Abn logo
Sep 20 2021 @ 02:29AM

పంజాబ్‌కు తొలి దళిత సీఎం!

నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌సింగ్‌ చన్ని.. నేడు ప్రమాణ స్వీకారం’’

కాంగ్రెస్‌ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం

అమరీందర్‌ కేబినెట్‌లో మంత్రిగా చేసిన చరణ్‌జీత్‌

సిద్ధూ, సుఖ్‌జీందర్‌, సునీల్‌లకు నిరాశే

బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌కు చెక్‌ పెట్టేందుకే!

చన్నికి శుభాకాంక్షలు తెలిపిన రాహుల్‌, అమరీందర్‌

సిద్ధూపై అమరీందర్‌ ఆరోపణలు తీవ్రమైనవి..

కాంగ్రెస్‌ ఏం చర్యలు తీసుకుంటుంది?: బీజేపీ


చండీగఢ్‌, సెప్టెంబరు 19: పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి ఓ దళిత నేతను వరించింది. పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూను సీఎం చేస్తారని కాంగ్రెస్‌ నేతలు భావించగా.. పార్టీ అధిష్ఠానం మాత్రం అనూహ్యంగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్ని(58)ను తెరపైకి తెచ్చింది. నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ని ఎంపిక చేసింది. దాదాపు రెండు రోజుల సుదీర్ఘ మంతనాల తర్వాత ఈ మేరకు ప్రకటన చేసింది. పంజాబ్‌ సీఎం రేసులో సునీల్‌ జాఖడ్‌, పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధు, సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే హరీశ్‌ రావత్‌, అజయ్‌ మాకెన్‌, హరీశ్‌ చౌధరిలు ఆదివారం సాయంత్రం వరకు మంతనాలు జరిపిన అనంతరం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్ని పేరును ఖరారు చేశారు.


ఆయన్ను పంజాబ్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమమైంది. అమరీందర్‌ కేబినెట్‌లో చన్ని సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్ష ణ, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పనిచేశారు. చామ్‌కౌర్‌ సాహిబ్‌ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చన్ని.. పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కనున్నారు. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి దళితుణ్ని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్న శిరోమణి అకాలీదళ్‌ దళితుణ్ని డిప్యూటీ సీఎం చేస్తామని వెల్లడించింది. పంజాబ్‌లో 32ు దళిత జనాభా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెక్‌ పెడుతూ, దళిత ఓటుబ్యాంకే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుగానే ఓ దళితుణ్ని సీఎం చేసింది. చన్ని రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. చన్నికి రాహుల్‌ గాంధీ, అమరీందర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పంజాబ్‌ను సరక్షితంగా ఉంచుతారని భావిస్తున్నట్లు అమరీందర్‌ చెప్పారు. మరోవైపు శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కొన్ని గంటల ముందు అమరీందర్‌సింగ్‌(79) కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేసిన అమరీందర్‌.. రాష్ట్రంలో అస్థిర పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా తాను శక్తివంచన లేకుండా కృషి చేశానని, నాలుగున్నరేళ్ల పాలనపై తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో ప్రతిపక్షాలతోపాటు పార్టీలోని ఓ వర్గం నేతలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించారని అమరీందర్‌ గుర్తుచేశారు. పార్టీలో అవమానాలు భరించలేకనే తాను రాజీనామా చేసినట్లు సోనియాకు వివరించారు. కాగా, పంజాబ్‌ సీఎం పదవిని తనకు ఇస్తామన్నారని, తానే నిరాకరించానని సీనియర్‌ నేత అంబికా సోని చెప్పారు. కాగా, ‘‘ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, పంజాబ్‌ల్లో ముఖ్యమంత్రులను మార్చడం కంటే సమస్యలకు సత్వరమే పరిష్కారం కనుగొంటే బాగుండేది. సమస్య పెద్దదయ్యే వరకు వేచి చూడడం సరికాదు’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ ట్వీట్‌ చేశారు.  


అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రా?: బీజేపీ

పంజాబ్‌ సీఎంగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నిని ఎంపిక చేయడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఐఏఎస్‌ అధికారిణికి అసభ్య సందేశాలు పంపిన చన్నిని సీఎం పదవిలో కూర్చోబెడుతున్నారని మండిపడింది. చన్ని 2018లో మహిళా ఐఏఎ్‌స కు అసభ్య సందేశాలు పంపారని, దాన్ని అప్పుడు కప్పిపుచ్చినప్పటికీ మహిళా కమిషన్‌ నోటీసులు పంపడంతో మళ్లీ తెరపైకి వచ్చిందని బీజేపీ ఐటీ విభాగం చీఫ్‌ అమిత్‌ మాలవీయ ఆరోపించారు. అమరీందర్‌సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేసిన పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ సిద్ధుపై కాంగ్రెస్‌ పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందని బీజేపీ ప్రశ్నించింది. సిద్ధూకు పాక్‌తో సంబంధాలున్నాయని, ఆయన సీఎం అయితే దేశ భద్రతకే ప్రమాదమని అమరీందర్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎంపిక చేసే వ్యక్తి రాష్ట్రానికే గర్వకారణమైన వ్యక్తిగా ఉంటారని ఆ పార్టీ నేత రాఘవ్‌ చద్దా చెప్పారు. 


సీఎం మార్పు గట్టెక్కించేనా!

పంజాబ్‌ అసెంబ్లీకి మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనుండగా రాష్ట్రంలో రాజకీయం అప్పుడే వేడెక్కుతోంది. కాంగ్రెస్‌ నుంచి అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్‌ ప్రయత్నిస్తుండగా, మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగానే కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రిని మార్చింది. కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ స్థానంలో దళిత నేత చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీని  సీఎంగా నియమించింది. ఈసారి ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు పెట్టుకోనున్నట్లు అకాలీదళ్‌ ప్రకటించిన నేపథ్యంలో దళితుల ఓట్లు ఆ కూటమి వైపు మళ్లకుండా కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తమ ప్రభుత్వంపై పంజాబ్‌ ప్రజల్లో  వ్యతిరేకత లేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అధికార పార్టీ గా తాము బలంగా ఉన్నామంటున్నారు. దీనికి తోడు కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసా య చట్టాలు రాష్ట్రంలో ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయని గుర్తు చేస్తున్నారు. కాగా, బీజేపీతో కలిసి ఎన్డీయేలో ఉన్నందుకు అకాలీదళ్‌పైనా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గం నుంచి అకాలీదళ్‌ తప్పుకొన్నా ఎన్డీయే నుంచి వైదొలగకపోవడం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దీంతో బీఎస్పీతో చెలిమి చేయడం ద్వారా రాష్ట్రంలో 30ు దాకా ఉన్న దళితులను తమవైపు తిప్పుకోవాలని అకాలీదళ్‌ యోచిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఆయనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరగడం, అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా అందడంతో తనకు తానుగా వైదొలగే పరిస్థితుల్ని పార్టీ కల్పించించింది. అయితే ఈ నిర్ణయం కాంగ్రె్‌సకు ఎంతవరకు కలిసొస్తుందన్నది చూడాల్సి ఉంది. కాగా.. పంజాబ్‌ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని, వారు కాంగ్రెస్‌, అకాలీదళ్‌ను కాదని.. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) వైపు మొగ్గుచూపుతున్నారని ఓ సర్వే పేర్కొంది. అమరీందర్‌సింగ్‌ రాజీనామా కన్నా ముందే, ఆగస్టు ద్వితీయార్ధంలో ఈ సర్వే నిర్వహించినట్లు ఆ సంస్థ తెలిపింది. 


మున్సిపల్‌ కౌన్సిల్‌ నుంచి సీఎంగా.. 

పంజాబ్‌ సీఎంగా ఎంపికైన చరణ్‌జీత్‌ సింగ్‌ చన్ని రాజకీయ జీవితం కింది స్థాయి నుంచే మొదలైంది. మధ్యలో అనేక వివాదాలు ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 2002లో ఖరడ్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా చన్ని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2007అసెంబ్లీ ఎన్నికల్లో చంకౌర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచారు. 2012లో కాంగ్రె్‌సలో చేరి మళ్లీ అదే స్థానం నుంచి గెలిచారు. 2017 ఎన్నికల్లోనూ విజయంతో అమరీందర్‌ సింగ్‌ మంత్రివర్గంలో చోటు సాధించారు. అప్పటి నుంచి అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. చన్ని తనకు అసభ్యకరమైన మెసేజ్‌ పంపారంటూ 2018లో ఒక మహిళా ఐఏఎస్‌ అధికారి ఆరోపించడంతో రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా విచారణ చేపట్టింది.