జూలైలో తొలి డోసు బంద్‌

ABN , First Publish Date - 2021-06-22T08:26:24+05:30 IST

సంఖ్య భారీగా ఉండటం.. టీకాల కొరత నేపథ్యంలో.. రాష్ట్రంలో జూలైలో రెండో డోసు వారికే కరోనా టీకా ఇవ్వనున్నారు.

జూలైలో తొలి డోసు బంద్‌

  • ఇచ్చేదంతా రెండో డోసే.. అర్హులు 32 లక్షలు..!
  • వచ్చే నెల రాష్ట్రానికి వచ్చేది 21 లక్షల టీకాలే
  • ప్రత్యేక కార్యక్రమంలో ఉపాధ్యాయులకు టీకాలు
  • హై రిస్క్‌లోని 20.85 లక్షలమందికి పంపిణీ 
  • 18 ఏళ్లు పైబడిన వారికి టీకాపై స్పష్టత కరువు


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): సంఖ్య భారీగా ఉండటం.. టీకాల కొరత నేపథ్యంలో.. రాష్ట్రంలో జూలైలో రెండో డోసు వారికే కరోనా టీకా ఇవ్వనున్నారు. వచ్చే నెలలో మలి డోసు పొందాల్సినవారు 32 లక్షలమంది వరకు ఉన్నారు. వీరంతా ఏప్రి ల్‌, మేలో మొదటి డోసు తీసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకా రం వీరికి జూలైలో రెండో డోసు ఇవ్వాలి. అయితే, ఇంత పెద్దమొత్తంలో టీకాలు వచ్చే అవకాశం లేకపోవడంతో 1వ తేదీ నుంచి తొలి డోసు పంపిణీని పూర్తిగా నిలిపివేసే అవకాశాలున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.  


రానున్న కోటాలో 21 లక్షల టీకాలే

జూలై టీకా కోటాను కేంద్రం రెండు రోజుల క్రితం ఖరారు చేసింది. తెలంగాణకు 20.99 లక్షల డోసులు పంపనున్నట్లు సమాచారం ఇచ్చింది. ఇవి కాక జూన్‌ కోటాలో వచ్చే వారం పది లక్షల టీకాలు రానున్నాయి. అయితే, జూలైలో అర్హులు 32 లక్షల మంది అర్హులుండగా.. ఇంకా 11 లక్షల డోసులు తక్కువ పడనున్నాయి. ఇప్పటికే ఉన్నవి, రానున్న 10 లక్షల డోసులతో ఈ నెల చివరిదాక తొలి డోసునే పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి టీకా ఇస్తున్నారు. అలా ఇవ్వగా మరో 8 లక్షల టీకాలు నిల్వ ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటికి కేంద్రం పంపే వాటిని కలుపుకొంటే మొత్తం నిల్వ 29 లక్షలకు చేరుతుంది. అప్పటికీ 3 లక్షల డోసులు తక్కువ పడతాయి. అయితే, మొదటి డోసు తీసుకున్నవారిలో 5-10ు మంది షెడ్యూల్‌ ప్రకా రం రెండో డోసుకు రావడం లేదని, దాంతో పెద్దగా ఇబ్బంది తలెత్తక పోవచ్చని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఆదివారం వరకు రాష్ట్రంలో 20.85 లక్షల మంది హై  రిస్క్‌ గ్రూపు వారికి టీకా వేశారు. 


ఈ నెలలోనే ఉపాధ్యాయులకు..

జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉపాధ్యాయలందరికీ టీకాలు ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. వీరికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి జూన్‌ చివరినాటికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనుకుంటోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయినట్లు సమాచారం. 

 

18 దాటిన వారికి ఎప్పుడో?

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటినవారికి ఉచిత టీకా పంపిణీపై స్పష్టత రాలేదు. దేశంలో సోమవారం నుంచి ఈ కార్యక్రమం పెద్దఎత్తున ప్రారంభమైనా.. తెలంగాణలో ఆ ఊసే లేదు. అసలు ఎప్పటినుంచి ఇస్తారు అనేది కూడా తెలియరాలేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం నుంచి అందరికీ టీకాలు వేస్తారని భావించారు. అయితే, జిల్లా స్థాయి వైద్యాధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఎక్కడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయలేదు. మరోవైపు ఈ విషయం తెలియక కొందరు ప్రజలు సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి ఆరా తీశారు. టీకాలు వేయడం లేదని చెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.  



Updated Date - 2021-06-22T08:26:24+05:30 IST