యాయాన్ని, అరాచకాలను, శ్రమదోపిడిని, బానిసత్వాన్ని ఆయన గమనించాడు, సమస్యకు మూలం ఎక్కడుందో ఆలోచించాడు. నిరక్ష్యరాస్యత, భయం, అనైక్యత కారణంగా ప్రజలు దోపిడీకి గురవుతున్నారని అర్థం చేసుకున్న ధర్మబిక్షం, పరిష్కారంగా రెండు మార్గాలను ఎంచుకున్నాడు. ఒకవైపు రైతులకు, వ్యవసాయదారులకు, కూలీలకు, వయోజనులకు మోట బావుల కాడ రాత్రివేళల్లో లాంతరు వెలుగులో చదువు చెప్పేవాడు. వాళ్ళ జీవితాలు అలా మ్రగ్గిపోవటానికి కారణమైన నిజాం రాజరిక వ్యవస్థకు, రజాకారులకు వ్యతిరేకంగా నిలబడాలనీ, తిరగబడాలనే ధైర్యాన్ని నూరిపోసేవాడు. మరొకవైపు తాను చదువుకుంటున్న పాఠశాల విద్యార్థులకు చదువు, వసతి కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా విద్యార్ధుల హాస్టల్‌ ఏర్పాటు చేశాడు. ఆ హాస్టల్‌నందు విద్యార్ధులకు దేశభక్తి నూరిపోశాడు, వారిలో స్వాతంత్ర్య పోరాట భావాలను రగిలించాడు. తాను తుపాకులు పట్టి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపాడు, తను పెట్టిన హాస్టల్‌ విద్యార్ధులు ఆ సమరంలో పాల్గొని తమ దేశభక్తిని, వీరత్వాన్ని రుజువుచేసుకొనేలా వారిని తీర్చిదిద్దాడు. ధర్మభిక్షం నల్లగొండ జిల్లాలో అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికులను, మహిళలను, రైతులను, విద్యార్ధి, యువజన మేధావులను చేరదీశాడు. 


దున్నే వానికే భూమి నినాదంతో పాటు, ‘గీసేవానికే చెట్టు’ నినాదం ఇచ్చాడు. చెట్టు పుట్టా తిరిగి కల్లు మండువల కాడ పోరాట ప్రణాళికలను చెక్కిన చైతన్యమూర్తి ధర్మబిక్షం. నల్లని మేఘాలు కమ్ముకున్న వాతావరణంలో, చుట్టూత పోలీసుల తుపాకీ మోతలు, లాఠీచార్జీలు, నోల్లు తెరచిన జైళ్లు భయపెడుతూ వెంబడిస్తున్న అననుకూల వాతావరణంలో కూడ గీత కార్మికుల గుండెల్లో ధైర్యం నింపి, లక్షలాది గీత కార్మికుల నొసట ‘కొత్తగీత’ గీసిన భీష్మాచార్యుడు ధర్మబిక్షం. రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో గీత పనివారలకు సంఘాన్ని నిర్మించిన నిర్మాత. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ వృత్తిని పరిశ్రమగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో గీత పనివారల సంఘానికి జెండా రూపొందించినవాడు. మధ్యలో తాటి చెట్టు, దాని చుట్టూ ఎరుపువర్ణంలో పారిశ్రామిక చక్రం (గీతవృత్తిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న సంకేతం), మిగతాఅంతా నీలివర్ణంతో రూపొందిన ఈ జెండాతో ధర్మబిక్షం లక్షలాది గీత పనివారల గుండె జెండా అయ్యాడు. గీత వృత్తి వున్నంత కాలం ఈ జెండా రెపరెపల్లో ధర్మ బిక్షం దర్శనమిస్తాడు. ఆయన పోరాటాల ఫలితంగానే వృత్తిలో పురోభివృద్ధి జరిగి, గౌడకులం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కొంతైన మెరుగుపడిన మాట నిజం. 


