రాజంపేట, కమలాపురం పుర పోరుకు సై!

ABN , First Publish Date - 2021-10-18T05:30:00+05:30 IST

జిల్లాలో కడప నగరపాలక సంస్థ, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాజంపేట మున్సిపాలిటీలు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురం నగర పంచాయతీలు ఉన్నాయి. హైకోర్టు స్టే కారణంగా రాజంపేట,

రాజంపేట, కమలాపురం పుర పోరుకు సై!
రాజంపేట మున్సిపల్‌ ఆఫీస్‌

సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం

త్వరలో షెడ్యూలు వచ్చే అవకాశం

రాజంపేటకు పదేళ్ల తరువాత ఎన్నికలు

నగర పంచాయతీగా కమలాపురానికి తొలి ఎన్నిక

అప్పుడే అస్త్రశసా్త్రలు సిద్ధం చేసుకుంటున్న రాజకీయ పక్షాలు


ఇప్పటికే బద్వేలు ఉప ఎన్నికతో కడప గడపన రాజకీయ వేడి రాజుకుంది. ప్రస్తుతం రాజంపేట మున్సిపాలిటీ, కమలాపురం నగర పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. దీంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు అస్త్రశసా్త్రలు సిద్ధం చేసుకుంటున్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కడప నగరపాలక సంస్థ, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాజంపేట మున్సిపాలిటీలు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురం నగర పంచాయతీలు ఉన్నాయి. హైకోర్టు స్టే కారణంగా రాజంపేట, కమలాపురం తప్ప మిగిలిన అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగి ఈ ఏడాది మార్చి నెలలో పాలకవర్గాలు కొలువుదీరాయి. ఏడు నెలల తరువాత రాష్ట్రంలో నెల్లూరు కార్పొరేషనతో పాటు 12 మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టింది. అందులో జిల్లాకు చెందిన రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి.


పదేళ్ల తరువాత రాజంపేట పుర పోరు

రాజంపేట మేజర్‌ పంచాయతీని 2005 ఏప్రిల్‌ 2న అప్పటి ప్రభుత్వం నగర పంచాయతీగా ఏర్పాటు చేసింది. రాజంపేట చుట్టూ 5 కి.మీలలోపు ఉన్న కూచివారిపల్లి, తాళ్లపాక, బోయనపల్లి, కారంపల్లి, ఊటూకూరు పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. నాడు తొలిసారిగా మన్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. 2017లో మున్సిపాలిటీగా, 2019లో గ్రేడ్‌-2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. మున్సిపాలిటీ స్థాయి పెరగడంతో 20 వార్డులను 29 వార్డులుగా విస్తరించారు. అయితే.. వార్డుల విభజనలో పారదర్శకత పాటించలేదని, ఒకవార్డులో ఉండాల్సిన నివాసాలు మరో వార్డులోకి కలపడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, వార్డుల విభజన పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీంతో 2020 మార్చి 9న జారీ చేసిన మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషనలో రాజంపేట మున్సిపాలిటీ లేదు. కోర్టు సూచన మేరకు వార్డుల విభజన లోపాలను సవరించి న్యాయస్థానం ముందు ఉంచామని అధికారులు అంటున్నారు. దీంతో ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు సుగమం అయింది. ప్రస్తుతం రాజంపేటలో 32 వేల మంది ఓటర్లు ఉన్నారు.


కమలాపురానికి తొలి ఎన్నిక

మేజర్‌ పంచాయతీగా ఉన్న కమలాపురాన్ని 2020 జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీగా ఏర్పాటు చేసింది. సమీపంలోని మీరాపురం పంచాయతీని కమలాపురం నగర పంచాయతీలో విలీనం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ మీరాపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం స్టే ఇవ్వడం వల్ల 20 వార్డులు, 15,660 ఓటర్లు కలిగిన కమలాపురం నగర పంచాయతీ ఎన్నికలు గత మార్చిలో జరగలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సుబ్రమణ్యం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. న్యాయస్థానం నగర పంచాయతీ ఏర్పాటుకే అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, దీంతో ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన జారీ చేస్తే.. నగర పంచాయతీగా కమలాపురంకు ఇదే తొలి ఎన్నిక అవుతుంది.


సన్నద్ధం అవుతున్న రాజకీయ పక్షాలు

రాజంపేట మున్సిపాలిటీ చైర్మన పీఠం అన రిజర్వుడ్‌ జనరల్‌కు కేటాయించారు. కమలాపురం నగర పంచాయతీ చైర్మన పీఠం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ చేశారు. 2020 మార్చి 11న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సమయంలో అధికార పార్టీ నాయకులు రాజకీయ అండ, పోలీస్‌ అండతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను కౌన్సిలర్లుగా నామినేషన వేయనివ్వకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు బలంగా వివిపించాయి. అధికార బలంతో అన్ని మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది. నాటి రాజకీయ పరిస్థితులు వేరు.. తాజా పరిస్థితులు వేరు. దీంతో కమలాపురం, రాజంపేట కేంద్రంగా జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. అదే క్రమంలో అధికార పార్టీ వైసీపీ ఈ రెండింటిలోనూ పాగా వేసేందుకు రాజకీయ సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే బద్వేలు ఉప ఎన్నికలతో జిల్లాలో రాజకీయం కాక పుట్టిస్తోంది. తాజాగా రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే రాజకీయం మరింత వేడెక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


మున్సిపాలిటీ వివరాలు

------------------------------------------------------------------------

వివరాలు రాజంపేట కమలాపురం 

-------------------------------------------------------------------------

హోదా గ్రేడ్‌-2 మున్సిపాలిటీ నగర పంచాయతీ

అవిర్భావం 2005 ఏప్రిల్‌ 2న 2020 జనవరి 24న

వార్డులు 29 20

జనాభా (2011) 55,000 20,623

ఓటర్లు 32,000 15,660



Updated Date - 2021-10-18T05:30:00+05:30 IST