అధికార యంత్రాంగం అప్రమత్తం

ABN , First Publish Date - 2020-03-30T09:40:39+05:30 IST

రాష్ట్రంలో తొలి కరోనా మృతి జరిగిన ఖైరతాబాద్‌లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

అధికార యంత్రాంగం అప్రమత్తం

కరోనా మృతి జరిగిన ఖైరతాబాద్‌లో మేయర్‌, ఎమ్మెల్యే, అధికారుల పర్యవేక్షణ

క్లోరైడ్‌ మందుల పిచికారీ  8 576 ఇళ్లలో స్ర్కీనింగ్‌


ఖైరతాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలి కరోనా మృతి జరిగిన ఖైరతాబాద్‌లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌తోపాటు అనుమానితులు ఉన్న ఇందిరానగర్‌ కాలనీలో ఇంటింటికి వైద్య విభాగం, జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెళ్లి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీమ్‌ యిర్‌టెక్‌ యంత్రాలతో క్లోరైడ్‌ మందులను పిచికారీ చేశారు. ఈ పనులను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డి, ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, ఉప కమిషనర్‌ గీతారాధిక, అధికారులు పర్యవేక్షించారు.


కరోనా మృతి జరిగిన ప్రాంతాన్ని మేయర్‌  పరిశీలించి స్థానికులతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఖైరతాబాద్‌లో ప్రజల్లో భయం, ఆందోళన నెలకొందని, వాటిని దూరం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో 18 ఎయిర్‌టెక్‌ యంత్రాల ద్వారా క్లోరైడ్‌ మందులను పిచికారీ చేస్తున్నామని, వీటికి అదనంగా పది జెట్టింగ్‌ మిషన్‌లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ద్వారా ప్రధాన రహదారులతోపాటు అవసరమైన అన్ని ప్రాంతాల్లో మందులను పిచికారీ చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు కూరగాయలు సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ సహకారంతో 150 మొబైల్‌ వాహనాలను వినియోగిస్తూ నిర్ణీత ధరలకు విక్రయిస్తున్నామన్నారు. పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కావడానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, వారికి శానిటైజర్లు, గ్లౌజ్‌లు అందజేస్తున్నామన్నారు. 


మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు లేకుండా చేయడంతోపాటు హైదరాబాద్‌ నగరంలో 40వేల మంది భోజనం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విదేశాలకు వెళ్లి 18 వేల మందికిపైగా నగరానికి వచ్చారని, వీరిలో చాలామందిని హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచామని చెప్పారు. కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించడమే ఆయుధమని, దుకాణదారులు, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

Updated Date - 2020-03-30T09:40:39+05:30 IST