పాజిటివ్‌ కేసుతో గుంటూరులో.. హై అలర్ట్

ABN , First Publish Date - 2020-03-27T09:20:32+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసు గుంటూరులో..

పాజిటివ్‌ కేసుతో గుంటూరులో.. హై అలర్ట్

కరోనా పాజిటివ్‌తో గుంటూరులో అప్రమత్తం

బాధితుడు విజయవాడకు తరలింపు

ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారికి వైద్య పరీక్షలు

తాడికొండలోని మిత్రులు కూడా ఆసుపత్రికి తరలింపు

గుంటూరులో వైద్యుల సంరక్షణలో 9 మంది

 

గుంటూరు(సంగడిగుంట)(ఆంధ్రజ్యోతి): కరోనా.. గుంటూరులో కలకలం రేపింది. హై అలర్ట్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. తొలి పాజిటివ్‌ బాధితుడి నివాస ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలకు ఉపక్రమించారు. మంగళదాస్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో వైరస్‌ నివారణ చర్యలు చేపట్టారు. కేసు నిర్థారణ జరిగిన ప్రాంతానికి మూడు కిలో మీటర్ల పరిధిలో 38 కాలనీలను 1650 క్లస్టర్లగా విభజించి డోర్‌ టూ డోర్‌ సోడియం హైపో క్లోరైడ్‌, బ్లీచింగ్‌ ద్రావణాన్ని రెండు ఫైర్‌ ఇంజన్లు, ఆరు ట్యాంకర్ల ద్వారా పిచికారీ చేయిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేయడంతో ప్రజలకు వినియోగ వస్తువులను అందించేందుకు పలు మాల్స్‌ ముందుకు వచ్చాయి.


గుంటూరులో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదుతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా ఉలికిపాటుకు గురయ్యారు. బాధితుడిని గుంటూరు నుంచి విజయవాడకు తరలించినప్పటికీ అతడితో నాలుగైదు రోజులుగా సన్నిహితంగా మెలిగిన వారు వణికిపోతున్నారు. అయితే వారికై వారు చికిత్సకు ముందుకు రావడం లేదు. అధికారులు వారిని వెతుక్కుంటూ వారి ఇళ్ళకు వెళ్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి అతడితో పాటు రైల్లోనూ, ఆ తరువాత ఆటోలోనూ ప్రయాణించిన 9 మందిని గుర్తించిన అధికారులు వారిని గుర్తించి వైద్యులకు అప్పగించారు. వారికి గుంటూరు జనరల్‌ హాస్పిటల్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్సలు చేస్తున్నారు. బాధితుడు ఈ నెల 21న గుంటూరు నుంచి తాడికొండకు వెళ్లి అక్కడ నిర్వహించిన సమావేశానికి సుమారు 40 మంది హాజరైనట్లు తెలుసుకుని వారిలో కొందరిని గుర్తించి ఐసోలేషన్‌ వార్డుకు తరలించి పరీక్షలు చేస్తున్నారు. మిగతా వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. 


ఆందోళనలో వైద్య వర్గాలు

కరోనా బాధితుడికి ఎవరి ద్వారా వైరస్‌ సోకిందనేది ఎవరికీ అర్థం కావడంలేదు. ఢిల్లీలో జరిగిన పెద్ద సమావేశంలో అనేక రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి వేల సంఖ్యలోనే హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తిపై వైద్య వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. బాధితుడు ప్రజా ప్రతినిధికి బంధువు కావడం, ఎక్కువ మందితో కలిసే అవకాశం ఉండటంతో ఎవరెవరు కలిశారా అని ఆరాలు తీస్తున్నారు. బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని ప్రత్యేక జీజీహెచ్‌ ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఢిల్లీ నుంచి చేసిన ప్రయాణంలో అతడితో గడిపిన వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. గురువారం వారి వద్ద శాంపిల్స్‌ సేకరించి తిరుపతికి పంపారు. శుక్రవారం సాయంత్రానికి ఈ ఫలితాలు రానున్నాయి. ఐసోలేషన్‌ వార్డులో ప్రత్యేకంగా వ్యాధి నిర్థారణ అయిన వారికి శాస్ర్తీయతతో కూడిన చికిత్స అందించే ఏర్పాట్లు లేవని గురువారం వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.

    

పరీక్షల కోసం రావాలని వినతి

కరోనా బాధితుడితో పాటు ప్రయాణించిన వారితో పాటు, గుంటూరులో అతడితో సన్నిహితంగా మెలిగిన వారు స్వచ్ఛందంగా వచ్చి చికిత్సలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అతడితో కలిసిన వారిని గుర్తించి, పరీక్షలకు తరలించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఎవరికి వారుగా బాధ్యతగా ముందుకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొందరిని ఎంతో కష్టంగా పట్టుకుని ఆసుపత్రులకు తరలించగలిగామన్నారు. ఎవరికి వారే ఆసుపత్రులకు వచ్చి వ్యాధి నిర్ధారణ చేయించుకుంటే చికిత్సలు చేసి కాపాడడం సులువని తెలిపారు.


ఢిల్లీ వెళ్ళిన వారిలో పల్నాడు ప్రముఖులు కూడా..