అటు పార్లమెంటులోను, ఇటు అసెంబ్లీలోను, పేద ప్రజల పక్షాన కమ్యూనిస్టు గొంతుకను వినిపించాడు ఆయన. కార్మిక, శ్రామిక, మహిళ, విద్యార్థి, యువజన, రైతు సమస్యల మీద, సాగునీరు, త్రాగునీరు అవసరాలపైనా చట్ట సభలలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో గొప్పగా మాట్లాడిన ప్రజల మనిషి ధర్మబిక్షం. నేత, మత్స్య, రజక, కమ్మరి, కుమ్మరి, తదితర వృత్తులకు సంబంధించిన ప్రజల అభివృద్ధికి కూడా ఆయన ఎంతో కృషి చేశాడు. 


సోవియట్‌ యూనియన్‌, వియత్నాం, చైనా, క్యూబా, లాటిన్‌ అమెరికా దేశాల్లోని విప్లవాల గురించి, ప్రజా చైతన్యం గురించి ధర్మబిక్షం చెప్పేవాడు. ఈ దేశంలో నెలకొనాల్సిన విప్లవ పరిస్థితులు, ప్రజా జీవితాల్లో రావాల్సిన మార్పుల గురించి నిర్మాణాత్మక ప్రసంగాలు చేసేవాడు. ఆయన దృష్టంతా విద్యార్ధులు, యువకులను చైతన్యం చేయటంపైననే ఉండేది. సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలినప్పుడు కమ్యూనిస్టు క్యాడర్‌కు, యువతకు, ఆయన పోరాట స్ఫూర్తిని, లక్ష్యం పట్ల నమ్మకాన్ని నూరిపోశాడు. సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం, భారతదేశంలోని ఎన్‌డిఎ. ప్రభుత్వంలో హోం మినిష్టర్‌గా కామ్రేడ్‌ ఇంద్రజిత్‌ గుప్తా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా చతురానన్‌ మిశ్రా ఉన్న కాలంలోనే ధర్మబిక్షం పార్లమెంటు సభ్యునిగా ఈ ప్రాంతానికి గొప్ప సేవలు అందించాడు. సాగు, తాగునీరు, ఫ్లోరోసిస్‌, రైల్వే, విద్య, వైద్యం, ప్రాజెక్టులు, వృత్తిదారుల సమస్యలు ఎలుగెత్తి చాటాడు. 


కమ్యూనిస్టు భావజాలాన్ని అణచివేస్తామని గర్జించిన వారు సైతం, ధర్మబిక్షం దేశభక్తి, నిజాయితీ, త్యాగం, విలువలు, పోరాట పటిమ, శాస్త్రీయ దృక్పథం చూసి కమ్యూనిస్టులంటే ఇలా ఉండాలని చెప్పుకునే విధంగా జీవించి, ఆ జీవితాన్ని సమాజానికి పంచిపెట్టిన వ్యక్తి ధర్మబిక్షం. 1991 నుండి అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు, సరళీకరణ విధానాలు, ఈ ప్రపంచీకరణా ప్రయివేటీకరణలూ ప్రజలను మరింత అధోగతి పాల్జేస్తాయని హెచ్చరించేవాడు. వీటికి వ్యతిరేకంగా బలమైన ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం వున్నదని నాయకులతో, పార్టీ పార్టీయేతర శ్రేణులతో మేధావులతో చెప్పేవాడు. ఆరడుగుల ఎర్రజండయ్యి సాగిన ఆయన ప్రయాణం 26 మార్చి 2011న చివరి మజిలీ చేరుకున్నది. సాహసాలు, పోరాటాలు, నిర్భందాలు, జైలు పరీక్షలు, త్యాగాలు, ఆదర్శాలు ధర్మబిక్షం వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేశాయి. ఆ మహానుభావుడికి నేడు వాడవాడలా, గ్రామగ్రామాన నివాళులర్పిస్తూ, కార్మికులు, కర్షకులు, విద్యార్ధులు, మేధావులు, ఉద్యోగులు, యువకులు, మహిళలంతా ఆయన చూపిన బాటలో నడుస్తూ, నేటి సమాజంలో తలెత్తుతున్న సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సామాజిక మార్పుకు కృషి చేస్తామని ప్రతినబూనాల్సిన సందర్భమిది.

(నేడు ధర్మబిక్షం 10వ వర్థంతి)

Updated Date - 2021-03-26T06:28:45+05:30 IST