నిధులు సరే..స్పష్టత ఏదీ!?

ABN , First Publish Date - 2020-05-23T09:40:24+05:30 IST

ఎంతోకాలంగా మత్స్యకారులు ఎదురు చూస్తున్న ఫిషింగ్‌ హార్బర్‌ కల నిజమయ్యే రోజులు దగ్గరకు వస్తున్నా నిర్మాణం

నిధులు సరే..స్పష్టత ఏదీ!?

ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి మోక్షం కలిగేనా?

తొలివిడతగా రూ.36 కోట్ల మంజూరు

బెంగళూరు బృందం సర్వే చేస్తేనే కదలిక

పాలకులు, అధికారులు చొరవ అత్యవసరం


కావలి, మే 22 : ఎంతోకాలంగా మత్స్యకారులు ఎదురు చూస్తున్న ఫిషింగ్‌ హార్బర్‌ కల నిజమయ్యే రోజులు దగ్గరకు వస్తున్నా నిర్మాణం విషయంలో ఆ శాఖలో స్పష్టత కనిపించలేదు. బోగోలు మండలం జువ్వలదిన్నెలో ఫిషింగ్‌ హార్బర్‌ టీడీపీ ప్రభుత్వంలో మంజూరైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిర్మాణ ఖర్చులు భరించే విధంగా రూ.288.8 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వాటికి ఆమోదం లభించి  తొలి విడతగా రూ36 కోట్లు విడుదల అయ్యాయి. అయితే, నిధులు విడుదలైన విషయంతమకు అధికారికంగా ఉత్తర్వులు అందలేదని ఆ శాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు. ఫిషింగ్‌ హార్బర్‌ కేంద్రం పరిధిలో ఉన్నందున బెంగళూరు నుంచి సర్వే బృందం వచ్చి సర్వే చేయాల్సి ఉందని, ఆ తర్వాత కాని దానిపై స్పష్టత రాదని మత్స్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.


కార్యరూపం దాల్చితే..

కాగా, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి 72 ఎకరాలు అవసరం ఉండగా 38 ఎకరాలు ఇప్పటికే సేకరించారు. అక్కడ 1,250 బోట్లు నిలిచేందుకు అనువుగా జెట్టీల నిర్మాణం చేపట్టనున్నారు. అలలు ఉధృతి పెరిగినప్పుడు హార్బర్‌కు ఇబ్బందులు రాకుండా ఆ ప్రాంతంలో కొంత ఎత్తున గోడ నిర్మించి బోట్లు రాకపోకలకు అనువుగా తయారు చేయనున్నారు. మత్స్య సంపదకు దళారులు లేకుండా అక్కడే మార్కెటింగ్‌ వసతి కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యసంపద నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగుల నిర్మాణం, చేపలు ఆరబెట్టుకునేందుకు ప్లాట్‌ఫారాలు, చేపలు విక్రయాలకు మార్కెటింగ్‌ ప్లాట్‌ఫారాలు, వలల మరమ్మతు తదితరాల కోసం నెట్‌ మిండింగ్‌ హాల్స్‌, రోడ్లు నిర్మాణాలు చేపట్టనున్నారు.


బోట్లకు అవసరమైన డీజిల్‌ కోసం పెట్రోలు బంకును కూడా హార్బర్‌లో నిర్మించేలా ప్రతిపాదనలు పంపారు.  వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ద్వారా కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి చొరవ తీసుకోవడంతో ఇటీవల అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. దీంతో తొలివిడతగా రెండు ప్రభుత్వాలు కలిపి రూ.36 కోట్లు విడుదల చేశాయి. ఈ ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చేపట్టి దానిని పూర్తి చేస్తే జిల్లాలోని మత్స్యకారుల కల నెరవేరినట్లే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పాలకులు దీనిపై మరింత దృష్టి పెడితే త్వరలో నిర్మాణ పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2020-05-23T09:40:24+05:30 IST