మొదటి ఫోన్‌ రామ్‌చరణ్‌ నుంచే వచ్చింది..శర్వానంద్‌

ABN , First Publish Date - 2021-03-07T05:40:57+05:30 IST

‘‘శ్రీకారం’ ట్రైలర్‌ విడుదల కాగానే నాకు మొదటి ఫోన్‌కాల్‌ రామ్‌చరణ్‌ నుంచి వచ్చింది. ‘ఇలాంటి మంచి సినిమాకు నా వంతుగా ఏం చేయాలో చెప్పు, చేస్తాను’ అని చరణ్‌ అన్నాడు. చిరంజీవి గారు 8న ఖమ్మంలో జరిగే ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో

మొదటి ఫోన్‌ రామ్‌చరణ్‌ నుంచే వచ్చింది..శర్వానంద్‌

‘‘శ్రీకారం’ ట్రైలర్‌ విడుదల కాగానే నాకు మొదటి ఫోన్‌కాల్‌ రామ్‌చరణ్‌ నుంచి వచ్చింది. ‘ఇలాంటి మంచి సినిమాకు నా వంతుగా ఏం చేయాలో చెప్పు, చేస్తాను’ అని చరణ్‌ అన్నాడు. చిరంజీవి గారు 8న ఖమ్మంలో జరిగే ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. మంత్రి కేటీఆర్‌ గారు కూడా తనవంతుగా మద్దతు అందిస్తానని చెప్పారు. ప్రముఖులను సైతం ప్రభావితం చేయగలిగిన సినిమా చేసినందుకు గర్వంగా ఉంది’’ అని  శర్వానంద్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. కిషోర్‌ బి. దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలకానుంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో శర్వానంద్‌ మాట్లాడుతూ  ‘‘కథ వినగానే సినిమా చేయాలనిపించింది. వాణిజ్య హంగులున్న చిత్రం చేయడం సులభం. ఇంత ఖర్చు పెట్టి సినిమాను తీయడానికి కథ మీద మాకు ఉన్న నమ్మకమే కారణం’’ అని అన్నారు.


నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ ‘‘ఓ యువ రైతు కథ. శర్వానంద్‌ తన పాత్రను అద్భుతంగా పోషించారు. 2016 నుంచి ఈ కథతో ట్రావెల్‌ చేశాం. స్ట్రాంగ్‌ డైలాగ్స్‌, ఎమోషన్స్‌తో ఈ సినిమా చేశాం. మన చుట్టూ కనిపించే పాత్రలతో చేసిన సినిమా ఇది. సాయిమాధవ్‌ డైలాగ్‌లు సినిమాకు బలం’’ అని అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘‘మనందరికీ వ్యవసాయ నేపథ్యం ఉంది. అందుకే సినిమా కథతో అందరం ఎక్కడో ఓ చోట కనెక్ట్‌ అవుతాం. మనకథనే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ కథను బాధ్యతగా భావించి చేశాను. తొలి చిత్రమే అయినా కిశోర్‌ అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించాడు’’ అని సాయిమాధవ్‌ బుర్రా అన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలసి ‘శ్రీకారం సినిమాను చూడాలని చిత్ర కథానాయిక ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కోరారు.

Updated Date - 2021-03-07T05:40:57+05:30 IST