Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రంలో ప్రథమం బిల్లుల చెల్లింపుల్లో అధమం

వైకుంఠధామాలు పూర్తయినా.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

మొత్తం 647 గ్రామపంచాయతీలు

పూర్తయిన వైకుంఠధామాలు 624

అవసరమైన నిధులు రూ.74.39 కోట్లు

ఇప్పటి వరకు చెల్లించినవి రూ.59.10 కోట్లు

రావాల్సిన బకాయిలు రూ.15.29 కోట్లు

నిధులు విడుదలవ్వక ఇబ్బందుల్లో సర్పంచులు


సంగారెడ్డి టౌన్‌, నవంబరు 28: గతంలో గ్రామాల్లో చనిపోయిన వారి దహనసంస్కారాలు నిర్వహించేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చేది. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల గట్లు వెంట ఖాళీస్థలాల్లో అంత్యక్రియలు పూర్తిచేసేవారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరూరా వైకుంఠధామాల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టారు. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలో వైకుంఠధమాలు వేగవంతంగా పూర్తి చేశారు. అయితే పనులు పూర్తయినా బిల్లులు సకాలంలో అందక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


రాష్ట్రంలోనే ప్రథమం.. ఆర్‌ఎం అభినందనలు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు ప్రత్యేక చొరవ తీసుకుని సర్పంచులపై ఒత్తిడి తెస్తూ, మండల స్థాయి అన్ని శాఖల అధికారును పరుగులెత్తించి ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా 624 వైకుంఠధామాలను పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. ఒక్కో శ్మశానవాటికకు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేశారు. 2017లో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. 2019లో పల్లెప్రగతిలో భాగంగా పంచాయతీరాజ్‌, రెవెన్యూ తదితరశాఖలు భాగస్వామ్యమై పనులను వేగవంతంగా పూర్తి చేశారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల కంటే ముందుగానే పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలిపారు. ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగారెడ్డి జిల్ల్లా కలెక్టర్‌తో పాటు అధికారులను అభినందించారు. 

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

సంగారెడ్డి జిల్లాలో 26 మండలాల పరిధిలో 647 గ్రామ పంచాయతీలుండగా రామచంద్రాపురం, అమీన్‌పూర్‌ మండలాల్లోని 23 గ్రామపంచాయతీలు మినహాయించి మిగిలిన 24 మండలాల పరిధిలోని 624 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం కింద వైకుంఠధామాలను నిర్ణీత గడువులోగా నిర్మించారు. 624 గ్రామపంచాయతీల్లో వైకుంఠధామం నిర్మాణానికి రూ.10లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేశారు. మొత్తం 624 వైకుంఠధామాలకు రూ.74.39 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ.59.10 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.15.29 కోట్లు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. మిగిలిన బకాయిల విడుదల కోసం జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపి ఏడాది గడుస్తున్నా నిధులు విడుదల చేయడం లేదు. అనేక మంది సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్‌ ఒత్తిడి తేవడంతో అప్పులు తెచ్చి వైకుంఠధామాలను నిర్మించామని, బిల్లులు సకాలంలో అందరు అప్పుల పాలయ్యామని పలువురు సర్పంచులు వాపోతున్నారు.

సమావేశాల్లో అధికారులను నిలదీసినా..

ప్రతి మూడు నెలలకోసారి జరిగే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ సమావేశాల్లో వైకుంఠధామాలకు సంబంధించిన బిల్లుల బకాయిలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో జిల్లా పరిషత్‌ సమావేశానికి హాజరైన  మంత్రి హరీశ్‌రావుకు కూడా జడ్పీటీసీ, ఎంపీపీలు ఈ బకాయిలపై వివరించినా ఫలితం దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement