మొదటిడోస్‌ వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి

ABN , First Publish Date - 2022-01-21T05:48:07+05:30 IST

జిల్లాలో మొదటి డోస్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేశామని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

మొదటిడోస్‌ వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి 

గద్వాల క్రైం, జనవరి 20 : జిల్లాలో మొదటి డోస్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేశామని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ గురువారం హైదరాబాద్‌ నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై  రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా బృందాలను ఏర్పాటు చేసి ప్రతీ రోజు 25 ఇళ్లల్లో సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయా లని ఆదేశించారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు అందించాలన్నారు. ప్రతీ రోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ఐదు రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో కొవిడ్‌ ఓపీ సేవలు అందించాలని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి వ్యాక్సినేషన్‌ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 130 ఆక్సిజన్‌ బెడ్లు, కొవిడ్‌ బెడ్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోస్‌ వేస్తున్నా మని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన అప్లికేషన్లను రెండు రోజుల్లో పంపిస్తామన్నారు. వీడియా కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శశికళ, డీఎల్‌పీవో వెంకట్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ జానకీరామ్‌సాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:48:07+05:30 IST