తొలిరోజు 20 శాతమే

ABN , First Publish Date - 2021-02-25T06:00:14+05:30 IST

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి మూలంగా సుమారు ఏడాదిపాటు మూసివేసిన పాఠశాలలు దశలవారీగా తెరుచుకుంటున్నాయి.

తొలిరోజు 20 శాతమే
నల్లగొండలోని మాధవనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

నల్లగొండ జిల్లాలో విద్యార్థుల హాజరు

ఆసక్తి కనబర్చిన విద్యార్థులు కొందరే 


నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 24: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి మూలంగా సుమారు ఏడాదిపాటు మూసివేసిన పాఠశాలలు దశలవారీగా తెరుచుకుంటున్నాయి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 1వ తేదీ నుంచే భౌతిక పాఠాలు ప్రారంభమయ్యాయి. 6,7,8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో బుధవారం జిల్లావ్యాప్తంగా కొన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 9,10 తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు సైతం తెరుచుకున్నాయి. తొలిరోజు విద్యార్థులు అంతగా పాఠశాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపలేదు. కరోనా వైరస్‌ భయంతోనో లేక విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాలేదనో, కారణం తెలియకపోయినా విద్యార్థులు కొంతమంది మాత్రమే తరగతులకు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు, సూచనలు రాకపోవడంతో కొన్ని పాఠశాలలు తొలిరోజూ అసలు తెరుచుకోలేదు. మార్చి 1వ తేదీ వరకూ ప్రారంభించుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీచేయడంతో పాఠశాలల నిర్వాహకులు తమ పాఠశాలల్లో శానిటైజేషన్‌తోపాటు కొవిడ్‌ నియమ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు ప్రారంభించారు. తరగతులకు వచ్చే విద్యార్థులకు మాత్రం ఉపాధ్యాయులు పాఠాలు బోధించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


జిల్లాల వారీగా తెరుచుకున్న పాఠశాలలు

నల్లగొండ జిల్లాలో 291 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, అందులో 6,7,8 తరగతుల్లో మొత్తం 63,928 మంది చదువుతున్నారు. తొలిరోజు 20శాతం మంది విద్యార్థులకు కూడా హాజరు కాలేదని సమాచారం. సూర్యాపేట జిల్లాలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు 6.72 శాతం మాత్రమే హాజరైనట్లు ఏడీ శైలజ తెలిపారు. జిల్లాలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొత్తం 529 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 39,050 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, బుధవారం 2,624 మంది విద్యార్థులు హాజరయ్యారు.  


యాదాద్రి జిల్లాలో ప్రారంభంకాని తరగతులు

భువనగిరి టౌన్‌: యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటిరోజు తరగతులు ప్రారంభంకాలేదు. తరగతి గదులు, పాఠశాల ఆవరణలో రక్షిత చర్యలు చేపట్టిన రెండు రోజుల అనంతరమే తరగతులను నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ తెలిపారు.


అర్ధాకలితో విద్యార్థుల అవస్థలు

నల్లగొండ రూరల్‌: అర్ధాకలితో అప్పాజిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పస్తులుంటున్నారు. కరోనా కారణంగా మూతబడిన పాఠశాలల్లో ఈ నెల 1వ తేదీ నుంచి 9,10 తరగతులు ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు మధ్యాహ్న భోజనంలేక విద్యార్థులు పస్తులుంటున్నారు. మండలంలోని అప్పాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9,10 తరగతులకు సంబంధించి 40మంది విద్యార్థులు హాజ రవుతున్నారు. వీరంతా సమీప గ్రామాల నుంచి వస్తుంటారు. వీరితోపాటు ఇటీవల 6,7,8వ తరగతులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మరో 70 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. వీరంతా పేద వర్గాలకు చెందిన వారు కావడంతో మధ్యాహ్న భోజనం అందక ఖాళీ కడుపులతో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై పాఠశాల హెచ్‌ఎం శైలజను వివరణ కోరగా, మధ్యాహ్న భోజన వంట చేస్తే కూలి గిట్టుబాటు కావడంలేదని కార్మికులు రావడంలేదన్నారు.

Updated Date - 2021-02-25T06:00:14+05:30 IST