కరోనా వ్యాధి సోకిన బాధితుడితో పాటు ఢిల్లీలో గడిపి తిరిగి జిల్లాకు చేరుకున్న వారిలో గుంటూరు నగరవాసులే కాకుండా పల్నాడు ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెనాలి ప్రాంతానికి చెందిన ఒకరు, మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన ఒకరు, మాచర్లకు చెందిన వారు 8 మంది, పిడుగురాళ్ళకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు స మాచారం. వీరి కోసం కూడా అధికారులుగాలిస్తున్నారు. 


3 కి.మీ వరకు.. నివారణ చర్యలు

గుంటూరు మంగళదాస్‌నగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుతో నగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలోని వ్యక్తికి పాజిటివ్‌గా జిల్లా వైద్య రోగ్య శాఖ ధ్రువీకరించడంతో ఆ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక పారిశుధ్య పనులకు నగరపాలక సంస్థ రంగంలోకి దిగింది. ఈ ప్రాంతమంతా వైరస్‌ నివారణ చర్యలు చేపట్టారు. కేసు నిర్థారణ జరిగిన ప్రాంతానికి మూడు కిలో మీటర్ల పరిధిలో 38 కాలనీలు ఉండగా వాటిని 1650 క్లస్టర్‌గా విభజన చేసి ప్రత్యేక పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నారు. బాధిత వ్యక్తి ఇంటి పరిసరాల్లో కమిషనర్‌ అనురాధ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి గురువారం పర్యటించి అధికార్లకు తగు ఆదేశాలు జారీ చేశారు.


ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వైరస్‌ పాజిటివ్‌ కేసుతో ఎమర్జెన్సీ బృందాన్ని సమన్వయం చేసుకుని మున్సిపల్‌ ఎమర్జెన్సీ బృందం  వేగంగా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని 1వ వార్డు సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి క్లస్టర్‌ ప్లాన్‌ రూపొందించామన్నారు. ఈ ప్రాంతంలో 58,843 గృహాలు, 4846 దుకాణ, వ్యాపార సంస్థలను గుర్తించి డోర్‌ టూ డోర్‌ సోడి యం హైపో క్లోరైడ్‌, బ్లీచింగ్‌ ద్రావణాన్ని రెండు ఫైర్‌ ఇంజన్లు, ఆరు ట్యాం కర్ల ద్వారా పిచికారి చేయిస్తున్నామన్నారు. 700 మంది పారిశుధ్య, 150 మంది మలేరియా విభాగ సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. ఈ ప్రాంతానికి అనుబంధంగా ఉన్న 10 ప్రధాన రహదారులను, 181 అంతర్గత రోడ్లను గుర్తించి మూసేశామన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు బయటకు రాకుండా ప్రచారం చేస్తున్నామన్నారు.


ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరం సమస్యలతో బాధపడుతుంటే తక్షణం ప్రభుత్వ వైద్యశాలకు, లేదా నగరపాలక సంస్థ కంట్రోల్‌ రూమ్‌ 0863 - 2345103, 2345104లో తెలియజేయాలన్నా రు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ జేడీ డాక్టర్‌ హైమావతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌, డిప్యూటీ కమిషనర్లు డీ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, సిటీ ప్లానర్‌ సునీత, ఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీదేవి, బయాలజిస్ట్‌ ఓబులుపాల్గొన్నారు.


ఇళ్లల్లో క్రిమి సంహారక రసాయనాలు వాడుకోవాలి

ప్రజలు తమ ఇళ్లల్లో తరుచుగా తాకే వస్తువులను క్రిమి సంహారక రసాయనాలు వాడుకోవాలని కమిషనర్‌ తెలిపారు.  ప్రజారోగ్య విభాగం సిబ్బంది గృహా ల గేట్ల వద్ద, జన సమూహాలు, పార్కులు రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్ల వద్ద పిచి కారి చేస్తున్నారన్నారు. సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని ప్రతి గృహంలోనికి వచ్చి స్ర్పే చేయడం కష్ట సాధ్యమన్నారు. అందువల్ల గృహస్థులే తరచుగా తాకే వస్తువలపై సోడియం హైపోక్లోరైట్‌, బ్లీచింగ్‌ ద్రావకంతో శుభ్రం చేసుకోవాలన్నారు.  


ఐదు ఐసోలేషన్‌ క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో ఐదు ఐసోలేషన్‌ క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. బాపట్లలోని హెచ్‌ఆర్‌డీ భవనం, గుంటూరు ఆర్‌టీసీ(ఎఫ్‌) బిల్డింగ్‌, తాడికొండ ఆర్‌హెచ్‌సీ బిల్డింగ్‌, చినకాకాని ఎన్‌ఆర్‌ఐ హాస్టల్‌, కోటప్పకొండలోని డీఆర్‌డీఏ బిల్డింగ్‌లు క్వారంటైన్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను వీటిల్లోకి తరలిస్తామన్నారు. ఈ కేంద్రాల్లో ఉండే వ్యక్తులకు కరోన వైరస్‌ అనుమానిత లక్షణాలు గుర్తిస్తే వారిని వెంటనే ఆస్పత్రులలోని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో పరిసరాల్లో వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జేసీ గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2020-03-27T09:20:32+05:30 IST